విశాఖ:శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా స్పిన్నర్లు యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లు సత్తాచాటారు. శ్రీలంక భారీ స్కోరు దిశగా పయనిస్తున్న సమయంలో కుల్దీప్, చాహల్‌లు తమ స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించారు. వీరిద్దరూ తలో మూడు వికెట్లు సాధించి లంకేయుల్ని 215 పరుగులకే పరిమితం చేశారు. దానిలో భాగంగా లంకేయుల ఇన్నింగ్స్ ముగిసిన తరువాత మాట్లాడిన చాహల్.. ఈ వికెట్‌పై పరుగులు సాధించడం అంత ఈజీ కాదంటున్నాడు. ' లంకను సాధారణ స్కోరుకే పరిమితం చేయడంలో సక్సెస్ అయ్యాం. స్వల్ప విరామాల్లో వికెట్లు తీసి లంకను కట్టడి చేశాం. ఇది పరుగులు సాధించడానికి అంత సులువైన వికెట్ కాదు. నా బౌలింగ్ విషయంలోమహీంద్ర సింగ్ ధోనితో మాట్లాడా. వికెట్లే లక్ష్యంగా బౌలింగ్ చేస్తానని చెప్పా. బంతికి బంతికి ఎక్కువ సమయం తీసుకోకుండా బౌలింగ్ వేయడం కూడా వికెట్లు సాధించడానికి ఉపయోగపడింది. ఇదే మంత్రాన్ని గత కొన్ని సిరీస్‌ల నుంచి అవలంభిస్తున్నా' అని చాహల్ పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 216 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఉపుల్ తరంగా(95), సమరవిక్రమ(42) మినహా మిగతా వారు తీవ్రంగా నిరాశపరిచారు. ఈ జోడి రెండో వికెట్‌కు 121 పరుగులు భాగస్వామ్యం సాధించినా ఆపై వచ్చిన ఆటగాళ్లు ఆకట్టుకోలేదు. ఫలితంగా లంక జట్టు రెండొందల మార్కును చేరడానికి అపసోపాలు పడింది.
Comments
Please login to add a commentAdd a comment