ఏక పక్షంగా సాగుతున్న భారత్–వెస్టిండీస్ సిరీస్‌లో నేడు మరో మ్యాచ్. సాగర తీర అందాల నగరం విశాఖపట్నం వేదికగా బుధవారం రెండో వన్డే. బెబ్బులిలా విరుచుకుపడుతున్న కోహ్లి సేన... ఘనమైన రికార్డున్న మైదానంలో ఇంకో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని ఆశిస్తుండగా, ఎంత ప్రయత్నించినా కనీస పోటీ ఇవ్వలేకపోతున్న హోల్డర్ బృందం... ఇక్కడ తమకు ఐదేళ్ల క్రితం అదృష్టవశాత్తు దక్కిన గెలుపును ఊహించుకుంటూ ఆశావహంగా బరిలో దిగుతోంది. కానీ, వరుస పరాజయాలతో డీలాపడి, టీమిండియా ముందు మరీ పసికూనలా కనిపిస్తున్న పర్యాటక జట్టుకు ఇదేమంత సులభం కాబోదు. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎప్పుడైనా చెలరేగే ఆటగాళ్లున్న విండీస్‌పై ఓ కన్నేసి ఉంచడం ఎందుకైనా మంచిది!
సాక్షి, విశాఖపట్నం: వరుసగా మూడు (రెండు టెస్టులు, తొలి వన్డే) ఘోర పరాజయాలు! వీటిలో వన్డేలో కొంత ప్రతిఘటన కనబర్చినా, టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ జోరుతో అది మరుగున పడింది. విజయానికి మొహం వాచిన పరిస్థితుల్లో వెస్టిండీస్‌కు కొంత మానసిక బలాన్నిస్తోంది 2013 నాటి విశాఖపట్నం వన్డే విజయమే. కానీ, అప్పటి కథ వేరు! నేటి సంగతి వేరు కోహ్లి సేన తాజా దూకుడు చూస్తుంటే... అదృష్టవశాత్తు నాడు దక్కిన ఆ గెలుపును విండీస్ కనీసం ఊహించలేని దైన్యం. ఈ నేపథ్యంలో మరో సాధికార ప్రదర్శనతో... ఇక్కడి డాక్టర్ వైఎస్‌ఆర్ ఏసీఏ–వీడీసీఏ మైదానంలో ప్రత్యర్థిని చుట్టేసేందుకు సిద్ధమవుతోంది మన జట్టు.
ఆ ఒక్క మార్పుతో...
గువాహటి వన్డేలో టీమిండియా ఇబ్బంది పడింది బౌలింగ్‌లోనే. పిచ్ బ్యాటింగ్‌కు సహకరించింది కాబట్టి బౌలర్లను పూర్తిగా తప్పుపట్టలేం. విశాఖలో మిగతా జట్టును యథాతథంగా కొనసాగించినా, ఒక బౌలర్‌ను మార్చే సూచన ఉంది. దీన్నిబట్టి చైనామన్ కుల్దీప్‌ను ఆడించొచ్చని తెలుస్తోంది. అయితే, అతడిని జడేజా స్థానంలో తీసుకుంటారా? లేక ఖలీల్ అహ్మద్‌ను తప్పించి తీసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది.ఆల్‌రౌండ్ నైపుణ్యాన్ని పరిగణిస్తే జడేజాకు చోటుంటుంది. కానీ, కోహ్లి... ఎడమచేతి వాటం పేసర్ ఖలీల్‌ను పరీక్షించి చూద్దామనుకుంటున్నాడు. తొలి మ్యాచ్‌లో మిగతా ఇద్దరి కంటే ఈ యువ పేసరే కొంత ఫర్వాలేదనిపించాడు. ప్రధాన పేసర్లు షమీ, ఉమేశ్‌తో పాటు అతడికి మరో అవకాశం దక్కొచ్చు. వీరితో పాటు చహల్ రాణిస్తే విండీస్ బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం పడినట్లే. బ్యాటింగ్‌లో టాప్ త్రయం ధావన్, రోహిత్, కోహ్లిలను కట్టడి చేయడం విండీస్‌కు తలకు మించిన భారమే. వీరు భారీ స్కోర్లు చేయడంలో విఫలమైతేనే రాయుడు, పంత్, ధోనిలకు పూర్తి స్థాయిలో బ్యాటింగ్‌కు అవకాశం దక్కుతుంది. ఆ విధంగా చూసినా, మిడిలార్డర్ సత్తాను పరీక్షకు గురిచేసే ఈ పరిణామం భారత్‌కు ఒకింత మేలే.
‘విన్’డీస్ బెంగ తీరేదెలా?
భారీ స్కోరు చేసి మరీ... తొలి వన్డేను మరో 8 ఓవర్లు ఉండగానే సమర్పించుకున్న వెస్టిండీస్‌కు సిరీస్ రానురాను గండమే అన్నట్లుంది. గువాహటిలో ఆ జట్టు బౌలర్లు చేష్టలుడిగిపోయారు. దీంతో విశాఖలో పేస్ మేళవింపు మార్చే యోచనలో ఉంది. అయితే, సీనియర్ కీమర్ రోచ్‌కు జతగా పేస్ భారాన్ని పంచుకునేదెవరో స్పష్టం కావాల్సి ఉంది. బహుశా ఒషేన్ థామస్‌ను కాదని అల్జారి జోసెఫ్, కీమో పాల్‌లలో ఒకరికి చోటివ్వచ్చు. స్పిన్‌లో ఆష్లే నర్స్‌ను తప్పించి ఫాబియాన్ అలెన్‌ను దింపే అవకాశం ఉంది. ఇక బ్యాటింగ్‌లోనూ కొంత నిలకడ అవసరమే. అత్యంత అనుభవజ్ఞుడైన మార్లోన్ శామ్యూల్స్ తొలి వన్డేలో ఖాతా తెరవలేకపోయాడు. హేమ్‌రాజ్ విఫలమయ్యాడు. హెట్‌మైర్ మెరుపు శతకమే జట్టును కాపాడింది. ఓపెనర్ కీరన్ పావెల్, షై హోప్ నాణ్యమైన బ్యాట్స్‌మెనే. భారీ ఇన్నింగ్స్ ఆడగలరు. వీరికి కెప్టెన్ హోల్డర్, రావ్‌మన్ పావెల్ తోడైతే జట్టు ఎంతటి పెద్ద లక్ష్యాన్నైనా ఛేదించగలదు. ముందుగా బ్యాటింగ్ చేసినా వీరిని నిలువరించడం ముఖ్యమే.
ప్రాక్టీస్‌కు విరాట్ కోహ్లి దూరం...
మంగళవారం విండీస్ ఆటగాళ్లందరూ ప్రాక్టీస్‌కు హాజరయ్యారు. భారత టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం ఆప్షనల్ ప్రాక్టీస్æ సెషన్ నిర్వహించడంతో కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, పేస్ బౌలర్లు ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నారు. ధోని, రిషభ్ పంత్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, కుల్దీప్, మనీశ్ పాండే, ధావన్ ప్రాక్టీస్ చేశారు. ఈ మైదానంలో జరిగిన ఏడు వన్డేల్లోనూ టాస్ గెలిచిన జట్టే విజయం సాధించింది. నేటి మ్యాచ్ భారత్‌కు 950వ వన్డే కానుంది. ఇప్పటివరకు 949 వన్డేలు ఆడిన భారత్ 490 మ్యాచ్‌ల్లో గెలిచి, 411 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 8 మ్యాచ్‌లు ‘టై’కాగా... 40 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. భారత్ తర్వాత వరుసగా ఆస్ట్రేలియా (916), పాకిస్తాన్ (899) ఉన్నాయి.
అచ్చొచ్చిన చోట...
విశాఖపట్నం...ధోని! 13 ఏళ్ల క్రితం ఈ రెండు పేర్లూ ఒకేసారి మార్మోగాయి. ఇక్కడి స్టేడియంలో 2005లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో వన్డేలో ధోని ఆడిన ఇన్నింగ్స్ అలాంటిది మరి! ఆ మ్యాచ్‌లో సుడిగాలిలా చెలరేగిన ధోని 148 పరుగులు చేసి ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకున్నాడు. తాజాగా వెస్టిండీస్‌తో రెండో వన్డే ఆడేందుకు వచ్చిన మహి... మంగళవారం మైదానంలోకి వెళ్లి పిచ్‌ను పరిశీలించాడు.గ్రౌండ్స్‌మెన్‌తో కాసేపు ముచ్చటించాడు. ఈ సందర్భంగా, ‘ఈ మైదానం, నగరంతో ప్రత్యేక అనుబంధం, జ్ఞాపకాలు ఉన్న రాజు ఇక్కడున్నాడు. మరిన్ని ఘనతలు రేపు నెలకొల్పనున్నాడు’ అంటూ బీసీసీఐ ట్వీట్ చేయడం గమనార్హం. మరోవైపు అచ్చొచ్చిన విశాఖను, స్థానిక ప్రకృతి అందాలను మహి గతంలో పలుసార్లు ప్రస్తావించాడు. మరో రెండు సిక్స్‌లు బాదితే... భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన రెండో బ్యాట్స్‌మన్‌గా సచిన్ టెండూల్కర్ (195)ను వెనక్కి నెట్టి రోహిత్ శర్మ ముందుకొస్తాడు. భారత్ తరఫున అత్యధిక సిక్స్‌ల ఘనత ధోని (217) పేరిట ఉంది.
Comments
Please login to add a commentAdd a comment