కివీస్‌పై గెలిచింది.. సెమీస్‌కు వెళ్లింది | England Beat New Zealand By 119 Runs And Qualify Semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌కు ఇంగ్లండ్‌..

Published Wed, Jul 3 2019 10:58 PM | Last Updated on Wed, Jul 3 2019 11:24 PM

England Beat New Zealand By 119 Runs And Qualify Semis - Sakshi

చెస్టర్‌ లీ స్ట్రీట్‌ : ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండానే ఆతిథ్య ఇంగ్లండ్‌ నేరుగా సెమీస్‌కు దూసుకెళ్లింది. ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌పై 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఇంగ్లండ్‌ సగర్వంగా నాకౌట్‌లోకి ప్రవేశించింది. 1992 ప్రపంచకప్‌ తర్వాత ఇంగ్లండ్‌ సెమీస్‌కు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఇంగ్లండ్‌ నిర్దేశించిన 306 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ 45 ఓవర్లలో 186 పరుగులకే కుప్పకూలింది. లక్ష్యఛేదనలో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ దారుణంగా విఫలమయ్యారు. టామ్‌ లాథమ్‌(57; 65 బంతుల్లో 5 ఫోర్లు)మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మార్క్‌ వుడ్‌ మూడు వికెట్లతో చెలరేగగా.. వోక్స్‌, రషీద్‌, స్టోక్స్‌, ఫ్లంకెట్‌, ఆర్చర్‌లు తలో వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి ఇంగ్లండ్‌కు మంచి స్కోర్‌ అందించిన బెయిర్‌ స్టోకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 
భారీ ఛేదనలో కివీస్‌కు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్లు మున్రో(0), గప్టిల్‌(8)లు మరోసారి విఫలమవడంతో కివీస్‌కు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. అనంతరం సీనియర్‌ ఆటగాళ్లు విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే దురదృష్టవశాత్తు విలియమ్సన్‌(27), టేలర్‌(28)లు స్వల్ప వ్యవధిలో ఇద్దరూ రనౌట్‌ కావడం కివీస్‌ కొంపముంచింది. అనంతరం ఏ దశలోనూ కివీస్‌ విజయంవైపు పయనించలేదు. లాథమ్‌ మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేకపోయారు. నీషమ్‌(9), గ్రాండ్‌హోమ్‌(3)లు పూర్తిగా నిరాశపరిచారు. దీంతో కివీస్‌ కనీసం 200 పరుగులు కూడా దాటలేకపోయంది. దీంతో భారీ ఓటమి చవిచూసింది.  
 
అంతకుముందు ఓపెనర్‌ బెయిర్‌ స్టో (106; 99 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సర్‌) విధ్వంసానికి తోడు జేసన్‌ రాయ్‌(60; 61 బంతుల్లో 8ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించడంతో న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. సారథి ఇయాన్‌ మోర్గాన్‌(42) కాస్త ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బౌల్ట్‌, నీషమ్‌‌, హెన్రీలు తలో రెండు వికెట్ల పడగొట్టగా.. సౌథీ, సాంట్నర్‌లు చెరో వికెట్‌ దక్కించుకున్నారు. 

బెయిర్‌ స్టో- రాయ్‌ల సూపర్‌ ఇన్నింగ్స్‌
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు మరోసారి అదిరే ఆరంభాన్ని అందించారు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడుతూ స్కోర్‌ బోర్డు పరిగెత్తించారు. వీరిద్దరి జోరుకు ఇంగ్లండ్‌ 15 ఓవర్లకే వంద పరుగులు సాధించింది. ఈ క్రమంలో వీర్దిదరూ అర్దసెంచరీలు పూర్తి చేసుకున్నారు. హాఫ్‌ సెంచరీ అనంతరం రాయ్‌ను నీషమ్‌ ఔట్‌ చేసి కివీస్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం బెయిర్‌ స్టో మరింత రెచ్చిపోయి ఆడాడు.

టిమ్‌ సౌథీ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టి బెయిర్‌ స్టో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ టోర్నీలో అతడికి రెండో సెంచరీ కావడం విశేషం. అనంతరం మ్యాట్‌ హెన్రీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అవుతాడు. అనంతరం కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కివీస్‌ ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచింది. దీంతో బ్యాట్స్‌మెన్‌ స్వేచ్చగా పరుగులు తీయడానికి ఇబ్బందులు పడ్డారు. రూట్‌(24), బట్లర్‌(11), స్టోక్స్‌(11), వోక్స్‌(4)లు వెంటవెంటనే ఔటయ్యారు. చివర్లో రషీద్‌(16‌), ఫ్లంకెట్‌(15 నాటౌట్‌) ధాటిగా ఆడే ప్రయత్నం చేయడంతో ఇంగ్లండ్‌ 300 పరుగులు దాటింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement