వరుణుడు కరుణిస్తేనే..
♦ నేడు వెస్టిండీస్‌తో భారత్ రెండో వన్డే
♦ యువరాజ్ ఫామ్‌పై ఆందోళన
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: బలహీన వెస్టిండీస్‌పై క్లీన్‌స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టుకు తొలి వన్డేలోనే వర్షం దెబ్బ కొట్టింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లు కూడా ఆడకముందే భీకర వర్షంతో మ్యాచ్ రద్దయ్యింది. వర్షం వల్ల ఆట నిలిచే సమయానికి భారత్ 39.2 ఓవర్లలో మూడు వికెట్లకు 199 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం తెరిపినివ్వకపోవడంతో ఆట సాధ్యపడలేదు. దాంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇక నేడు (ఆదివారం) అదే క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడే కీలకం కానున్నాడు.
ఎందుకంటే ఆదివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశాలున్నాయి. ఓపెనర్లు శిఖర్ ధావన్, అజింక్యా రహానే సెంచరీ భాగస్వామ్యం తొలి వన్డేలో హైలైట్‌గా నిలిచింది. కెప్టెన్ కోహ్లి ఫామ్‌పై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. ఇక జట్టు ఆందోళనంతా డాషింగ్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ ఫామ్‌పైనే ఉంది. చాంపియన్స్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లో పాక్‌పై అర్ధ సెంచరీ చేసిన అనంతరం వరుసగా అతను చేసిన స్కోర్లు 7, 23 నాటౌట్, 22 మాత్రమే. విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో యువీ 4 పరుగులే చేయగలిగాడు. అతడి క్లాస్ ఆటతీరుతో పాటు అనుభవంపై ఎవరికీ సందేహాలు లేకున్నా 35 ఏళ్ల వయస్సు మున్ముందు కెరీర్‌కు ప్రతిబంధకం కావచ్చు.
ఇప్పటికే పలువురు మాజీలు యువీ జట్టులో ఉండడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అతడిపై ఓ నిర్ణయానికి రావాలని అండర్–19 కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇటీవల సూచించారు. ఈ నేపథ్యంలో విండీస్‌తో సిరీస్‌ను ఓ మంచి అవకాశంగా మలుచుకుని విమర్శకులకు గట్టి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అటు విండీస్ బౌలర్లు మ్యాచ్ జరిగిన కొద్దీ వికెట్లను తీసి కాస్త ఒత్తిడి పెంచాడు. రెండో వన్డేలోనూ పటిష్ట బ్యాటింగ్ లైనప్‌ను ఇబ్బంది పెట్టాలని విండీస్ బౌలింగ్ విభాగం ఆలోచిస్తోంది.
జట్లు (అంచనా): భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రహానే, ధోని, యువరాజ్, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, అశ్విన్, భువనేశ్వర్, ఉమేశ్, కుల్దీప్.
విండీస్: హోల్డర్ (కెప్టెన్), లూయిస్, పావెల్, హోప్, కార్టర్, మొహమ్మద్, చేజ్, నర్స్, జోసెఫ్, బిషూ, కమిన్స్.
సాయంత్రం 6.30 నుంచి టెన్–3లో ప్రత్యక్ష ప్రసారం