నాటింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఆరంభ పోరులో పటిష్ఠ దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన ఉత్సాహంలో ఉన్న హాట్ ఫేవరెట్ ఇంగ్లండ్ క్రికెట్ జట్టు తమ రెండో మ్యాచ్‌లో నేడు(సోమవారం) పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. ముందుగా పాక్‌ను బ్యాటింగ్ ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ జరిగే ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ బ్యాట్స్‌మెన్‌కు స్వర్గ ధామం. ఈ వికెట్‌పై ఇంగ్లండ్ ఏకంగా రెండుసార్లు అత్యధిక స్కోర్లతో వన్డే వరల్డ్ రికార్డులు నెలకొల్పడం విశేషం. తొలుత 2016లో పాకిస్తాన్‌పై 444/3తో మొదటిసారి ప్రపంచ రికార్డు సృష్టించింది. గత జూన్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనైతే 481/6తో సరికొత్త రికార్డు నెలకొల్పింది. రెండోసారి ప్రపంచ రికార్డు నెలకొల్పిన వికెట్‌పై జరుగుతుండడంతో మరి తమ రికార్డును ఇంగ్లండ్ మరోసారి తిరగ రాస్తుందేమో చూడాలి.
ఇదే మైదానంలో తమ ఆరంభ పోరులో వెస్టిండీస్ చేతిలో పాకిస్తాన్ ఘోర పరాజయం చవిచూసింది. మొదటి మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో విఫలమైన పాకిస్తాన్.. దూకుడు మీదున్న ఇంగ్లండ్‌ను ఏమాత్రం ఆపగలదో చూడాలి. ఇక ముఖాముఖి రికార్డులో ఇరు జట్లు ఇప్పటివరకు 87 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. వీటిలో 31 మ్యాచ్‌ల్లోనే పాకిస్తాన్ గెలిచింది. ఇంగ్లండ్ 53 మ్యాచ్‌ల్లో నెగ్గింది. మూడింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్‌లో 9 సార్లు ఎదురుపడగా చెరో నాలుగుసార్లు విజయం సాధించాయి. ఒకదాంట్లో ఫలితం రాలేదు. ఫైనల్లో ఇంగ్లండ్‌పై గెలవడం ద్వారానే పాక్ తమ ఏకైక ప్రపంచ కప్ (1992)ను సాధించడం విశేషం.
పాకిస్తాన్
సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్), ఇమాముల్ హక్, ఫకార్ జమాన్, బాబర్ అజమ్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, అసిఫ్ అలీ, షాదబ్ ఖాన్, హసన్ అలీ, వహబ్ రియాజ్, మహ్మద్ అమిర్
ఇంగ్లండ్
ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), జేసన్ రాయ్, బెయిర్ స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, మార్క్‌వుడ్
Comments
Please login to add a commentAdd a comment