భువీ... పడగొట్టేశాడు | Kohli, Bhuvneshwar shine as India beat West Indies by 59 runs | Sakshi
Sakshi News home page

భువీ... పడగొట్టేశాడు

Published Tue, Aug 13 2019 3:36 AM | Last Updated on Tue, Aug 13 2019 5:30 AM

Kohli, Bhuvneshwar shine as India beat West Indies by 59 runs - Sakshi

భువనేశ్వర్‌కు సహచరుల అభినందన

వన్డే సిరీస్‌లోనూ భారత్‌ ఆధిపత్యం మొదలైంది. బ్యాటింగ్‌లో కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌ భారత్‌ స్కోరుకు బాటలు వేయగా... భువనేశ్వర్‌ తన పేస్‌తో విండీస్‌ ఇన్నింగ్స్‌ను కూల్చేశాడు. కుల్దీప్‌ స్పిన్‌తో ఇబ్బంది పెట్టాడు. దీంతో వాన అంతరాయం కలిగించినా... టీమిండియా విజయాన్ని అడ్డుకోలేకపోయింది.  

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: కరీబియన్‌ గడ్డపై ఇక ఈ వన్డే సిరీస్‌ కూడా భారత్‌ కోల్పోదు. ఆఖరి మ్యాచ్‌లో ఓడినా సమమైనా చేసుకుంటుంది కానీ... చేజార్చుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే రెండో వన్డేలో భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 59 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై గెలుపొందింది. దీంతో 1–0తో సిరీస్‌లో ఆధిక్యంలోకి వచ్చింది. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్‌ (4/31) ధాటికి వర్షం అడ్డుపడిందేమోగానీ... ప్రత్యర్థి శిబిరం నుంచి ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌ ఎదురుపడలేదు.

భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారు జామున ముగిసిన ఈ మ్యాచ్‌లో మొదట టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 279 పరుగులు చేసింది. కోహ్లి (125 బంతుల్లో 120; 14 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ సాధించగా, అయ్యర్‌ (68 బంతుల్లో 71; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. వర్షం అంతరాయం కలిగించడంతో వెస్టిండీస్‌ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 270 పరుగులకు కుదించారు. కానీ విండీస్‌ మాత్రం ఆ ఓవర్లదాకా ఆడలేకపోయింది. 42 ఓవర్లలో 210 పరుగులకే ఆలౌటైంది. స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (2/59) తిప్పేయగా, షమీ (2/39) ఆఖరి స్పెల్‌తో ముగించాడు. శతక్కొట్టిన కోహ్లికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి వన్డే వర్షార్పణమవగా... ఆఖరి వన్డే రేపు ఇక్కడే జరుగుతుంది.

లూయిస్‌ ఒక్కడే...
గేల్, షై హోప్, నికోలస్‌ పూరన్, బ్రాత్‌వైట్‌ లాంటి హిట్టర్లున్న జట్టుకు సొంతగడ్డపై 270 పరుగుల లక్ష్యం కష్టమే కాదు. కానీ పూరన్‌ మినహా ఇంకెవరూ కష్టపడలేదు. 300 వన్డే ఆడుతున్న గేల్‌ (11) విఖ్యాత బ్యాట్స్‌మన్‌ లారా (10,348) అత్యధిక పరుగులు చేసిన విండీస్‌ బ్యాట్స్‌మన్‌ ఘనతను 10,353 పరుగులతో తన పేర లిఖించుకున్నాడు. కానీ ఆటలో విఫలమయ్యాడు. హోప్‌ (5), హెట్‌మైర్‌ (18), చేజ్‌ (18) కూడా చేతులెత్తేశారు. ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌ (80 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్స్‌), పూరన్‌తో కలిసి పోరాడాడు.

ఇద్దరు నాలుగో వికెట్‌కు 56 పరుగులు జోడించారు. ఒక దశలో విండీస్‌ 148/3 స్కోరు వద్ద పటిష్టంగా కనిపించింది. కానీ అదే స్కోరు వద్ద లూయిస్‌... కుల్దీప్‌ స్పిన్‌లో చిక్కుకున్నాడు. పూరన్‌ను భువీ ఔట్‌ చేయడంతో 179 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత విండీస్‌ చకాచకా వికెట్లను కోల్పోయి లక్ష్యానికి దూరమైంది. మిగతా సగం వికెట్లు కేవలం 31 పరుగుల వ్యవధిలోనే పడటంతో విండీస్‌ 210 స్కోరు వద్ద ఆలౌటైంది. బ్రాత్‌వైట్‌ (0), కీమర్‌ రోచ్‌ (0) డకౌటయ్యారు. జట్టు స్కోరును 200 పరుగులు దాటించాకా కాట్రెల్‌ (17), థామస్‌ (0)లను షమీ ఓకే ఓవర్లో ఔట్‌ చేయడంతో విండీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: 279/7; వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: గేల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) భువనేశ్వర్‌ 11; లూయిస్‌ (సి) కోహ్లి (బి) కుల్దీప్‌ 65; హోప్‌ (బి) అహ్మద్‌ 5; హెట్‌మైర్‌ (సి) కోహ్లి (బి) కుల్దీప్‌ 18; పూరన్‌ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్‌ 42; చేజ్‌ (సి అండ్‌ బి) భువనేశ్వర్‌ 18; హోల్డర్‌ (నాటౌట్‌) 13; బ్రాత్‌వైట్‌ (సి) షమీ (బి) జడేజా 0; రోచ్‌ (బి) భువనేశ్వర్‌ 0, కాట్రెల్‌ (సి) జడేజా (బి) షమీ 17; థామస్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 0; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (42 ఓవర్లలో ఆలౌట్‌) 210

వికెట్ల పతనం: 1–45, 2–52, 3–92, 4–148, 5–179, 6–179, 7–180, 9–209, 10–210.

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 8–0–31–4, షమీ 8–0–39–2, అహ్మద్‌ 7–0–32–1, కుల్దీప్‌ 10–0–59–2, జాదవ్‌ 5–0–25–0, జడేజా 4–0–15–1. 

పొదుపుగా బౌలింగ్‌ చేద్దామనుకుంటే...
నేను బౌలింగ్‌కు వచ్చినపుడు ఒకటే ఆలోచించా... డాట్‌ బాల్స్‌ వేయాలని, పొదుపుగా బౌలింగ్‌ చేయాలని..! కానీ అనూహ్యంగా వికెట్లు కూడా దక్కడం ఆనందాన్నిచ్చింది. నిజానికి నేనసలు మ్యాచ్‌ ఫలితంపై ఆలోచించలేదు. అయితే ఒకట్రెండు వికెట్లు తీస్తే గెలుపుదారిన పడతామనిపించింది. భారత్‌ బ్యాటింగ్‌లో కెప్టెన్‌ కోహ్లి సెంచరీ కూడా లక్ష్యాన్ని కాపాడుకునేందుకు దోహదం చేసింది. వాన చినుకులు పడటంతో పరుగులు చేయడం అంత సులభం కాదనిపించింది. ఇదే విషయాన్ని కోహ్లి మాకు చెప్పాడు. చేజ్‌ను రిటర్న్‌ క్యాచ్‌తో ఔట్‌ చేయడం అద్భుతమైన     అనుభూతినిచ్చింది. నేను క్యాచ్‌కు       ప్రయత్నించాను, కానీ చేతికందుతుందని అస్సలనుకోలేదు. ఈ సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచిన మేం తదుపరి మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ గెలుచుకుంటాం.     
–భారత పేసర్‌ భువనేశ్వర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement