
బర్మింగ్‌హామ్: అటు ఇంగ్లండ్ బౌలర్ల ప్రతాపం... ఇటు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ పోరాటం మధ్య చరిత్రాత్మక యాషెస్ సిరీస్ ఆసక్తిగా ప్రారంభమైంది. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (219 బంతుల్లో 144; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెరీర్‌లో 24వ శతకం సాధించడంతో గురువారం ఇక్కడి ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో మొదలైన టెస్టులో తొలి రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 80.4 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. స్మిత్‌కు లోయరార్డర్ బ్యాట్స్‌మెన్ పీటర్ సిడిల్ (85 బంతుల్లో 44; 4 ఫోర్లు) సహకరించాడు. అంతకుముందు ఇంగ్లండ్ పేసర్లు స్టువర్ట్ బ్రాడ్ (5/86), క్రిస్ వోక్స్ (3/58) ధాటికి 122 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఆసీస్ తక్కువ స్కోరే చేసేలా కనిపించింది. అయితే, స్మిత్ సెంచరీతో ఒడ్డుకు చేర్చాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ రెండు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది.
ఎక్కడినుంచి ఎక్కడకు...
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు అంతా ఎదురుగాలే వీచింది. ట్యాంపరింగ్ నిషేధం అనంతరం తొలిసారి టెస్టు ఆడుతున్న ఓపెనర్లు వార్నర్ (2), బాన్‌క్రాఫ్ట్ (8) నిరాశపర్చారు. వీరు బ్రాడ్ బౌలింగ్‌లో వెనుదిరిగారు. ఖాజా (13)ను వోక్స్ పెవిలియన్ చేర్చాడు. 35 పరుగులకే టాపార్డర్‌ను కోల్పోయిన దశలో నాలుగో వికెట్‌కు 64 పరుగులు జోడించి స్మిత్, హెడ్ (61 బంతుల్లో 35; 5 ఫోర్లు) ఆదుకున్నారు. అయితే, హెడ్, వేడ్ (1)లను వెంటవెంటనే ఔట్ చేసి వోక్స్ గట్టి దెబ్బకొట్టాడు. బ్రాడ్... కెప్టెన్ టిమ్ పైన్ (5), ప్యాటిన్సన్ (0)లను సాగనంపాడు. కమిన్స్ (5)ను స్టోక్స్ వెనక్కుపంపాడు.
అప్పటికి స్కోరు 122/8. స్మిత్‌కు సిడిల్ తోడయ్యాక అసలు ఆట ప్రారంభమైంది. 9వ వికెట్‌కు 140 బంతుల్లో 88 పరుగులు జోడించిన వీరు 200 పరుగుల మార్క్ దాటించారు. ప్రధాన పేసర్ అండర్సన్ గాయంతో నాలుగు ఓవర్లే బౌలింగ్ చేసి వెనుదిరగడం, స్టోక్స్ ప్రభావం చూపలేకపోవడం ఆసీస్‌కు కలిసొచ్చింది. సిడిల్‌ను ఔట్ చేసి మొయిన్ అలీ ఈ భాగస్వామ్యాన్ని విడదీసినా లయన్.. స్మిత్‌కు సహకరించాడు. స్మిత్ సెంచరీ (184 బంతుల్లో) పూర్తయ్యాక బ్యాట్ ఝళిపించాడు. పదో వికెట్‌కు 74 పరుగులు జోడించాక స్మిత్‌ను బ్రాడ్ బౌల్డ్ చేయడంతో కంగారూల ఇన్నింగ్స్‌కు తెరపడింది.
స్టీవ్ స్మిత్... 16 నెలల క్రితం టెస్టుల్లో నంబర్‌వన్ బ్యాట్స్‌మన్. ఆస్ట్రేలియాకు కెప్టెన్ కూడా. అప్పట్లో సెంచరీల మీద సెంచరీలు కొడుతూ సాగిపోతున్న అతడి బ్యాటింగ్ జోరు చూస్తే రికార్డులకే కళ్లుచెదిరేవి. కానీ ఒక్క బాల్ ట్యాంపరింగ్ ఉదంతం అంతా తలకిందులు చేసింది. ఆ ఘటనకు బాధ్యుడిగా కెప్టెన్సీ కోల్పోయి, ఏడాది పాటు క్రికెట్‌కూ దూరమై, విమర్శలతో మానసికంగానూ క్షోభను ఎదుర్కొన్నాడు స్మిత్. అయితే, అద్వితీయమైన సెంచరీతో ఇప్పుడా చేదు జ్ఞాపకాలను ఒక్కసారిగా తుడిపేశాడు. అది కూడా నిషేధం అనంతరం ఆడుతున్న తొలి టెస్టులోనే సాధించి తన స్థాయి ఏమిటో చాటాడు. మైదానం నలుమూలలా షాట్లు కొడుతూ తాను ఒకప్పటి స్మిత్‌నేనని ప్రత్యర్థులకు సందేశం పంపాడు.
ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులకు ఎదురొడ్డుతూ, లోయరార్డర్‌ను సమన్వయం చేసుకుంటూ అతడు సాగించిన పోరాటం అసలు సిసలు టెస్టు ఇన్నింగ్స్‌కు అద్దంపట్టింది. ఓపిక, సంయమనంతో సాగిన అతడి ఆట అందరి ప్రశంసలు పొందింది. బ్యాటింగ్‌కు దిగే సందర్భంలో మైదానంలో ప్రేక్షకుల నుంచి హేళన ఎదుర్కొన్న స్మిత్... ఔటై వెళ్తున్నప్పుడు అంతకుమించిన స్థాయిలో అభినందనలు పొందాడు. కెరీర్‌లో అతడు సాధించిన 23 శతకాలు ఒక ఎత్తు, గురువారం చేసిన సెంచరీ మరో ఎత్తు అనడంలో సందేహం లేదు. ఇదే సందర్భంలో స్మిత్ పరోక్షంగా ఇంగ్లండ్‌కు గట్టి హెచ్చరిక కూడా పంపాడు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో జరిగిన గత యాషెస్‌లో స్మిత్ అత్యద్భుత ఆటతో ఏకంగా ఒక డబుల్ సెంచరీ, మూడు సెంచరీలు బాదాడు మరి...!
Comments
Please login to add a commentAdd a comment