ఐదో టెస్టులో ఇంగ్లండ్ 218 ఆలౌట్
కుల్దీప్ యాదవ్‌కు 5 వికెట్లు
4 వికెట్లు తీసిన అశ్విన్
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 135/1
ధర్మశాలలో తొలి రోజే వాతావరణం భారత్‌కు అనుకూలంగా మారిపోయింది. గిర్రున తిరుగుతున్న బంతులను ఎదుర్కోలేక తలవంచిన ఇంగ్లండ్ అరవై ఓవర్ల లోపే పది వికెట్లనూ స్పిన్నర్లకే అప్పగించింది.
టాస్ గెలిచిన సానుకూలత, శుభారంభం తర్వాత ఒక దశలో 175/3తో మెరుగైన స్థితిలో నిలిచిన పర్యాటక జట్టు పేలవ ప్రదర్శనతో 43 పరుగులకే మిగిలిన 7 వికెట్లు చేజార్చుకుంది. ఎడంచేతి మణికట్టుతో కుల్దీప్ ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా, తన వందో టెస్టు మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో అశ్విన్ అండగా నిలిచాడు.
మరోమారు యశస్వి జైస్వాల్ దూకుడైన బ్యాటింగ్, రోహిత్ సహకారం వెరసి సిరీస్‌లో భారత్‌కు తొలిసారి ఓపెనింగ్‌లో సెంచరీ భాగస్వామ్యం... ఆట ముగిసేసరికి కేవలం 83 పరుగుల లోటుతో ముగించిన టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. ఇదే జోరు కొనసాగితే శుక్రవారమే చివరి టెస్టు పూర్తిగా భారత్ చేతుల్లోకి రావడం ఖాయం.
ధర్మశాల: ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమైన ఐదో టెస్టులో భారత్‌కు అన్ని విధాలా సరైన ఆరంభం లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 57.4 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. క్రాలీ (108 బంతుల్లో 79; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... మిగతా వారంతా విఫలమయ్యారు. కుల్దీప్ యాదవ్ (5/72) ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగగా, అశ్విన్‌కు 4 వికెట్లు దక్కాయి.
అనంతరం ఆట ముగిసే సమయానికి భారత్ 30 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేసి మరో 83 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. యశస్వి జైస్వాల్ (58 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), రోహిత్ శర్మ (52 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించగా... రోహిత్‌తో పాటు శుబ్‌మన్ గిల్ (26 బ్యాటింగ్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజ్‌లో ఉన్నాడు.
ఆడిన మూడు టెస్టుల్లో విఫలమైన రజత్ పటిదార్ స్థానంలో భారత్ దేవ్‌దత్ పడిక్కల్‌ను తొలిసారి తుది జట్టులోకి ఎంపిక చేసింది. మరోవైపు 100వ టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్‌కు కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా బీసీసీఐ ప్రత్యేక జ్ఞాపిక అందించింది.
టపటపా...
ఓపెనర్లు క్రాలీ, డకెట్ (27) ఇంగ్లండ్‌కు మరోసారి శుభారంభం అందించారు. అయితే కుల్దీప్ రాకతో పరిస్థితి మారిపోయింది. గిల్ అద్భుత క్యాచ్‌తో తన తొలి ఓవర్లోనే డకెట్‌ను వెనక్కి పంపిన కుల్దీప్... కొద్ది సేపటికే పోప్ (11)ను కూడా అవుట్ చేశాడు. లంచ్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు 100/2 కాగా, క్రాలీ కొన్ని చక్కటి షాట్లతో క్రీజ్‌లో పట్టుదలగా నిలబడ్డాడు.
అయితే రెండో సెషన్‌లో భారత స్పిన్నర్లు మరింతగా చెలరేగిపోగా... ఇంగ్లండ్ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. కుల్దీప్ బౌలింగ్‌లో అనూహ్యంగా టర్న్ అయిన బంతి క్రాలీ వికెట్లను ఎగరగొట్టగా, 100వ టెస్టు ఆడుతున్న బెయిర్‌స్టో (29) వికెట్ కూడా కుల్దీప్ ఖాతాలోనే చేరింది. ఆ తర్వాత ఇంగ్లండ్ పతనం వేగంగా సాగింది.
శుభారంభం...
భారత ఓపెనర్లు యశస్వి, రోహిత్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. 20 పరుగుల వద్ద రోహిత్‌ను అంపైర్ ఎల్బీగా ప్రకటించినా... రివ్యూలో అతను నాటౌట్‌గా తేలడం కలిసొచ్చింది. తొలి 27 బంతుల్లో 6 పరుగులే చేసి ఓపిక ప్రదర్శించిన యశస్వి స్పిన్నర్ల రాకతో చెలరేగిపోయాడు.
బషీర్ వేసిన తొలి ఓవర్లో అతను 3 సిక్సర్లు బాదాడు. అయితే బషీర్ ఓవర్లోనే వరుసగా రెండు ఫోర్లతో అర్ధ సెంచరీని దాటిన యశస్వి అదే ఊపులో మూడో బంతికి ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌటయ్యాడు. అనంతరం 77 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి కాగా, మరోవైపు గిల్ కూడా దూకుడుగా ఆడాడు.
పడిక్కల్@ 314
ఈ మ్యాచ్‌తో కర్ణాటకకు చెందిన దేవ్‌దత్ పడిక్కల్ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున ఇప్పటికే 2 టి20లు ఆడిన పడిక్కల్... టెస్టులు ఆడిన 314వ భారత ఆటగాడిగా నిలిచాడు.
17 ఇంగ్లండ్ తరఫున 100 టెస్టులు ఆడిన 17వ ప్లేయర్‌గా బెయిర్‌స్టో గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో అండర్సన్ (187), స్టువర్ట్ బ్రాడ్ (168), కుక్ (161), జో రూట్ (140), స్టివార్ట్ (133), బెల్ (118), గూచ్ (118), గోవర్ (117), అథర్టన్ (115), కొలిన్ కౌడ్రే (114), బాయ్‌కాట్ (108), పీటర్సన్ (104), బోథమ్ (102), స్టోక్స్ (102), స్ట్రాస్ (100), థోర్ప్ (100) ఉన్నారు.
14 భారత్ తరఫున 100 టెస్టులు పూర్తి చేసుకున్న 14వ ప్లేయర్‌గా అశ్విన్ ఘనత సాధించాడు. ఈ జాబితాలో సచిన్ (200), ద్రవిడ్ (163), లక్ష్మణ్ (134), కుంబ్లే (132), కపిల్‌దేవ్ (131), గావస్కర్ (125), వెంగ్‌సర్కార్ (116), గంగూలీ (113), కోహ్లి (113), ఇషాంత్ శర్మ (105), సెహ్వాగ్ (103), హర్భజన్ (103), పుజారా (103) ఉన్నారు.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (బి) కుల్దీప్ 79; డకెట్ (సి) గిల్ (బి) కుల్దీప్ 27; పోప్ (స్టంప్డ్) జురేల్ (బి) కుల్దీప్ 11; రూట్ (ఎల్బీ) (బి) జడేజా 26; బెయిర్‌స్టో (సి) జురేల్ (బి) కుల్దీప్ 29; స్టోక్స్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 0; ఫోక్స్ (బి) అశ్విన్ 24; హార్ట్‌లీ (సి) పడిక్కల్ (బి) అశ్విన్ 6; వుడ్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 0; బషీర్ (నాటౌట్) 11; అండర్సన్ (సి) పడిక్కల్ (బి) అశ్విన్ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (57.4 ఓవర్లలో ఆలౌట్) 218. వికెట్ల పతనం: 1–64, 2–100, 3–137, 4–175, 5–175, 6–175, 7–183, 8–183, 9–218, 10–218. బౌలింగ్: బుమ్రా 13–2–51–0, సిరాజ్ 8–1–24–0, అశ్విన్ 11.4–1–51–4, కుల్దీప్ 15–1–72–5, జడేజా 10–2–17–1.
భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (స్టంప్డ్) ఫోక్స్ (బి) బషీర్ 57; రోహిత్ (బ్యాటింగ్) 52; గిల్ (బ్యాటింగ్) 26; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (30 ఓవర్లలో వికెట్ నష్టానికి) 135. వికెట్ల పతనం: 1–104. బౌలింగ్: అండర్సన్ 4–1–4–0, మార్క్ వుడ్ 3–0–21–0, హార్ట్‌లీ 12–0– 46–0, షోయబ్ బషీర్ 11–2–64–1.
Comments
Please login to add a commentAdd a comment