
అంతా బాగుంది
టెస్టు నిర్వహణ ఏర్పాట్లపై శెట్టి సంతృప్తి
హైదరాబాద్: భారత్, బంగ్లాదేశ్ మధ్య వచ్చే నెల 9 నుంచి హైదరాబాద్‌లో జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ నిర్వహణపై ఉన్న సందేహాలు దాదాపుగా తొలగిపోయాయి. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) కమిటీ రాజకీయాలు, నిధుల సమస్య కారణంగా ఈ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరగడం అనుమానంగా కనిపించింది. అయితే బీసీసీఐ జనరల్ మేనేజర్ (గేమ్ డెవలప్‌మెంట్) రత్నాకర్ శెట్టి రాకతో అంతా చక్కబడినట్లు కనిపిస్తోంది. శెట్టి బుధవారం ఉప్పల్ స్టేడియాన్ని సందర్శించి తాజా పరిస్థితిని సమీక్షించారు. మైదానంలో ఉన్న సౌకర్యాలతో పాటు అవుట్ ఫీల్డ్‌ను, పిచ్‌ను కూడా పరిశీలించారు.
ప్రస్తుతం ఉన్న హెచ్‌సీఏ కార్యవర్గం మ్యాచ్ నిర్వహణ కోసం పూర్తిగా సహకరిస్తుందా అని శెట్టి సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. తమ నుంచి ఎలాంటి సమస్యా రాదని సభ్యులు ఆయనకు వివరించారు. వాణిజ్య ప్రకటనల ద్వారా రూ. 1.60 కోట్లు రావడంతో నిధులపరంగా కూడా సమస్య ఏమీ లేదని వారు రత్నాకర్ శెట్టికి వెల్లడించారు.