డబ్లిన్: ఐర్లాండ్ పర‍్యటనను విజయవంతంగా ప్రారంభించడం పట్ల భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇది తనకు స్వదేశీ మ్యాచ్‌లో ఆడిన అనుభూతిని తీసుకొచ‍్చిందంటూ కుల్దీప్ చెప్పుకొచ‍్చాడు. ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయంలో కుల్దీప్ కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు సాధించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నాడు. అయితే తన ప‍్రదర్శనలో సహచర స్సిన్నర్ యజ్వేంద చాహల్ పాత్ర కూడా ఉందని కుల్దీప్ పేర్కొన్నాడు. మ్యాచ్ మధ్యలో పిచ్ పరిస్థితిని చాహల్ వివరించిన కారణంగానే వైవిధ్యమైన బంతుల్ని సంధించడానికి ఆస్కారం దొరికిందన్నాడు.
‘ఇది నా మొదటి యూకే పర్యటన. మంచి ఆరంభం దక్కింది. చాలా సంతోషంగా ఉంది. స్వదేశంలో ఆడిన అనుభూతి కల్గింది. భిన్న శైలిలో సరైన ప్రదేశాల్లో బంతులేయడానికి ప్రయత్నించాను. మ్యాచ్ ప్రారంభానికి ముందు నేను, చాహల్ బౌలింగ్ ఎలా వేయాలన్న దాని గురించి చాలా చర్చించుకున్నాం. ఈ మ్యాచ్‌లో చాహల్ నా కంటే ముందు బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత నా వద్దకు వచ్చి పిచ్ కొంచెం నెమ్మదిగా ఉంది అని చెప్పాడు. అందుకు తగ్గట్టుగా బౌలింగ్ చేశా. భిన్న శైలిలో బంతులేస్తే మా బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఇంగ్లండ్‌కు కూడా కష్టతరంగా ఉంటుంది’ అని కుల్దీప్ తెలిపాడు. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment