భయపడే ప్రసక్తే లేదు: ఫీల్డింగ్ కోచ్
పల్లెకెలె: శ్రీలంకతో రెండో వన్డేలో బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రయోగాలు చేయడం వల్లే భారత జట్టు మిడిల్ ఆర్డర్ కుప్పుకూలిందనే వాదనను ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తో్సిపుచ్చాడు. కొన్ని సందర్బాల్లో తడబాటు అనేది సహజంగానే జరుగుతుందనే విషయాన్ని గ్రహించాలన్నాడు. అంతేకానీ ఆ మ్యాచ్ లో ఏదో జరిగిందని భయపడుతూ ప్రయోగాలకు దూరంగా మాత్రం ఉండమన్నాడు. లంకేయులతో రెండో వన్డేలో ప్రయోగాలు చేయడం వల్ల కొన్ని విషయాలను నేర్చుకున్నామని ఈ సందర్భంగా శ్రీధర్ పేర్కొన్నాడు.
'ప్రతీ గేమ్ నుంచి ఏదొకటి నేర్చుకుంటూ ముందుకు సాగడంపైనే మాదృష్టి. లంకతో ఆడిన గత మ్యాచ్ లో ఒక అద్భుతమైన పాఠాన్ని అయితే మేము నేర్చుకున్నాం. ఒకవేళ ప్రయోగాలు చేయకపోతే నేర్చుకునేది ఏముంటుంది. ఆ మ్యాచ్ లో మిడిల్ ఆర్డర్ ను మార్చడం అనేది తప్పిదం కాదు. ధనుంజయ అసాధారణ రీతిలో బౌలింగ్ చేసి మమ్మల్ని కష్టాల్లోకి నెట్టాడు. దానిపై పూర్తి కసరత్తు చేసి తరువాత మ్యాచ్ కు వెళతాం. మరొకసారి ఆ తరహా ఉదాసీనతకు తావివ్వకుండా ఆడతాం. అంతేకానీ ప్రయోగాలు విషయంలో వెనుకడుగు వేయం. వన్డేల్లో ప్రయోగాలను కొనసాగిస్తాం. ఇక్కడ ప్రయోగాలు చేయకపోతే ఆటగాళ్ల నుంచి మెరుగైన ప్రదర్శన ఎలా వస్తుంది. వచ్చే 18 నెలల్లో ప్రయోగాలను చేస్తునే వరల్డ్ కప్ కు సన్నద్ధం కావడం మా గేమ్ ప్లాన్ లో భాగం 'అని శ్రీధర్ తెలిపాడు.