సన్నాహాలు పూర్తయ్యాయి. పోరుకు వ్యూహాలూ సిద్ధమయ్యాయి. ఇక సమరమే తరువాయి. అందుకు భారత, వెస్టిండీస్ క్రికెట్‌జట్లు కాలుదువ్వుతున్నాయి. పది నెలల విరామం తర్వాత విశాఖలో జరగబోతున్న వన్డేను ప్రత్యక్షంగా చూడాలని, ఆ ఆనందం మనసారా అనుభవించాలని వేలాది మంది అభిమానుల కళ్లు కలలు కంటున్నాయి. బుధవారం జరగబోయే డేనైట్ కదనం ఫలితం సంగతి అటుంచితే.. మ్యాచ్ రంజుగా సాగాలని.. కొన్న టిక్కెట్టుకు రెట్టింపుగా వినోదం సమకూరాలని అందరి హృదయాలూ ఆశిస్తున్నాయి... ఏ దిల్ మాంగే మోర్ అంటున్నాయి.
విశాఖ స్పోర్ట్స్: ఒకటి మీరు.. ఒకటి మేం.. మరి మూడో మ్యాచ్‌లో ఎవరిది పైచేయి? అన్నట్టుగా భారత, వెస్టిండీస్ జట్లు సమరానికి సిద్ధమయ్యాయి. విశాఖలో ప్రస్తుతానికి ఆధిక్యమెవరిదో తేల్చుకునే ధ్యేయంతో బరిలోకి దిగుతున్నాయి. ఇందుకోసం బుధవారం జరగనున్న వన్డే క్రికెట్ మ్యాచ్‌కు ఏర్పాట్లు పక్కాగా పూర్తయ్యాయి. ఇక్కడి వైఎస్‌ఆర్ స్టేడియంలో ఇరుజట్లు రెండు సార్లు తలపడగా చెరో విజయం లభించిన సంగతి తెలిసిందే. ఒక మ్యాచ్ తుపాను కారణంగా రద్దయింది. ఇప్పుడు సిరీస్‌లో రెండో వన్డేలో ఇరు జట్లూ తలపడబోతున్నాయి. మొదటి వన్డేలో ధాటిగా గెలిచిన భారత్ మంచి ఊపు మీద ఉన్న సంగతి తెలిసిందే. అయితే ధాటిగా బ్యాటింగ్ చేసి 300కు పైగా పరుగులు చేసిన వెస్టిండీస్ తమ చాన్స్ కోసం ఆరాటపడుతోంది.
ధాటిగా విండీస్ ప్రాక్టీస్
ఈ మ్యాచ్‌లోనైనా సత్తా చూపించాలన్న పట్టుదలతో ఉన్న వెస్టిండీస్ జట్టు మంగళవారం నెట్స్‌లో గట్టిగా కసరత్తు చేసింది.ఉదయాన్నే వెస్టిండీస్ జట్టు వైఎస్సార్ స్టేడియంలోని నెట్స్‌లో చెమటోడ్చింది. భారత్ జట్టు మధ్యాహ్నం నెట్స్‌లో ప్రాక్టీస్ చేసినా అంత సీరియస్‌నెస్ కనిపించలేదు. తొలి మ్యాచ్‌లో సెంచరీ వీరులు విరాట్‌కోహ్లి, రోహిత్ శర్మ ప్రాక్టీస్‌కు డుమ్మా కొట్టేశారు. అయితే ధోనీ మాత్రం సీరియస్‌గానే ప్రాక్టీస్ చేసాడు. ఉమేష్, షమి, చాహాల్, ఖలీల్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తే శిఖర్, రవీంద్ర బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. అంబటి రాయుడు నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తూండగా స్థానిక బౌలర్‌కు నేరుగా బంతి తగలడంతో గాయమైంది. అతడిని భారత జట్టు చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
కోహ్లీపై చూపు
స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ అతివేగంగా పదివేల పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. 204 ఇన్నింగ్స్‌లో విరాట్ ఇప్పటికే 9919 పరుగులు చేసేశాడు. మరో 81 పరుగులు చేస్తే ఈ రికార్డు సొంతం కానుంది. విశాఖ వేదికపై హాట్రిక్ సెంచరీల రికార్డును కోహ్లీ గతంలో వెంట్రుక వాసి తేడాలో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. 99 పరుగుల స్కోర్ వద్ద అతడు అవుటై అభిమానులను నిరాశపరిచాడు. ఈసారి పదివేల పరుగుల మార్కును ఇక్కడే అందుకోవాలని అంతా ఆశపడుతున్నారు. మరి అభిమానుల ఆశలు ఏమేరకు నెరవేరనున్నాయో.వన్డేల్లో అత్యంత వేగంగా ఐదువేల పరుగులు చేసిన రికార్డు సాధించేందుకు శిఖర్ ధావన్ మరో 173 పరుగుల దూరంలో ఉన్నాడు. రోహిత్ మరో సిక్స్ కొడితే వన్డేల్లో తెండుల్కర్ బాదేసిన 195 సిక్స్‌ల రికార్డు సమం చేస్తాడు. అయితే ధోనీ ఇప్పటికే 217 సిక్స్‌లు బాదేసిన విషయం గుర్తుంచుకోవాలి.
భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు
పీఎంపాలెం(భీమిలి): వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో భారత్–వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం జరగనున్న రెండో వన్డే మ్యాచ్ సందర్భంగా నగర కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా మ్యాచ్ నిర్వహణకు అవసరమైన పూర్తి స్థాయి చర్యలు చేపట్టారు. మొత్తం 1400 మంది పోలీసు సిబ్బందిని నియమించగా.. లా అండ్ ఆర్డర్ నుంచి 600 మంది, ట్రాఫిక్ విభాగం నుంచి 600 మంది, హోమ్ గార్డులు 200 మంది బందోబస్తు నిర్వహించనున్నారు. స్టేడియం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. స్టేడియం చుట్టూ ఉన్న 20 గేట్ల వద్ద విధులు నిర్వహించే పోలీసుల వివరాలను బుధవారం సాయంత్రం స్థానిక సీఐ కె.లక్ష్మణమూర్తి సీపీ ఆదేశాల మేరకు ప్రకటించారు. స్టేడియంలోని ఎంట్రీ గేట్లను 14 సెక్టార్లుగా విభజించి డీఎస్పీ స్థాయి అధికారులను ఇన్‌చార్జిలుగా నియమించారు.
గాయల కారణంగా అవకాశాలు మిస్
మిడిలార్డర్‌కు ఇదో చాలెంజ్...టాప్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ గావుంది. గాయాల బరిన పడటంతో కొంత వెనుకబడ్డాను. మళ్లీ మంచి అవకాశం కలిగింది. తొలివన్డేలో రాణించడం జట్టులో తిరిగి నిలదొక్కుకున్నట్లయ్యింది. జట్టు పూర్తి సన్నద్దతతో ఉంది. –అంబటి రాయుడు, బ్యాట్స్‌మన్ (ప్రీ మ్యాచ్ సెషన్‌లో..)
బౌలర్లపైనే బాధ్యత
మా బౌలర్లు మరింత మెరుగైన ప్రదర్శన చూపాలి. బౌలింగ్ పదును తేరాలి. కొత్త బంతితో మరిన్ని వికెట్లు తీయాలి. మొదటి వన్డేలో మేం కొత్త బంతితో ఒక్క వికెట్టు తీయగలిగాం. మరిన్ని వికెట్లు సాధించి ఉంటే ప్రత్యర్థి మీద ఒత్తిడి పెరిగేది. –హోల్డర్ , వెస్టిండీస్ కెప్టెన్
క్రీడాకారులకుఈరోజు పండగ
మావంటి క్రీడాకారులకు మ్యాచ్ జరిగే రోజే పండగ. అన్ని పండగల సంగతలా ఉం చితే.. క్రికెట్ మ్యాచ్ జరిగిన రోజు మాకు పర్వదినంలా ఉంటుంది. పైగా ఇలాటి స్టేడియం మా ప్రాంతంలో ఉండడం సంబరంగా ఉం టుంది.–పిళ్లా నర్శింగరావు, మధురవాడ
ఆనందానికి హద్దులేదు
అమ్మయ్య.. మ్యాచ్‌కు టిక్కెట్టు దొరికింది. ఈ మ్యాచ్ చూడడం కోసం ఎస్. కోట నుండి మా పిన్ని ఇంటికి వచ్చాను. కొన్ని గంటల్లో మ్యాచ్ చూడబోతున్న సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాను.
–యుగంధర్, క్రీడాభిమాని, ఎస్. కోట
Comments
Please login to add a commentAdd a comment