చరిత్ర సృష్టించిన రషీద్‌ ఖాన్‌ | ZIM VS AFG 2nd Test: Rashid Khan Creates History, Takes Most Wickets By A Spinner After 6 Tests | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన రషీద్‌ ఖాన్‌

Published Mon, Jan 6 2025 6:42 PM | Last Updated on Mon, Jan 6 2025 7:19 PM

ZIM VS AFG 2nd Test: Rashid Khan Creates History, Takes Most Wickets By A Spinner After 6 Tests

ఆఫ్ఘనిస్తాన్‌ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రషీద్‌ ఖాన్‌ చరిత్ర సృష్టించాడు. ఆరు టెస్ట్‌ల తర్వాత అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. 26 ఏళ్ల రషీద్‌ ఆరు టెస్ట్‌ల అనంతరం 45 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్‌ స్పిన్నర్‌ అల్ఫ్‌ వాలెంటైన్‌, శ్రీలంక స్పిన్నర్‌ ప్రభాత్‌ జయసూర్య ఆరు టెస్ట్‌ల అనంతరం 43 వికెట్లు పడగొట్టి రషీద్‌ తర్వాతి స్థానంలో ఉన్నారు.

జింబాబ్వేతో జరిగిన రెండో టెస్ట్‌లో రషీద్‌ 11 వికెట్లు తీసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండో టెస్ట్‌లో విజయంతో ఆఫ్ఘనిస్తాన్‌ రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన రషీద్‌.. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు. రషీద్‌ తన ఆరు మ్యాచ్‌ల టెస్ట్‌ కెరీర్‌లో 5 ఐదు వికెట్ల ప్రదర్శనలు, 3 పది వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు.

  • రెండో ఇన్నింగ్స్‌లో రషీద్‌ నమోదు చేసిన గణాంకాలు (7/66) ఆఫ్ఘనిస్తాన్‌ తరఫున అత్యుత్తమమైనవి. రషీద్‌ తన సొంత రికార్డునే (7/137) అధిగమించి ఈ గణాంకాలు నమోదు చేశాడు.

రెండో స్థానంలో రషీద్‌
ఆరు టెస్ట్‌ల అనంతరం అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్‌ ఖాన్‌ (45) సౌతాఫ్రికా పేసర్‌ వెర్నన్‌ ఫిలాండర్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ చార్లీ టర్నర్‌ టాప్‌లో నిలిచాడు. టర్నర్‌ ఆరు టెస్ట్‌ల అనంతరం 50 వికెట్లు పడగొట్టాడు.

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు
ఈ మ్యాచ్‌లో 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రషీద్‌.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. టెస్ట్‌ క్రికెట్‌లో రషీద్‌తో పాటు సౌతాఫ్రికా పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ మాత్రమే వరుసగా రెండు టెస్ట్‌ల్లో 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.

జింబాబ్వేతో రెండో టెస్ట్‌ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్‌ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే (157) చాపచుట్టేసిన ఆఫ్ఘనిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పుంజుకుని 363 పరుగులు చేసింది. రహ్మత్‌ షా (139), ఇస్మత్‌ ఆలం (101) సెంచరీలతో కదంతొక్కారు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇస్మత్‌ అరంగేట్రంలోనే శతక్కొట్టాడు. ఎనిమిది అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి డెబ్యూలో​ సెంచరీ చేసిన 11 ఆటగాడిగా ఇస్మత్‌ ఆలం రికార్డుల్లోకెక్కాడు.

జింబాబ్వే విషయానికొస్తే.. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌ కంటే ఎక్కువ స్కోర్‌ చేసింది. సికందర్‌ రజా (61), క్రెయిగ్‌ ఎర్విన్‌ (75) అర్ద సెంచరీలతో రాణించడంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘనిస్తాన్‌ నిర్దేశించిన ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే తడబడింది. రషీద్‌ తన స్పిన్‌ మాయాజాలంలో జింబాబ్వేను 205 పరుగులకు పరిమితం చేశాడు. ఫలితంగా జింబాబ్వే లక్ష్యానికి 73 పరుగుల దూరంలో నిలిచిపోయింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement