
బిష్‌కెక్ (కిర్గిస్తాన్): వరుసగా 13 మ్యాచ్‌ల్లో పరాజయం లేకుండా దూసుకెళ్తున్న భారత ఫుట్‌బాల్ జట్టుకు కిర్గిస్తాన్ బ్రేక్ వేసింది. ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–2 గోల్స్ తేడాతో కిర్గిస్తాన్ చేతిలో ఓడిపోయింది. కిర్గిస్తాన్ తరఫున జెమ్లియాన్‌ఖున్ (2వ నిమిషంలో), ముర్జయెవ్ (72వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. భారత్‌కు 88వ నిమిషంలో జెజె లాల్‌ఫెకులువా ఏకైక గోల్‌ను అందించాడు. ఈ మ్యాచ్‌లో భారత రెగ్యులర్ కెప్టెన్ సునీల్ చెత్రి బరిలోకి దిగలేదు.
ఇప్పటికే భారత్, కిర్గిస్తాన్ వచ్చే ఏడాది యూఏఈలో జరిగే ఆసియా కప్ ప్రధాన టోర్నమెంట్‌కు అర్హత సాధించడంతో ఈ మ్యాచ్ ఫలితం రెండు జట్లపై ఎలాంటి ప్రభావం చూపలేదు. చివరిసారి 2016 మార్చి 29న తుర్క్‌మెనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 1–2తో ఓడిన భారత్ ఆ తర్వాత వరుసగా 13 మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచింది. ఆడిన 13 మ్యాచ్‌ల్లో భారత్ 11 విజయాలు సాధించి, రెండింటిని ‘డ్రా’ చేసుకుంది.