మాంచెస్టర్: ఇటీవల కాలంలో వన్డే ఫార్మాట్‌లో మూడొందలకుపైగా స్కోర్లను అవలీలగా సాధిస్తున్న జట్టు ఏదైనా ఉందంటే ఇంగ్లండ్ ముందు వరుసలో ఉంటుంది. ఆ జట్టు ఒక్కసారి కుదురుకుంటే భారీ ఇన్నింగ్స్‌లు నెలకొల్పుతూ మ్యాచ్‌లు ఎగరేసుకుపోతోంది. ప్రస్తుతం సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్‌కప్‌లో సైతం ఇంగ్లండ్ హవానే కొనసాగుతోంది. తాజాగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ పలు రికార్డులను నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరు వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోరు చేసింది. ఫలితంగా తమ వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక స్కోరును ఇంగ్లండ్ సాధించింది. అదే సమయంలో ఒక వరల్డ్‌కప్ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది.
అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు మొత్తం సాధించిన సిక్సర్లు 25. దాంతో 2015లో వెస్టిండీస్ సాధించిన 19 సిక్సర్ల రికార్డు తెరమరుగైంది. ఈ జాబితాలో ఇంగ్లండ్, వెస్టిండీస్‌ల తర్వాత దక్షిణాఫ్రికా(18 సిక్సర్లు-2007 వరల్డ్‌కప్‌లో), భారత్(18 సిక్సర్లు-2007 వరల్డ్‌కప్‌లో)లు సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి. ఇక వన్డే ఫార్మాట్‌లో కూడా అత్యధిక సిక్సర్లు సాధించిన జట్టుగా ఇంగ్లండ్ కొత్త అధ్యాయాన్ని లిఖించింది.మరొకవైపు ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 57 బంతుల్లో సెంచరీ సాధించడం ద్వారా వరల్ద్‌కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన నాల్గో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో ఒబ్రియన్(50 బంతుల్లో ఇంగ్లండ్‌పై), మ్యాక్స్‌వెల్(51 బంతుల్లో శ్రీలంకపై), ఏబీ డివిలియర్స్(52 బంతుల్లో వెస్టిండీస్‌పై)లు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో మోర్గాన్ 17 సిక్సర్లు కొట్టాడు. దాంతో ఒక వరల్డ్‌కప్ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడి రికార్డు సృష్టించాడు. అదే సమయంలో వన్డే ఫార్మాట్‌లో ఒక మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో కూడా మోర్గాన్ తొలి స్థానం ఆక్రమించాడు. ఇక్కడ రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్‌లు 16 సిక్సర్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. మోర్గాన్ 148 పరుగుల అత్యధిక వ్యక్తిగ పరుగులు సాధించగా, జో రూట్‌తో కలిసి 189 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఒక వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యంగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment