నడి సంద్రాన...
►దారి తెలియని స్థితిలో శ్రీలంక క్రికెట్
►వరుస పరాజయాలతో పతనం
కెప్టెన్‌కు ఏం చేయాలో తెలియడం లేదు... బౌలర్లకు కనీసం క్రమశిక్షణతో లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయడం రావడం లేదు... కనీస అవగాహన లేని విధంగా ఫీల్డింగ్ ఏర్పాట్లతో ఆశ్చర్యపోయే వ్యూహాలు... గత ఐదు వారాలుగా భారత్‌తో జరుగుతున్న పోరులో శ్రీలంక క్రికెట్ జట్టు ఆట, పరిస్థితి చూస్తే జాలి కలగక మానదు. సొంతగడ్డపై బెబ్బులిలా ఒకప్పుడు ప్రత్యర్థులను ఆటాడించిన శ్రీలంక ఇప్పుడు బేలగా కనిపిస్తోంది. టెస్టు సిరీస్ 0–3తో పోయింది. వన్డే సిరీస్‌లో ఇప్పటికే 0–4. ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తర్వాత గత రెండు దశాబ్దాల కాలంలో లంక ఇంత ఘోరంగా ఎప్పుడూ ఓడలేదు. అన్నింటికి మించి ఇప్పుడు భవిష్యత్తు కూడా అంతా చీకటిగానే కనిపిస్తోంది.
సాక్షి క్రీడా విభాగం : ‘శ్రీలంక క్రికెట్ సంధి దశలో ఉంది అంటూ ఇంకా ఎంత కాలం మోసం చేస్తారు. సంగక్కర రిటైర్ అయి కూడా రెండేళ్లు దాటింది. హెరాత్ వీల్‌చెయిర్‌లో కూర్చొని మ్యాచ్‌కు 150 ఓవర్లు బౌలింగ్ చేసినా కూడా అలాగే ఆడమని ఇంకా చెబుతారేమో. ఒక్క ఏడాదిలో వన్డేల కోసం 40 మందిని ఎంపిక చేస్తే మంచి జట్టు ఎలా తయారవుతుంది’... శ్రీలంక క్రికెట్‌తో సుదీర్ఘ అనుబంధం ఉన్న ఒక అడ్మినిస్ట్రేటర్ కమ్ అభిమాని ప్రశ్న ఇది. దిగ్గజాలు రిటైర్ అయ్యారు కాబట్టి ఫలితాలు రావడం లేదని, కుర్రాళ్లు తడబడుతున్నారనే వాదనలో నిజంగానే పస లేదు. చాలా జట్లు కూడా ఇలాంటి స్థితిని ఎదుర్కొన్నా...ఆ సమస్యను చాలా తొందరగానే అధిగమించాయి. సీనియర్లు ఉన్న సమయంలోనే కొత్త ఆటగాళ్లను సానబెట్టి తగిన మార్గనిర్దేశనం చేశాయి. కానీ శ్రీలంక మాత్రం అందులో విఫలమైంది. దాంతో టెస్టులైనా, వన్డేలైనా ఆ జట్టులో ప్రతీ సిరీస్‌కు కొత్త మొహాలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. గురువారం జరిగిన నాలుగో వన్డేలో బరిలోకి దిగిన లంక తుది జట్టులో ముగ్గురిని మినహాయిస్తే మిగిలిన వారిలో ఎవరికీ 37 వన్డేలకు మించి ఆడిన అనుభవం లేదు. సరిగ్గా చెప్పాలంటే ఐదుగురు 10 వన్డేల లోపే ఆడారు.
నాసిరకం ప్రదర్శన...
భారత్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌లలో శ్రీలంక ఒకే ఒకసారి 300 పరుగులు దాటగలిగింది. కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే చెరో సెంచరీ చేయగలిగితే, కేవలం ఆరు అర్ధ సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. భారత బ్యాట్స్‌మెన్‌తో పోలిస్తే ఇది చాలా పేలవమైన ఆట కిందే లెక్క. రెగ్యులర్ బౌలర్లలో ఒక్కరికి కూడా మూడు టెస్టులు ఆడే అవకాశమే రాలేదు. మూడో టెస్టులో హార్దిక్ పాండ్యాౖకైతే సెంచరీని వారు కానుకగా ఇచ్చారు. అతను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక దశలో బౌండరీ వద్ద తొమ్మిది మంది ఫీల్డర్లు ఉండటం ఆ జట్టు పనికిమాలిన వ్యూహాలకు సరైన ఉదాహరణ! వన్డే సిరీస్‌లో కూడా ఆ జట్టు ప్రదర్శన గురించి చెప్పేదేమీ లేదు. రెండో మ్యాచ్‌లో ధనంజయ సంచలన ప్రదర్శన మినహా జట్టును గెలిపించగల సామర్థ్యం ఏ ఒక్కరిలో కనిపించలేదు.
దెబ్బ తీస్తున్న రాజకీయాలు...
‘మైదానంలో లంక కెప్టెన్ ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు వెనుకాడుతున్నాడు. ఎందుకంటే అతను ఇంకా ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాడు’... తాజా సిరీస్‌లో లంక క్రికెట్ గురించి ఒక అభిమాని వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్య ఇది. ఇందులో వాస్తవం కూడా అంతే స్థాయిలో ఉంది. శ్రీలంక బోర్డు అధ్యక్షుడు తిలంగ సుమతిపాల తన ఇష్టారాజ్యంగా బయటి నుంచి జట్టును నడిపిస్తున్నారని ఆరోపణ ఉంది. జట్టు ఎంపికలో సుమతిపాలదే ప్రధాన పాత్రగా మారింది. ఆరు జట్లతో పటిష్టంగా ఉండాల్సిన దేశవాళీ క్రికెట్‌ను ఆయన భ్రష్టు పట్టించారు. తమ దేశవాళీ క్రికెట్ బాగుపడితే గానీ పరిస్థితి మారదని ఓపెనర్ కరుణరత్నే బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. గత సంవత్సర కాలంలో శ్రీలంక ఆటగాళ్లు తమ దేశవాళీలో ఐదంటే ఐదు వన్డేలు ఆడారు! అలాంటి ఆటగాళ్లు వచ్చి భారత్‌లాంటి జట్టుపై చెలరేగుతారని భావించడం అత్యాశే అవుతుంది.
శ్రీలంక ఆశలు విండీస్ ఆటపై...
ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్ ఇటీవల చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోవడం ఒక విషాదంలా కనిపించింది. కానీ ఇప్పుడు 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడేందుకు మరో మాజీ ప్రపంచ చాంపియన్ కూడా క్వాలిఫయింగ్ ఆడాల్సిన పరిస్థితికి చేరువైంది. భారత్‌తో సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లు గెలిస్తే శ్రీలంక నేరుగా తమ స్థానాన్ని ఖాయం చేసుకునేది. అయితే ఇప్పుడు నాలుగో వన్డేలో ఓటమితో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఆ జట్టు అవకాశాలు ఇప్పుడు విండీస్‌పై ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ చివరి మ్యాచ్‌లో భారత్‌పై లంక గెలిస్తే... ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో కలిపి ఆరు వన్డేల్లో విండీస్ ఐదు గెలిచిందంటే లంక కథ ముగుస్తుంది. ఆఖరి వన్డేలోనూ లంక ఓడితే... లంకను అధిగమించి అర్హత సాధించేందుకు విండీస్ 4 మ్యాచ్‌లు గెలిచినా సరిపోతుంది.