IPL 2025: కొత్త కెప్టెన్‌ పేరును ప్రకటించిన కేకేఆర్‌ | IPL 2025 KKR Announce Ajinkya Rahane As Captain Venkatesh Iyer To | Sakshi
Sakshi News home page

IPL 2025: కొత్త కెప్టెన్‌ పేరును ప్రకటించిన కేకేఆర్‌

Published Mon, Mar 3 2025 4:15 PM | Last Updated on Mon, Mar 3 2025 4:50 PM

IPL 2025 KKR Announce Ajinkya Rahane As Captain Venkatesh Iyer To

వెంకటేశ్‌ అయ్యర్‌- అజింక్య రహానే(PC: KKR X)

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL) ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కీలక ప్రకటన చేసింది. తమ కొత్త కెప్టెన్‌గా టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ అజింక్య రహానే(Ajinkya Rahane)ను నియమించినట్లు సోమవారం ప్రకటించింది. అదే విధంగా.. వెంకటేశ్‌ అయ్యర్‌(Venkatesh Iyer)కు కూడా కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలిపింది.

‘‘అజింక్య రహానే వంటి ఆటగాడు.. తన అనుభవం, పరిణతితో గొప్ప నాయకుడు అవుతాడని చెప్పేందుకు మేము సంతోషిస్తున్నాం. ఇక వెంకటేశ్‌ అయ్యర్‌ కూడా కేకేఆర్‌ నాయకత్వ విభాగంలో భాగంగా ఉంటాడు. 

వీరిద్దరు కలిసి కేకేఆర్‌ మరోసారి చాంపియన్‌గా నిలిచేందుకు.. టైటిల్‌ నిలబెట్టుకునేందుకు సహకారం అందిస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నాం’’ అని కోల్‌కతా ఫ్రాంఛైజీ తమ ప్రకటనలో పేర్కొంది.  కాగా ఐపీఎల్‌-2025లో కేకేఆర్‌కు రహానే కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. వైస్‌ కెప్టెన్‌గా వెంకటేశ్‌ అయ్యర్‌ సేవలు అందించనున్నాడు.

గతేడాది శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో
కాగా గౌతం గంభీర్‌ కెప్టెన్సీలో 2012, 2014లో చాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా జట్టు.. పదేళ్ల తర్వాత గతేడాది మరోసారి ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే. టీమిండియా మిడిలార్డర్‌ స్టార్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో కేకేఆర్‌ పద్నాలుగింట తొమ్మిది మ్యాచ్‌లు గెలిచి ప్లేఆఫ్స్‌ చేరింది.

క్వాలిఫైయర్‌-1లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టును ఓడించి ఫైనల్‌ చేరుకున్న కోల్‌కతా.. ఫైనల్లోనూ ఇదే ఫలితం పునరావృతం చేసింది. ప్యాట్‌ కమిన్స్‌ బృందాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి విజేతగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌(26 బంతుల్లో 52 నాటౌట్‌) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడి మరో 57 బంతులు మిగిలి ఉండగానే జట్టు విజయాన్ని ఖరారుచేశాడు.

విన్నింగ్‌ కెప్టెన్‌ను కోల్పోయి
అయితే, ఐపీఎల్‌-2025 మెగా వేలానికి ముందు శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు వెంకటేశ్‌ అయ్యర్‌ కేకేఆర్‌ ఫ్రాంఛేజీని వీడగా.. వెంకటేశ్‌ను కోల్‌కతా మళ్లీ భారీ ధర పెట్టి దక్కించుకుంది. అతడి కోసం ఏకంగా రూ. 23.75 కోట్లు ఖర్చు చేసింది. అయితే, శ్రేయస్‌ అయ్యర్‌ను పంజాబ్‌ కింగ్స్‌ ఏకంగా రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేయడంతో కేకేఆర్‌ తమ విన్నింగ్‌ కెప్టెన్‌ను కోల్పోయింది. 

ఇదిలా ఉంటే.. రూ. 1.50 కోట్లతో అజింక్య రహానేను కొనుక్కున్న కేకేఆర్‌ అతడిని సారథిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా టీమిండియా టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌గా పనిచేసిన రహానే.. దేశవాళీ క్రికెట్‌లో ముంబైకి విజయవంతమైన కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.

ఇక ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 185 మ్యాచ్‌లు ఆడిన రహానే రెండు శతకాల సాయంతో 4642 పరుగులు చేశాడు. మరోవైపు.. వెంకటేశ్‌ అయ్యర్‌ 50 మ్యాచ్‌లలో 1326 రన్స్‌ సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, 11 అర్థ శతకాలు ఉన్నాయి.

ఐపీఎల్‌-2025లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు, ఏ ఆటగాడు ఎంత ధరపలికాడంటే..
రింకూ సింగ్‌ (రూ. 13 కోట్లు) 
సునిల్‌ నరైన్‌ (రూ. 12 కోట్లు) 
ఆండ్రీ రసెల్‌ (రూ. 12 కోట్లు) 
వరుణ్‌ చక్రవర్తి (రూ. 12 కోట్లు) 
హర్షిత్‌ రాణా (రూ. 4 కోట్లు) 
రమణ్‌దీప్‌ సింగ్‌ (రూ.4 కోట్లు) 
వెంకటేశ్‌ అయ్యర్‌ (రూ.23.75 కోట్లు) 
ఆన్రిచ్‌ నోర్జే (రూ.6.50 కోట్లు) 
క్వింటన్‌ డికాక్‌ (రూ.3.60 కోట్లు) 
అంగ్‌కృష్‌ రఘువన్షీ(రూ.3 కోట్లు) 
స్పెన్సర్‌ జాన్సన్‌ (రూ. 2.80 కోట్లు) 
రహ్మనుల్లా గుర్బాజ్‌ (రూ.2 కోట్లు) 
మొయిన్‌ అలీ (రూ. 2 కోట్లు) 
వైభవ్‌ అరోరా (రూ.1.80 కోట్లు) 
రోవ్‌మన్‌ పావెల్‌ (రూ.1.50 కోట్లు) 
అజింక్య రహానే (రూ. 1.50 కోట్లు) 
మనీశ్‌ పాండే (రూ. 75 లక్షలు) 
ఉమ్రన్‌ మాలిక్‌ (రూ. 75 లక్షలు) 
అనుకూల్‌ రాయ్‌ (రూ. 40 లక్షలు) 
మయాంక్‌ మర్కండే (రూ. 30 లక్షలు) 
లవ్‌నిత్‌ సిసోడియా (రూ. 30 లక్షలు) 

చదవండి: BCCI: ‘రోహిత్‌ లావుగా ఉన్నాడు.. కెప్టెన్‌గానూ గొప్పోడు కాదు ’.. స్పందించిన బీసీసీఐ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement