మనసు పెట్టి పరుగులు సాధించాడు... క్రీజులో నిలిచి ఇన్నింగ్స్‌ను నడిపించాడు... ‘శత’క్కొట్టి పాంటింగ్ సరసన నిలిచాడు... తొమ్మిదో 150+ స్కోరుతో బ్రాడ్‌మన్‌ను మించాడు... ఏడో ‘డబుల్’తో ఏకైక భారత్ బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర కెక్కాడు... 254+ స్కోరుతో వ్యక్తిగత స్కోరును మెరుగుపర్చుకున్నాడు...
ఇవన్నీ ఒక్కడే ఒక్క రోజులో చేశాడు. అతడే విరాట్ కోహ్లి. అతని ఆటను చూసినా... ఆడిన తీరును కనిపెట్టుకున్నా... అందరి మనసున మెదిలే ఒకే ఒక్క మాట... విరాట్ నీవు బ్యాటింగ్ కోసమే పుట్టావా!
పుణే: భారత నాయకుడు విరాట్ కోహ్లి టీమిండియాను శాసించే స్థితిలో నిలబెట్టాడు. రెండో టెస్టులో అతని అజేయ అదివతీయ ద్విశతక విన్యాసంతో రెండ్రోజుల్లోనే టీమిండియా పట్టుబిగించింది. విరాట్ కోహ్లి (336 బంతుల్లో 254 నాటౌట్; 33 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. అతను అజేయంగా ఆడటమే కాదు... మరో ఇద్దరిని ఆడించాడు. రహానే (168 బంతుల్లో 59; 8 ఫోర్లు), జడేజా (104 బంతుల్లో 91; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు)లతో రెండు విలువైన భాగస్వామ్యాలు జోడించాడు.
దీంతో దక్షిణాఫ్రికా బౌలర్లు రోజంతా చెమటలు కక్కారు. వికెట్ దుర్బేధ్యమైన వేళ పడరాని పాట్లు పడ్డారు. రెండో రోజు ఆటలో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 156.3 ఓవర్లలో 5 వికెట్లకు 601 పరుగుల భారీస్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది.
పరుగుపెట్టి... శతక్కొట్టి
ఓవర్‌నైట్ స్కోరు 273/3తో రెండో రోజు ఆట కొగసాగించిన భారత్ భారీస్కోరు దిశగా సాగింది. కోహ్లి, రహనే క్రితం రోజులాగే క్రీజులో పాతుకుపోవడంతో సఫారీ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ఆట మొదలైన కొద్దిసేపటికే జట్టు స్కోరు 300 పరుగులకు చేరింది. ప్రత్యర్థి జట్టు ఈ జోడీని విడగొట్టేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. పరుగులు జోరందుకోవడంతో రహానే 141 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... కాసేపటికే కోహ్లి శతకం 173 బంతుల్లో పూర్తయింది. నాలుగో వికెట్ భాగస్వామ్యం అబేధ్యంగా సాగడంతో లంచ్ విరామం దాకా ఒక్క వికెట్టూ లభించకపోవడంతో తొలి సెషన్ సఫారీ శిబిరాన్ని నిరాశపరిచింది. 356/3 వద్ద లంచ్ బ్రేక్‌కే వెళ్లింది.
రహానే ఔటైనా...
లంచ్ నుంచి రాగానే దక్షిణాఫ్రికా రహానే వికెట్‌ను పడగొట్టింది. కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి రహానే నిష్క్రమించాడు. ఎట్టకేలకు ఓ వికెట్ పడగొట్టినా... ఆ సంతోషం నీరుగారేందుకు ఎంతోసేపు పట్టలేదు. తర్వాత వచ్చిన జడేజా, కోహ్లి మొదట నింపాదిగా తర్వాత వేగంగా ఆడారు. 125వ ఓవర్లో జట్టు స్కోరు 400 పరుగులు దాటింది. ఇటు వికెట్లు పడకపోవడం.. అటు స్కోరు కొండంత కావడం... సఫారీలలో అసహనాన్ని పెంచింది.
ఈ క్రమంలోనే కోహ్లి 150 పరుగులు పూర్తయ్యాయి. కోహ్లి అత్యధికంగా తొమ్మిదోసారి 150+ వ్యక్తిగత స్కోరు చేసి... ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ (8 సార్లు) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. తొలుత నెమ్మదిగా ఆడిన జడేజా క్రీజులో పాతుకుపోయాక వేగం పెంచాడు. రెండో సెషన్‌లో మరో వికెట్ కోసం సఫారీ బౌలర్లు మార్చిమార్చి బౌలింగ్ చేసిన ఎవరి బంతి ఈ జోడీని విడగొట్టలేకపోయింది. భారత్ 473/4 స్కోరు వద్ద టీబ్రేక్‌కు వెళ్లింది.
కోహ్లి డబుల్ సెంచరీ...
ఆఖరి సెషన్‌లో భారత బ్యాటింగ్ గేరు మార్చుకుంది. జోరు పెంచుకుంది. ఈ సెషన్‌ను చూసిన వారెవరికీ ఇది టెస్టు కాదని కచిచతంగా అనిపిస్తుంది. వికెట్ల మధ్య కోహ్లి, జడేజా చురుగ్గా పరుగెత్తడంతో ఒక దశలో టెస్టు మ్యాచ్ కాస్తా వన్డేను తలపించింది. 295 బంతుల్లో 28 బౌండరీల సాయంతో భారత సారథి కోహ్లి డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ద్విశతక యోధుడికి జడేజా వేగం జతవడంతో భారత్ వడివడిగా పరుగులు చేసింది. ముఖ్యంగా జడేజా ఈ సెషన్ ఆసాంతం ధాటిగానే ఆడాడు. దీంతో కేవలం 21 ఓవర్ల వ్యవధిలోనే జట్టు మరో 100 పరుగులు జత చేసింది అలా 146వ ఓవర్లో భారత్ 500 పరుగుల మైలురాయిని దాటింది. జడేజా 79 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు.
అర్ధసెంచరీ తర్వాత అతను మరింత దూకుడు పెంచాడు. ఎలాగూ 500 పైచిలుకు స్కోరు కావడంతో సారథి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే ఉద్దేశాన్ని చెప్పడంతో జడేజా భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో చూస్తుండగానే అతను కూడా సెంచరీని సమీపించాడు. మరోవైపు కోహ్లి కూడా సిక్సర్లు బాదాడు. 334 బంతుల్లో కెరీర్ బెస్ట్ టెస్టు స్కోరు 250 పరుగులు చేశాడు. కానీ సెంచరీకి చేరువైన జడేజా 91 పరుగుల వద్ద ఔట్ కావడంతో 601/5 స్కోరు వద్దే కోహ్లి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు.
కోహ్లి... ఇదేం ఆట–అదేం బాట
భారత కెప్టెన్ కోహ్లి ఆటే హైలైట్. ఒకట్రెండు పరుగులతో మొదలైన ఆట క్రమంగా ప్రవాహంగా మారింది. అతని కచ్చితమైన షాట్లు, సహచరుల అండ... భారీ భాగస్వామ్యాలకు బాటలు వేశాయి. ఇలా చెబుతూ పోతే శుక్రవారం మొత్తం విరాట్ పర్వమే! అతని రమణీయ బ్యాటింగ్ కమనీయ ఇన్నింగ్స్‌కు తెరతీసింది. తన ఓవర్‌నైట్ సహచరుడు రహానేతో కలిసి నాలుగో వికెట్‌కు 178 పరుగులు జోడించిన కోహ్లి... తర్వాత జడేజాతో కలిసి ఐదో వికెట్‌కు ధాటిగా 225 పరుగులు జతచేశాడు. రెండో రోజు ఆటలో తన పరుగుల ఆకలి తీర్చుకునేందుకు కసిదీరా పోరాటం చేశాడు.
►1 టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారత క్రికెటర్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. ఏడో డబుల్ సెంచరీతో అతను సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ (6 చొప్పున) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.
►2 టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన కెపె్టన్ల జాబితాలో కోహ్లి సంయుక్తంగా రెండో స్థానానికి చేరాడు. ప్రస్తుతం 19 సెంచరీలతో రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) రికార్డును కోహ్లి సమం చేశాడు. 25 సెంచరీలతో గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా) అగ్రస్థానంలో ఉన్నాడు.
►5 భారత్ తరపున టెస్టుల్లో 250 అంతకంటే ఎక్కువ వ్యక్తిగత స్కోరు చేసిన ఐదో క్రికెటర్ కోహ్లి.సెహ్వాగ్ (నాలుగుసార్లు), వీవీఎస్ లక్ష్మణ్, ద్రవిడ్, కరుణ్ నాయర్ (ఒక్కోసారి) ఈ జాబితాలో ఉన్నారు.
►3 ఆరు వేర్వేరు దేశాలపై డబుల్ సెంచరీలు చేసిన మూడో క్రికెటర్ కోహ్లి. ఇప్పటివరకు కోహ్లి... బంగ్లాదేశ్, న్యూజిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లపై డబుల్ సెంచరీలు చేశాడు. గతంలో యూనిస్ ఖాన్ (పాక్), సంగక్కర మాత్రమే ఈ ఘనత సాధించారు.
►7 టెస్టుల్లో 7 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఏడో భారత క్రికెటర్ కోహ్లి. కెరీర్‌లో 81వ టెస్టు ఆడుతున్న కోహ్లి ఏడు వేల పరుగులు పూర్తి చేసే క్రమంలో డాన్ బ్రాడ్‌మన్ (52 టెస్టుల్లో 6,996)ను కూడా దాటేశాడు.
►3 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో 69 సెంచరీలతో కోహ్లి (టెస్టుల్లో 26, వన్డేల్లో 43) మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో సచిన్ (100 సెంచరీలు–టెస్టుల్లో 51, వన్డేల్లో 49), పాంటింగ్ (71 సెంచరీలు–టెస్టుల్లో 41, వన్డేల్లో 30) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
►7 దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన ఏడో ఓవరాల్ కెపె్టన్‌గా, భారత్ నుంచి తొలి కెపె్టన్‌గా కోహ్లి ఘనత వహించాడు. కోహ్లి కంటే ముందు దక్షిణాఫ్రికాపై అత్యధిక స్కోరు చేసిన భారత కెపె్టన్‌గా సచిన్ (169; కేప్‌టౌన్‌లో 1997లో) గుర్తింపు పొందాడు.
►4 టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో కోహ్లి సంయుక్తంగా నాలుగో స్థానానికి చేరుకున్నా డు. ఏడు సెంచరీలతో హామండ్ (ఇంగ్లండ్), జయవర్ధనే (శ్రీలంక) సరసన కోహ్లి చేరాడు. బ్రాడ్‌మన్ (ఆ్రస్టేలియా–12), సంగక్కర (శ్రీలంక–11), లారా (వెస్టిండీస్–9) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
►ఏ సెషన్‌లో ఎంత? తొలి సెషన్
ఓవర్లు: 27.5; పరుగులు: 83; వికెట్లు: 0
►రెండో సెషన్
ఓవర్లు: 28; పరుగులు: 117; వికెట్లు: 1
►మూడో సెషన్
ఓవర్లు: 14.3; పరుగులు: 128; వికెట్లు: 1 (భారత్)
ఓవర్లు: 15; పరుగులు: 36; వికెట్లు: 3 (దక్షిణాఫ్రికా)
►24 కోహ్లి కెప్టెన్ అయ్యాక (2015 నుంచి ఇప్పటì వరకు) భారత జట్టు టెస్టుల్లో అత్యధికంగా 24 సార్లు ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
►17రహానేను అవుట్ చేయడంతో టెస్టుల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్న 17వ దక్షిణాఫ్రికా బౌలర్‌గా, ఆ దేశ నాలుగో స్పిన్నర్‌గా కేశవ్ మహరాజ్ ఘనత వహించాడు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (సి) డు ప్లెసిస్ (బి) రబడ 108; రోహిత్ (సి) డికాక్ (బి) రబడ 14; పుజారా (సి) డుప్లెసిస్ (బి) రబడ 58; కోహ్లి (నాటౌట్) 254; రహానే (సి) డికాక్ (బి) కేశవ్ మహరాజ్ 59; జడేజా (సి) డి బ్రూయెన్ (బి) ముత్తుసామి 91; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (156.3 ఓవర్లలో ఐదు వికెట్లకు డిక్లేర్డ్) 601
వికెట్ల పతనం: 1–25, 2–163, 3–198, 4–376, 5–601. బౌలింగ్: ఫిలాండర్ 26–6–66–0, రబడ 30–3–93–3, నోర్జే 25–5–100–0, కేశవ్ 50–10–196–1, ముత్తుసామి 19.3–1–97–1, ఎల్గర్ 4–0–26–0, మార్క్‌రమ్ 2–0–17–0.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ (బి) ఉమేశ్ 6; మార్క్‌రమ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఉమేశ్ 0; డి బ్రూయెన్ (బ్యాటింగ్) 20; బవుమా (సి) సాహా (బి) షమీ 8; నోర్జె (బ్యాటింగ్) 2;
మొత్తం (15 ఓవర్లలో 3 వికెట్లకు) 36.
వికెట్ల పతనం: 1–2, 2–13, 3–33.
బౌలింగ్: ఇషాంత్ శర్మ 4–0–17–0, ఉమేశ్ యాదవ్ 4–1–16–2, జడేజా 4–4–0–0, షమీ 3–1–3–1.
Comments
Please login to add a commentAdd a comment