
ఒకరు హ్యాట్రిక్... మరొకరు హ్యాట్రిక్ మిస్!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లిష్ బౌలర్లు చెలరేగిపోయారు. ఒకరు హ్యాట్రిక్ చేయగా.. మరొకరు కొద్దిలో హ్యాట్రిక్ మిస్సయ్యారు. ఇంగ్లండ్ బౌలర్ ఫిన్.. వరుసగా మూడు వికెట్లు తీసి ఈ ప్రపంచకప్లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఫిన్ మొత్తం 5 వికెట్లు తీశాడు. ఇప్పటివరకు జరిగిన అన్ని ప్రపంచకప్ పోటీలలో ఇలా హ్యాట్రిక్ సాధించిన వాళ్లలో ఫిన్ ఏడో బౌలర్. ఇంతకు ముందు ఆరుగురు మాత్రమే ఈ ఫీట్ సాధించారు. 6 అడుగుల 7 అంగుళాల పొడవున్న ఫిన్.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లోని చిట్ట చివరి మూడు బంతుల్లోనే మూడు వికెట్లను తీయడం విశేషం.
అతడికి తోడుగా నిలిచిన మరో బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ కూడా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. వరుస బంతుల్లో ఓపెనర్ వార్నర్ (22), వాట్సన్ (0)ను అవుట్ చేశాడు. ఆ తర్వాతి బంతి మిస్ కావడంతో అతడికి హ్యాట్రిక్ తప్పినట్లయింది. ప్రపంచ కప్ పూల్-ఎలో భాగంగా శనివారం నాటి మ్యాచ్లో కంగారూలను ఈ ఇద్దరు బౌలర్లు కంగారెత్తించినా.. భారీ స్కోరు సాధించడం విశేషం.