జోహన్నెస్‌బర్గ్: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. తన సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక టెస్టులు ఆడిన జట్టుగా ఉన్న ఇంగ్లండ్.. తాజాగా ఐదు లక్షల పరుగుల మార్కును చేరింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాల్గో టెస్టులో భాగంగా శుక్రవారం ఆటలో ఇంగ్లండ్ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇది ఇంగ్లండ్ 1,022వ టెస్టు. అది కూడా ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సింగిల్ తీయడం ద్వారా ఐదు లక్షల టెస్టు పరుగుల్ని చేరడం విశేషం. (ఇక్కడ చదవండి: బెన్ స్టోక్స్.. నువ్వు మారవా!)
ఇక ఈ జాబితాలో ఆసీస్ రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకూ 830 టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా 4,32, 706 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక భారత్ జట్టు 540 టెస్టులకు గాను 2,73,518 పరుగులతో మూడో స్థానంలో ఉండగా, వెస్టిండీస్ 545 టెస్టులతో 2,70,441 పరుగులతో నాల్గో స్థానంలో ఉంది. ఇదిలా ఉంచితే, దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా పోర్ట్ ఎలిజిబెత్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ద్వారా ఇంగ్లండ్ మరో ఘనతను కూడా నమోదు చేసింది. విదేశీ గడ్డపై ఐదు వందలు టెస్టులు ఆడిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా(404) రెండో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment