
కోల్‌కతా: తన భర్త మహ్మద్ షమీకి వివాహేతర సంబంధాలున్నాయని, ఆ క‍్రమంలోనే తనను వేధింపులకు గురిచేస్తున్నారని భార్య హసీన్ జహాన్ ఇటీవల చేసిన ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఈ మేరకు కోల్‌కతా పోలీసులు షమీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. షమీకి వివాహేతర సంబంధాలు ఉండటమే కాకుండా, పెళ్లైనప్పటి నుంచి అత్తింటివారు గృహహింసకు పాల్పడుతున్నారని జహాన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా పలువురి యువతులతో షమీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, చాటింగ్ స్క్రీన్ షాట్‌లను ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఇవన్నీ షమీ ఫోన్‌లోనే గుర్తించినట్లు హాసిన్ జహన్ తెలిపారు.
ఓ చానెల్ తో మాట్లాడుతూ.. ‘2014లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీ బహుమతిగా ఇచ్చిన మొబైల్‌ను షమీ తన కారులో దాచిపెట్టాడు. ఇది తనకు దొరకడంతో ఇతర మహిళలతో అతను సాగిస్తున్న వ్యవహారం తెలిసింది. నేను పోస్టు చేసిన ఫొటోలు కొన్ని మాత్రమే. షమీ చాలా మంది యువతులతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. షమీ కుటుంబంలోని ప్రతి ఒక్కరు నన్ను వేధిస్తున్నారు. అతని తల్లి, సోదరుడు నాపై దుర్భాషలాడారు. ఉదయం రెండు గంటల నుంచి టార్చర్ మెదలెట్టారు. చంపాడానికి కూడా ప్రయత్నించారు' అని పేర్కొన్నారు. అయితే దీనిపై అధికారికంగా షమీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జహాన్. దాంతో శుక్రవారం షమీపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. షమితో పాటు మరో నలుగురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.