గెలవకున్నా... నిలువరించేలా కనిపించిన కోస్టారికా నుంచి బతుకు జీవుడా అంటూ బ్రెజిల్ బయటపడింది. మ్యాచ్‌లో ఆధిపత్యం చాటకున్నా... గోల్‌కు అవకాశం ఇవ్వకుండా మాజీ చాంపియన్‌ను కోస్టారికా అసహనానికి గురి చేసింది. పరిస్థితి చూస్తే ఈ ప్రపంచ కప్‌లో తొలిసారిగా స్కోరేమీ లేకుండా మ్యాచ్ ముగిసేలా కనిపించింది. ఇంజ్యూరీ సమయంలో పుంజుకున్న బ్రెజిల్ అనూహ్యంగా రెండు గోల్స్ చేసి విజయాన్ని ఒడిసిపట్టింది. ప్రత్యర్థిని టోర్నీ నుంచి బయటకు పంపించింది.
సెయింట్ పీటర్స్‌బర్గ్: పోరాడితే పోయేదేమీ లేదన్నట్లుగా ఆడుతున్న చిన్న జట్లు... ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్లకు చుక్కలు చూపిస్తున్నాయి. మేటి జట్లను కలవరపాటుకు గురిచేస్తూ... విజయం కోసం చెమటోడ్చేలా చేస్తున్నాయి. గ్రూప్ ‘ఇ’లో భాగంగా శుక్రవారం బ్రెజిల్‌పై కోస్టారికా ఇదే విధంగా ఆడి నిలువరిస్తుందేమో అనిపించింది. అయితే, ఒత్తిడిని తట్టుకుని నిలిచిన బ్రెజిల్... కీలకమైన ఇంజ్యూరీ సమయంలో గోల్స్ చేసి 2–0తో గెలుపొందింది. ఆ జట్టు తరఫున ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఫిలిఫ్ కౌటిన్హొ (90+1 నిమిషం), నెమార్ (90+7 నిమిషం) చెరో గోల్ చేశారు. ఈ విజయంతో బ్రెజిల్ ప్రిక్వార్టర్స్ అవకాశాలు సజీవంగా ఉండగా, రెండు ఓటములతో కోస్టారికా కప్ నుంచి నిష్క్రమించింది. ఓ దశలో ఎంత ప్రయత్నించినా గోల్స్ కాకపోవడంతో రెండు జట్ల ఆటగాళ్లు అసహనానికి గురై ఫౌల్స్ చేశారు. దీంతో ఇంజ్యూరీ సమయం పెరిగింది. ఇది కూడా బ్రెజిల్‌కు కలిసొచ్చింది. చివరి క్షణాల్లో నెమార్ గోల్ కొట్టి జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచాడు.
బంతి చిక్కినా... గోల్ దక్కలే...
బ్రెజిల్ నైపుణ్యానికి... కోస్టారికా పోరాటానికి పరీక్షలా సాగింది మొదటి భాగం. మ్యాచ్‌లో కోస్టారికా ప్రారంభం చూస్తే... ప్రణాళికతో దిగినట్లు కనిపించింది. బ్రెజిల్ తమ డిఫెన్స్‌ను పదేపదే ఒత్తిడిలోకి నెడుతున్నా, బంతిని దొరకబుచ్చుకోవడానికి యత్నించిన ఆ జట్టు ఆటగాళ్లు ప్రతి దాడులకూ వెరవలేదు. సహజ శైలిలో కనిపించని బ్రెజిల్ జట్టును చికాకు పెట్టారు. ఈ క్రమంలో మార్కొస్ యురేనా, క్రిస్టియన్ గంబోవాకు అవకాశాలు దక్కినా ఫినిషింగ్ లోపంతో చేజారాయి. మరోవైపు బంతిని పూర్తిగా ఆధీనంలో ఉంచుకుంటూ బ్రెజిల్... ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులకు దిగింది. అయితే డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. దీంతో మొదటి భాగం గోల్సేమీ లేకుండా ముగిసింది. ఈ భాగంలో 70 శాతం బంతి బ్రెజిల్ ఆటగాళ్ల వద్దే ఉండటం గమనార్హం.
రెండో భాగంలోనూ శూన్యమే...
సబ్‌స్టిట్యూట్‌లను దించకుండానే కోస్టారికా రెండో భాగాన్ని ప్రారంభించింది. ఆటలో ఆధిపత్యం కొనసాగిస్తూ వేగం, దూకుడు పెంచిన బ్రెజిల్‌కే అవకాశాలు చిక్కాయి. గ్రాబియెల్ జీసస్ కొట్టిన హెడర్, కౌటిన్హొ షాట్‌లు కొద్దిలో తప్పిపోయాయి. మరోవైపు కోస్టారికా ఆటగాళ్లు బ్రయాన్ రూయిజ్, సెల్సొ బొర్జెస్‌లు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, రెండు, మూడుసార్లు గోల్‌పోస్ట్‌కు దగ్గరగా వచ్చిన బ్రెజిల్ స్టార్ నెమార్... సఫలం కాలేకపోయాడు. గోల్ లేకుండానే నిర్ణీత సమయం పూర్తయింది. కానీ ఇంజ్యూరీ మొదటి నిమిషంలోనే ఈ నిరీక్షణకు కౌటిన్హొ తెరదించాడు. మిడ్ ఫీల్డర్ ఫిర్మినో తలతో అందించిన బంతిని గాబ్రియెల్ జీసస్ సమన్వయం చేసుకోలేకపోయినా కౌటిన్హొ చురుగ్గా స్పందించి కీపర్ నవాస్‌ను బోల్తాకొట్టిస్తూ గోల్‌గా మలిచాడు. 97వ నిమిషంలో డగ్లస్‌కోస్టా నుంచి పాస్‌ను అందుకున్న నెమార్... వేగాన్ని అదుపు చేసుకుంటూ మరో గోల్ కొట్టి ఆధిక్యం పెంచాడు. గాయాలతో ఇబ్బంది పడుతూనే ఆడుతున్న అతడికి టోర్నీలో ఇదే మొదటి గోల్ . దీంతో కొంత భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ మొత్తమ్మీద 67శాతం బంతి బ్రెజిల్ ఆధీనంలో ఉండగా, ఆ జట్టు 23 సార్లు దాడులకు దిగింది. రెండు జట్లు చెరో 11 ఫౌల్స్ చేశాయి.
బ్రెజిల్...బతుకుజీవుడా!
Published Sat, Jun 23 2018 12:53 AM | Last Updated on Sat, Jun 23 2018 12:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment