గెట్...సెట్...కబడ్డీ!
- నేటినుంచి హైదరాబాద్‌లో ప్రొ లీగ్
- సెమీస్‌పై తెలుగు టైటాన్స్ దృష్టి
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ రెండో అర్ధభాగం పోటీలకు రంగం సిద్ధమైంది. 28 మ్యాచ్‌ల అనంతరం నేటినుంచి హైదరాబాద్‌లో ఈ లీగ్ అభిమానులను అలరించనుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. నగరంలో వరుసగా నాలుగు రోజుల పాటు హోం టీమ్ తెలుగు టైటాన్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏడు మ్యాచ్‌ల అనంతరం 26 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న టైటాన్స్ సొంతగడ్డపై చెలరేగి సెమీస్ స్థానం ఖాయం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. తొలి రోజు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్‌తో తలపడుతుంది.
కొత్త కెప్టెన్ నేతృత్వంలో...
సీజన్‌లో ఇప్పటికే ఇద్దరు కెప్టెన్లను మార్చిన తెలుగు టైటాన్స్ మరోసారి కొత్త కెప్టెన్ సారథ్యంలో బరిలోకి దిగుతోంది. ఇరాన్ ఆటగాడు మిరాజ్ షేక్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతాడు. గత సీజన్‌లో త్రుటిలో సెమీస్ స్థానం చేజారిందని, ఈ సారి జట్టు బలంగా ఉందని టీమ్ యజమాని ఎస్. శ్రీనివాస్ అన్నారు. ‘ఇతర జట్లతో పోలిస్తే మా టీమ్‌లో స్టార్ ఆటగాళ్లు లేకపోయినా, కుర్రాళ్లు ఎక్కువగా ఉన్నారు. వారంతా అంచనాలకు మించి రాణించారు. మన అభిమానుల మద్దతుతో సెమీస్‌కు చేరతాం’ అని ఆయన చెప్పారు. గత మ్యాచ్‌లలో తమ డిఫెన్స్ కాస్త బలహీనంగా కనిపించిందని, దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు జట్టు కోచ్ జగ్మోహన్ వెల్లడించారు.
అల్లు అర్జున్ జాతీయ గీతాలాపన
తొలిసారి హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రొ కబడ్డీ ఆరంభోత్సవ కార్యక్రమాన్ని కూడా ఘనంగా జరిపేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. సినీ హీరో అల్లు అర్జున్ తొలి రోజు జాతీయ గీతాలాపన చేయనున్నాడు. మిగతా నాలుగు రోజుల్లో సినీ గాయకులు గీతామాధురి, అంజనా సౌమ్య, శ్రీరామచంద్ర జాతీయ గీతాన్ని పాడతారు. ఈ లీగ్‌కు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. స్టేడియం సమీపంలోనే ఒక కన్వెన్షన్ సెంటర్‌లో ప్రత్యేకంగా మ్యాట్ కోర్టులను సిద్ధం చేశారు. అందులోనే టైటాన్స్, జైపూర్ జట్లు సోమవారం ప్రాక్టీస్ చేశాయి.
ఖమ్మం కుర్రాడు...
తెలుగు టైటాన్స్ జట్టులో ఉన్న ఏకైక తెలుగు ఆటగాడు తోలెం ప్రసాద్. 22 ఏళ్ల ప్రసాద్ స్వస్థలం మణుగూరు సమీపంలోని లక్ష్మీపురం. ఇతను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) అకాడమీ విద్యార్థి. పాఠశాల స్థాయినుంచి కబడ్డీలో విశేషంగా రాణిస్తూ వచ్చిన ప్రసాద్ జూనియర్, ఆ తర్వాత సీనియర్ స్థాయిలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2013, 2014 సీనియర్ నేషనల్స్‌లో ఆల్‌రౌండర్‌గా ఇతను చక్కటి ప్రతిభ కనబర్చాడు. ‘సాయ్’ కోచ్ జగ్మోహన్ ఇతడిని గుర్తించి ప్రోత్సహించారు. ఎక్కడో మారుమూల గిరిజన గ్రామానికి చెందిన తనకు లీగ్‌తో గుర్తింపు రావడం పట్ల ప్రసాద్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఈ అవకాశం నేను ఊహించలేదు. ప్రొ కబడ్డీ వల్ల చాలా మందికి నా గురించి తెలిసింది. భవిష్యత్తులో మంచి ప్లేయర్ కావడమే నా లక్ష్యం’ అని ప్రసాద్ చెప్పాడు.
‘టైటిల్ గెలుస్తాం’
టైటాన్స్ టీమ్‌కు తెలంగాణకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. 2003లో తొలిసారి భారత జట్టు తరఫున ఆడిన శ్రీనివాస్, ఆ తర్వాత పలు అంతర్జాతీయ టోర్నీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. గత ఏడాది ఇంచియాన్ ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన కొరియా టీమ్‌కు ఆయనే కోచ్‌గా వ్యవహరించడం విశేషం. సంగారెడ్డికి చెందిన శ్రీనివాస్‌కు కూడా ఇదే తొలి లీగ్. ‘ప్రొ లీగ్‌కు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇప్పటికే ఈ లీగ్‌తో కబడ్డీ ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా పాపులర్‌గా మారిపోయింది. ఈ టోర్నీలో మా టీమ్ చాలా బాగా ఆడుతోంది. సెమీస్‌తోనే ఆగిపోకుండా టైటిల్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని శ్రీనివాస్ చెప్పారు.