కార్డిఫ్: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో శుక్రవారం జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో, ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ కీలకంగా మారింది. తొలి టీ20లో కేఎల్ రాహుల్ సెంచరీ చేయగా.... కుల్దీప్ ఐదు వికెట్ల ప్రదర్శన తోడవడంతో భారత్ తేలిగ్గా విజయం సాధించింది. కానీ రెండో టీ20లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. నాలుగు ఓవర్లు వేసిన ఈ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక్క వికెట్ కూడా తీయకపోగా, 34 పరుగులు సమర్పించుకున్నాడు.
సిరీస్ ఆరంభపు టీ20లో బ్యాట్స్‌మెన్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు గాను ఆతిథ్య జట్టు బౌలింగ్ యంత్రం సాయంతో మ్యాచ్ ప్రాక్టీస్ చేసింది. మెర్లిన్ అని పిలిచే ఈ మెషీన్ స్సిన్ బౌలర్ల బౌలింగ్ యాక్షన్‌ను అనుకరిస్తూ బంతులను విసురుతుంది.
దీనితో ఎక్కువ ప్రాక్టీస్ చేసిన అలెక్స్ హేల్స్ .. ఇంగ్లండ్ రెండో టీ 20లో విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 41 బంతుల్లో 58 పరుగులు చేయడంతో పాటు కుల్దీప్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. దీంతో రెండో టీ20లో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇలా స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఇంగ్లండ్ మెషీన్‌తో ప్రాక్టీస్ చేయడం 13 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2005లో యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ ఇదే తరహాలో బౌలింగ్ యంత్రంతో ప్రాక్టీస్ చేసింది. అప్పట్లో ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఇంగ్లండ్ మెర్లిన్ మెషీన్‌ను చివరసారి ఉపయోగించగా, ఇప్పుడు కుల్దీప్ భయంతో మరొకసారి మెర్లిన్ మెషీన్‌తో ప్రాక్టీస్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment