విశాఖ: ఇటీవల కాలంలో భారత క్రికెట్ జట్టులో కీలక పాత్ర పోషిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్ లు. ప్రధాన స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు గట్టి పోటీనిస్తూ సత్తా చాటుకుంటున్నారు వీరిద్దరూ. ఈ క్రమంలోనే అశ్విన్, జడేజాల స్థానానికి ఎసరపెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై గతంలో కుల్దీప్ యాదవ్ వివరణ ఇవ్వగా, తాజాగా యజ్వేంద్ర చాహల్ కూడా పెదవి విప్పాడు.
అసలు వారితో తమకు పోలిక తేవడం ఎంతమాత్రం సరైనది కాదంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. శ్రీలంకతో మూడో వన్డే ముగిసిన తరువాత మాట్లాడిన చాహల్..' మా ఇద్దరి లక్ష్యం ఒక్కటే.. సాధ్యమైనంతవరకూ అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం. కాకపోతే ఇటీవల కాలంలో మా ఇద్దర్ని అశ్విన్-జడేజాలతో పోల్చుతున్నారు. అది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. మేము ఆడిన ఎక్కువ మ్యాచ్‌లు భారత్‌లోనే ఆడాం. భారత్ తరహా పిచ్‌లను పోలి ఉండే శ్రీలంకలో ఒక్క సిరీస్ మినహా మిగతా సిరీస్‌లు అన్ని భారత్‌లో ఆడినవే. మేము ఎక్కువగా విదేశీ పిచ్‌లపై ఆడిన అనుభవం లేదు. టెస్టు క్రికెట్ ఆడటం అనేది ప్రతీ ఒక్కరి కల. గతేడాది రంజీ ట్రోఫీలు ఏడు మ్యాచ్‌లు ఆడాను. అది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది'అని ఇంకా భారత్ తరపున టెస్టుల్లో అరంగేట్రం చేయని చాహల్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment