
భారత్ ఆశలు గల్లంతు
అండర్-19 ప్రపంచకప్
క్వార్టర్‌ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి
దుబాయ్: అండర్-19 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్‌కు చుక్కెదురైంది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి క్వార్టర్ ఫైనల్లో భారత్ మూడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో కంగుతింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. దీపక్ హుడా (68), సర్ఫరాజ్ ఖాన్ (46 బంతుల్లో 52 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించారు. ఆ తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లండ్ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని (222/7) చేరుకుని సెమీఫైనల్లోకి ప్రవేశించింది. డకెట్ (61), క్లార్క్ (42) పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
ముంచిన బ్యాట్స్‌మెన్
లీగ్ దశలో రాణించిన భారత బ్యాట్స్‌మెన్.. క్వార్టర్ ఫైనల్లో మాత్రం చేతులెత్తేశారు. ముఖ్యంగా టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. ఇంగ్లండ్ బౌలర్ విన్‌స్లేడ్ ఓపెనర్ అంకుశ్ బైన్స్(3)ను అవుట్ చేసి తొలి దెబ్బ తీయగా.. ఫిషర్ ఆ తర్వాత చెలరేగిపోయాడు. హర్వాద్కర్(2), శామ్సన్(0), రికీ భుయ్(7)లను పెవిలియన్ పంపాడు. దీంతో భారత్ 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ విజయ్ జోల్ (48), దీపక్ హుడా, సర్ఫరాజ్ ఖాన్ రాణించినా.. మిగిలిన వాళ్ల నుంచి సహకారం లేకపోవడంతో భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది.
ఇంగ్లండ్ కూడా కష్టపడి లక్ష్యాన్ని ఛేదించింది. కుల్‌దీప్ యాదవ్ (3/46) రాణించడంతో ఒక దశలో భారత్ విజయం దిశగా సాగింది. చివరి రెండు ఓవర్లలో ఇంగ్లండ్ విజయం కోసం 15 పరుగులు అవసరం కాగా... దీపక్ హుడా వేసిన 49వ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. దీంతో మ్యాచ్ ఇంగ్లండ్ వైపు వెళ్లిపోయింది. మరో క్వార్టర్ ఫైనల్లో పాకిస్థాన్ 121 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలిచి సెమీస్‌కు చేరింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో అఫ్ఘానిస్థాన్‌తోదక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో వెస్టిండీస్ తలపడనున్నాయి.