సాక్షి, బెంగళూరు: ఆస్ట్రేలియాతో జరగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా 147 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. 335 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానేలు అర్ధ సెంచరీల మంచి శుభారంభాన్ని అందించారు. తొలుత రహానే ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 58 బంతుల్లో అర్ధసెంచరీ నమోదు చేశాడు. అనంతరం రోహిత్ శర్మ నాలుగు సిక్సులు, ఒక ఫోర్‌తో 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. పటిష్టంగా మారిన ఈ జంటను రిచర్డ్సన్ రహానే 53 (66 బంతులు,6 ఫోర్లు, 1 సిక్సు) అవుట్ చేసి భారత వికెట్ల పతనానికి నాందీ పలికాడు. దీంతో తొలి వికెట్‌కు నమోదైన 106 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం స్వల్ప వ్వవధిలోనే మరో ఓపెనర్ రోహిత్ 65(55 బంతులు 1 ఫోర్, 5 సిక్సులు) అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. మరో 12 పరుగుల వ్యవధిలో కెప్టెన్ విరాట్ కోహ్లి(21) కౌల్టర్ నీల్ బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ 147 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో పాండ్యా, జాదవ్‌లు పోరాడుతున్నారు.