సిరీస్ కైవసం చేసుకున్న అఫ్గానిస్తాన్
రెండో టి20లోనూ జింబాబ్వే ఓటమి
హరారే: స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బంతితో విజృంభించడంతో జింబాబ్వేతో జరిగిన రెండో టి20లో అఫ్గానిస్తాన్ ఘనవిజయం సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో అఫ్గానిస్తాన్ 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జింబాబ్వేను మట్టికరిపించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో చేజిక్కించుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే జట్టు 19.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది.
కెప్టెన్ సికందర్ రజా (32 బంతుల్లో 37; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలినవాళ్లంతా విఫలమయ్యారు. బ్రెండన్ టేలర్ (3), మయెర్స్ (6), బెనెట్ (16), ర్యాన్ బుర్ల్ (10), మున్‌యోంగా (19), ముసెకివా (13), ఇవాన్స్ (12) విఫలమయ్యారు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 9 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... ముజీబ్, అబ్దుల్లా అహ్మద్‌జాయ్ చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో అఫ్గానిస్తాన్ 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్ (51 బంతుల్లో 57 నాటౌట్; 7 ఫోర్లు) అజేయ అర్ధ శతకంతో రాణించగా... అజ్మతుల్లా ఓమర్‌జాయ్ (13 బంతుల్లో 25 నాటౌట్; 5 ఫోర్లు) ధాటిగా ఆడాడు.
వికెట్ కీపర్ రహ్మనుల్లా గుర్బాజ్ (16; 2 ఫోర్లు, 1 సిక్స్), డార్విస్ రసూలి (17) తలా కొన్ని పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ 2 వికెట్లు పడగొట్టాడు. రషీద్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం నామమాత్రమైన చివరి టి20 జరగనుంది.


