తెలుగు టైటాన్స్‌కు షాక్
- బెంగళూరు చేతిలో భారీ ఓటమి
- పొ కబడ్డీ లీగ్
పట్నా: ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో ప్రొ కబడ్డీ లీగ్‌లో మంచి జోరు మీదున్న తెలుగు టైటాన్స్ జట్టు తమ ఏడో మ్యాచ్‌లో అనూహ్యంగా బెంగళూరు చేతిలో 14 పాయింట్ల భారీ తేడాతో ఓడిపోయింది. పటియాల స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 35-21 స్కోరుతో టైటాన్స్‌ను చిత్తు చేసింది. బెంగళూరు కెప్టెన్ మంజీత్ చిల్లర్ అద్భుతమైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్నాడు. మంజీత్ 9, అజయ్ ఠాకూర్ 9 పాయింట్లతో చెలరేగారు. తెలుగు టైటాన్స్ స్టార్ ఆటగాళ్లు రాహుల్ చౌదురి, దీపక్ హుడా, సుకేశ్ హెగ్డే ముగ్గురూ విఫలమయ్యారు. మ్యాచ్ ప్రథమార్ధంలో 12-9తో ఆధిక్యం సాధిం చిన బెంగళూరు ద్వితీయార్ధంలో చెలరేగి ఆడింది.
మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 39-22తో దబాంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. ప్రస్తుతం టైటాన్స్ ఏడు మ్యాచ్‌ల ద్వారా 26 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలోనే ఉంది. యూ ముంబా జట్టు ఆరు మ్యాచ్‌ల ద్వారా 30 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
టీవీలో పెరిగిన ఆదరణ
ముంబై: ఆరంభ సీజన్‌తో పోలిస్తే ఈసారి ప్రొ కబడ్డీ లీగ్‌కు టీవీ ప్రేక్షకుల ఆదరణ విపరీతంగా పెరిగింది. రెండో అంచె పోటీలకు 45 శాతం అధిక వ్యూవర్‌షిప్ నమోదైనట్లు స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది. ‘జూలై 18న జైపూర్, యు ముంబాల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌కు 7.2 టీవీఎం (బీఏఆర్‌సీ ప్యానెల్ సీఎస్4+) నమోదు అయ్యింది. గతేడాది (టీఏఎమ్ ప్యానెల్ సీఎస్4+)తో పోలిస్తే ఇది 45 శాతం అధికం’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. తొలి వారం లీగ్‌ను ఆన్‌లైన్‌లో 10.1 మిలియన్ ప్రేక్షకులు వీక్షించారని వెల్లడించింది.
ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు
యు ముంబా x దబాంగ్ ఢిల్లీ
రా. గం. 8.00 నుంచి
పట్నా పైరేట్స్ x పుణెరి పల్టాన్
రా. గం. 9.00 నుంచి
స్టార్‌స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం