కుల్దీప్ యాదవ్-చాహల్
కేప్‌టౌన్: ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో స్పిన్ ద్వయంగా ముద్ర వేసుకున్న కుల్దీప్ యాదవ్, చాహల్‌లు అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దూసుకుపోతున్న ఈ జంట.. దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన మూడో వన్డేలో ఒక రికార్డును సైతం ఖాతాలో వేసుకున్నారు. వీరిద్దరూ తలో నాలుగు వికెట్లు సాధించి సఫారీల పతనాన్ని శాసించారు. తద్వారా ఒకే వన్డేలో భారత్ తరపున తొలిసారి ఇద్దరు స్పిన్నర్లు నాలుగేసి వికెట్ల చొప్పున తీసిన ఘనతను సాధించారు.
మర్‌క్రామ్, క్రిస్ మోరిస్, ఫెలుక్‌వాయో, ఎన్‌గిడి వికెట్లను కుల్దీప్ సాధించగా, డుమినీ, హెన్రిచ్ క్లాసెన్, జోండో, ఇమ్రాన్ తాహీర్‌లను చాహల్ పెవిలియన్‌కు పంపాడు. నిన్నటి మ్యాచ్‌లో పోటీపడి వికెట్లు తీసిన వీరి దెబ్బకు దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో 179 పరుగులకే చేతులెత్తేసింది. దాంతో భారత జట్టు 124 పరుగుల తేడాతో విజయ సాధించి హ్యాట్రిక్ గెలుపును సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో భారత స్పిన్నర్లు ఇప్పటివరకూ సాధించిన వికెట్లు 21. ఫలితంగా దక్షిణాఫ్రికాలో ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్ల సాధించిన ఘనతను కూడా భారత్ తన పేరిట లిఖించుకుంది. ఇంకో వన్డే గెలిస్తే భారత్ జట్టు సిరీస్‌ను సాధించడంతో నంబర్ వన్ ర్యాంకును పదిలంగా ఉంచుకుంటుంది. శనివారం ఇరు జట్ల మధ్య జోహన్నెస్‌బర్గ్‌లో నాల్గో వన్డే జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment