రాజ్‌కోట్ టెస్టులో రెండో రోజు వెనుకబడినట్లు కనిపించిన భారత్ ఒక్కసారిగా మళ్లీ ఆధిపత్యం ప్రదర్శించింది... బజ్‌బాల్ మాయలో చేజేతులా వికెట్లు కోల్పోయి స్వీయాపరాధంతో ఇంగ్లండ్ తమ పతనానికి అవకాశం కల్పించగా... టీమిండియా చక్కటి బౌలింగ్‌తో పాటు దానిని అందిపుచ్చుకుంది.
అశ్విన్ లేని లోటు కనిపించకుండా మన బౌలర్లు ప్రత్యర్థిని పడగొట్టారు. ఆపై యువ యశస్వి మరో దూకుడైన ఇన్నింగ్స్‌తో వరుసగా రెండో సెంచరీ సాధించగా, గిల్ అండగా నిలిచాడు. ఇప్పటికే భారీ ఆధిక్యం సాధించిన భారత్ మ్యాచ్‌ను శాసించే స్థితిలో నిలిచింది. దీంతో ఆదివారం మరిన్ని పరుగులతో అసాధ్యమైన లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచడం ఖాయం.
రాజ్‌కోట్: ఇంగ్లండ్‌తో మూడో టెస్టును గెలిచి సిరీస్‌లో ఆధిక్యంపై భారత్ కన్నేసింది. మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (133 బంతుల్లో 104 రిటైర్డ్‌హర్ట్; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, శుబ్‌మన్ గిల్ (120 బంతుల్లో 65 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు.
వీరిద్దరు రెండో వికెట్‌కు 155 పరుగులు జోడించారు. వెన్ను నొప్పితో బాధపడుతూ మైదానం వీడిన యశస్వి మళ్లీ ఆదివారం బ్యాటింగ్ కొనసాగించే అవకాశం ఉంది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 207/2తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌటైంది.
బెన్ స్టోక్స్ (41) ఫర్వాలేదనిపించగా... మొహమ్మద్ సిరాజ్ 4 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం భారత్ ఓవరాల్‌గా 322 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇటీవల కన్నుమూసిన మాజీ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్‌కు నివాళిగా భారత క్రికెటర్లు భుజాలకు నల్ల బ్యాండ్‌లు ధరించి బరిలోకి దిగారు.
టపటపా...
పటిష్ట స్థితిలో మూడో రోజు ఆటను మొదలు పెట్టిన ఇంగ్లండ్ శనివారం స్వయంకృతంతో మంచి అవకాశం చేజార్చుకుంది. ప్రధాన బ్యాటర్ జో రూట్ (18) చేసిన తప్పుతో జట్టు పతనం మొదలైంది. మూడో రోజు ఐదో ఓవర్లోనే బుమ్రా బౌలింగ్‌లో అత్యుత్సాహంతో ‘రివర్స్ స్కూప్’ ఆడిన రూట్ స్లిప్‌లో యశస్వి సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు.
తర్వాతి ఓవర్లోనే చక్కటి బంతితో బెయిర్‌స్టో (0)ను కుల్దీప్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత 150 పరుగుల మార్క్‌ను అందుకున్న తర్వాత బెన్ డకెట్ (151 బంతుల్లో 153; 23 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో స్టోక్స్, బెన్ ఫోక్స్ (13) కలిసి క్రీజ్‌లో పట్టుదలగా నిలిచే ప్రయత్నం చేశారు. అయితే లంచ్ తర్వాత భారత బౌలర్లు మళ్లీ చెలరేగారు.
వరుస బంతుల్లో స్టోక్స్, ఫోక్స్‌లను పెవిలియన్ పంపించారు. రేహన్ (6), హార్ట్‌లీ (9) కూడా ఒకే స్కోరు వద్ద అవుట్ కాగా...యార్కర్‌తో అండర్సన్ (1) పని పట్టి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను సిరాజ్ ముగించాడు. 20 పరుగుల వ్యవధిలో ఇంగ్లండ్ చివరి 5 వికెట్లు పడ్డాయి.
భారీ భాగస్వామ్యం...
అండర్సన్ తొలి ఓవర్లో రోహిత్ శర్మ (19) కొట్టిన రెండు ఫోర్లతో భారత్ ఇన్నింగ్స్ మొదలైంది. అయితే కొద్ది సేపటికే రోహిత్‌ను ఎల్బీగా అవుట్ చేసి రూట్ ఇంగ్లండ్‌లో కాస్త ఆనందం నింపాడు. కానీ అది ఆ కొద్ది సేపటికే పరిమితమైంది. గత టెస్టు సెంచరీ హీరోలు యశస్వి, గిల్ మరో భారీ భాగస్వామ్యంతో జట్టును ఆధిక్యంలో నిలిపారు.
ఆరంభంలో వీరిద్దరు నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినా...ఆ తర్వాత దూకుడు పెంచారు. ముఖ్యంగా ఒక దశలో 73 బంతుల్లో 35 పరుగులతో ఉన్న యశస్వి ఆ తర్వాత మెరుపు షాట్లతో దూసుకుపోయాడు. అండర్సన్ ఓవర్లో వరుస బంతుల్లో 6, 4, 4 బాదడంతో ఇది షురూ అయింది.
హార్ట్‌లీ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 6, 6 కొట్టిన అతను తొలి సిక్స్‌తో 80 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత సెంచరీని చేరేందుకు యశస్వికి మరో 42 బంతులే సరిపోయాయి. ఈ క్రమంలో అతను ఏ బౌలర్‌నూ వదలకుండా మరో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు బాదాడు. అప్పటి వరకు ప్రేక్షకుడిగా ఉన్న గిల్ కూడా చెలరేగి వుడ్ ఓవర్లో సిక్స్, ఫోర్‌తో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ 445; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) పటిదార్ (బి) అశ్విన్ 15; డకెట్ (సి) గిల్ (బి) కుల్దీప్ 153; పోప్ (ఎల్బీ) (బి) సిరాజ్ 39; రూట్ (సి) యశస్వి (బి) బుమ్రా 18; బెయిర్‌స్టో (ఎల్బీ) (బి) కుల్దీప్ 0; స్టోక్స్ (సి) బుమ్రా (బి) జడేజా 41; ఫోక్స్ (సి) రోహిత్ (బి) సిరాజ్ 13; రేహన్ (బి) సిరాజ్ 6; హార్ట్‌లీ (స్టంప్డ్) జురేల్ (బి) జడేజా 9; వుడ్ (నాటౌట్) 4; అండర్సన్ (బి) సిరాజ్ 1; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (71.1 ఓవర్లలో ఆలౌట్) 319. వికెట్ల పతనం: 1–89, 2–182, 3–224, 4–225, 5–260, 6–299, 7–299, 8–314, 9–314, 10–319. బౌలింగ్: బుమ్రా 15–1–54–1, సిరాజ్ 21.1–2–84–4, కుల్దీప్ 18–2–77–2, అశ్విన్ 7–0–37–1, జడేజా 10–0– 51–2.
భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (రిటైర్డ్‌హర్ట్) 104; రోహిత్ (ఎల్బీ) (బి) రూట్ 19; గిల్ (నాటౌట్) 65; పటిదార్ (సి) రేహన్ (బి) హార్ట్‌లీ 0; కుల్దీప్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (51 ఓవర్లలో 2 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–30, 2–191. బౌలింగ్: అండర్సన్ 6–1–32–0, రూట్ 14–2–48–1, హార్ట్‌లీ 15–2–42–1, వుడ్ 8–0–38–0, రేహన్ 8–0–31–0.
Comments
Please login to add a commentAdd a comment