
అభిమాని శంకర్ కుటుంబంతో శిఖర్ ధావన్, అతడి భార్య ఆయేష
సాక్షి, హైదరాబాద్: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్‌కు ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఐపీఎల్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ తరపున ఆడుతున్న ధావన్‌ను ఓ అభిమాని ఆశ్చర్యానికి గురిచేశాడు. బెంగుళూరుకు చెందిన శంకర్ అనే వ్యక్తి ధావన్‌కు పెద్ద అభిమాని. తన అభిమాన క్రికెటర్‌ను కలవడానికి శంకర్ ఆదివారం ఏకంగా కుటుంబ సమేతంగా బెంగుళూరు నుంచి వచ్చాడు. శంకర్ తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి రావడంతో ‘గబ్బర్’ ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాడు. అతడిని నిరుత్సాహపరచకుండా అభిమాని కుటుంబంతో కలిసి ధావన్, అతడి భార్య ఆయేష ఫొటో దిగారు.
ఈ ఫొటోను ధావన్ తన ట్విటర్ పేజీలో పోస్టు చేశాడు. ‘నా వీరాభిమాని శంకర్‌ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నన్ను కలవడానికి శంకర్ కుటుంబ సమేతంగా ఏకంగా బెంగుళూరు నుంచి హైదరాబాద్ వచ్చారు. ఈ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. నాకు మద్దతుగా నిలుస్తు, నన్ను అభిమానిస్తున్న శంకర్‌కు అలానే నా అభిమానులందరికీ ధన్యవాదాలు’ అంటు ధావన్ ట్వీట్ చేశాడు.
ఢిల్లీకి చెందిన ఈ ఓపెనర్ ఈ ఐపీఎల్‌లో 8 మ్యాచ్‌లలో ఆడి 30.83 సగటుతో 185 పరుగులు సాధించాడు. వీటిలో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. పోయిన వారమే బీసీసీఐ శిఖర్ ధావన్‌ను ఈ ఏడాదికి గాను అర్జున అవార్డుకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. నిలకడగా రాణిస్తున్న అతడిని సీ గ్రేడ్ నుంచి ఏ+ గ్రేడ్‌కు బీసీసీఐ ప్రమోట్ చేసింది. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 విజయాలు, 2 ఓటములతో ఐపీఎల్ పాయింట్స్ పట్టికలో ప్రథమ స్థానంలో నిలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment