'అతనికి ఏ కలర్ బంతైనా ఒక్కటే'
గ్రేటర్ నోయిడా: ఫస్ట్క్లాస్ క్రికెట్లో భాగంగా ఇక్కడ దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా బ్లూ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ రవీంద్ర జడేజాపై సౌరాష్ట్ర కోచ్ సితాన్షు కోటక్ ప్రశంసలు కురిపించాడు. ప్రత్యేకంగా భారత్లో ఉన్న స్పిన్ ట్రాక్ల్లో అతనే అత్యుత్తమ ఎడమచేతి స్పిన్నర్ అని సితాన్షు కొనియాడాడు. పింక్ బాల్ తో జరిగిన ఈ మ్యాచ్లో జడేజాకు ఎటువంటి సమస్య ఎదురుకాలేదన్నాడు. గతేడాది జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ల్లో జడేజా 37 వికెట్లు తీసి సౌరాష్ట్ర విజయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన సంగతిని సితాన్షు గుర్తు చేశాడు. ఒక ఎడమచేతి స్పెషలిస్టు స్పిన్నర్ ఎలా బౌలింగ్ చేస్తాడో అదే తరహాలో జడేజా బౌలింగ్ శైలి ఉంటుందన్నాడు.
బంతిని పూర్తిగా చేతిలో అదిమిపట్టడం ఒకటైతే, బంతిని చాలా కిందిస్థాయి నుంచి స్పిన్ చేయడం జడేజా వికెట్లు సాధించడానికి ఉపయోగపడుతుందన్నాడు. త్వరలో స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగే టెస్టు సిరీస్లో జడేజా ముఖ్య భూమిక పోషించడం ఖాయమని జోస్యం చెప్పాడు. కేన్ విలియమ్సన్ గ్యాంగ్కు జడేజా నుంచి ముప్పు పొంచి ఉందని సితాన్షు హెచ్చరించాడు.