ప్రతీ క్రికెటర్కి అతనే ఆదర్శం: రైనా
ఢిల్లీ: భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై సహచర ఆటగాడు సురేష్ రైనా ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రతీ క్రికెటర్కి విరాటే ఆదర్శమంటూ కొనియాడాడు. పరుగుల యంత్రాన్ని తలపించే విరాట్ భిన్నమైన మైండ్ సెట్తో మూడు ఫార్మాట్లలో విశేషంగా రాణిస్తున్నాడని రైనా తెలిపాడు. 'ప్రతీ క్రికెటర్ విరాట్ ను చూసి నేర్చుకోవాలి. అటు వన్డేలు, టీ 20లు, టెస్టుల్లో విరాట్ ప్రత్యేక ముద్ర వేశాడు. అతనికి పరుగులు ఎలా చేయాలో తెలుసు. ప్రత్యేకంగా మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చే విరాట్ పరుగులు చేసే విధానం చాలా ఆసక్తిగా ఉంటుంది. ఆ స్థానంలో బ్యాటింగ్ వచ్చి భారీ శతకాలు ఎలా చేస్తున్నాడనేది తోటి క్రికెటర్లు నేర్చుకోవాలి. పొట్టి ఫార్మాట్లో విరాట్ ఛేజింగ్ చేసే విధానం నిజంగా అద్భుతం' అని రైనా కొనియాడాడు.
సురేష్ రైనా కంటే మూడు సంవత్సరాల తరువాత అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన కోహ్లి ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. విరాట్ 2008లో వన్డేల్లో వేగంగా 7000 పరుగులు, వేగంగా 25 సెంచరీలు, అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక సగటు, ఐపీఎల్ లో ఒకే సీజన్‌లో నాలుగు శతకాలు, ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేశాడు. దీంతో పాటు ఓవరాల్ ఐపీఎల్లో అత్యధిక పరుగుల నమోదు చేసిన రికార్డు కూడా కోహ్లి ఖాతాలోనే పడింది. ఇప్పటివరకూ ఐపీఎల్లో విరాట్ 4,110 పరుగులతో టాప్ లో ఉండగా, ఆ తరువాత స్థానంలో సురేష్ రైనా(4,098)ఉన్నాడు.