తెలుగువీర లేవరా!
ఆట గ్రామీణమే అయినా దానికి సోకులు అద్ది ‘ప్రొ లీగ్’ ఇప్పుడు కబడ్డీని అచ్చమైన కార్పొరేట్ క్రీడలా మార్చేసింది. ఆటగాళ్ల కూతతో పాటు తారల తళుకుబెళుకులు, సంగీతం జోరుతో ఈ లీగ్ ఒక్కసారిగా జనాలకు పట్టేసింది. దాంతో ఒక్కసారిగా అభిమానుల్లో కబడ్డీ క్రేజ్ పెరిగిపోయింది. ఫలితంగా మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసేందుకు వారంతా ఉత్సుకతతో ఉన్నారు. లీగ్‌లో గత ఏడాది నిరాశపర్చిన తెలుగు టైటాన్స్ జట్టు ఈసారి సత్తా చాటి అభిమానులను అలరిస్తుండటంతో మన టీమ్‌పై కూడా అంచనాలు పెరిగిపోయాయి. సొంతగడ్డ హైదరాబాద్ అంచె పోరుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో టైటాన్స్ టీమ్ విశేషాలివిగో...
- సొంత మైదానంలో పోటీకి సై
- సన్నద్ధమైన తెలుగు టైటాన్స్ బృందం
- రేపటి నుంచి ‘ప్రొ కబడ్డీ’ షో
సాక్షి, హైదరాబాద్: తొలి ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆడిన 14 మ్యాచ్‌లలో 6 మాత్రమే గెలిచిన తెలుగు టైటాన్స్ సెమీఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. కానీ రెండో సీజన్ (2015)లో సగం మ్యాచ్‌లు ముగిసేసరికే ఐదు విజయాలు, 26 పాయింట్లతో టైటాన్స్ రెండో స్థానంలో కొనసాగుతోంది. గత ఏడాది విశాఖపట్నంను హోం గ్రౌండ్‌గా ఉంచుకున్న టీమ్, ఈసారి తమ కేంద్రాన్ని హైదరాబాద్‌కు మార్చింది. మంగళవారం నుంచి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలుగు టీమ్ వరుసగా నాలుగు రోజుల పాటు మ్యాచ్‌లు ఆడుతుంది. సొంత అభిమానుల మధ్య ఈ మ్యాచ్‌లు గెలిస్తే టీమ్ సెమీస్ చేరడం దాదాపు ఖాయమవుతుంది.
తెలుగు టైటాన్స్ జట్టు: రాహుల్ చౌదరి, సుకేశ్ హెగ్డే, దీపక్ హుడా, ప్రశాంత్ రాయ్, రోహిత్ బలియాన్, చంద్రన్ రంజిత్, ఇసాక్ ఆంటోని (రైడర్లు), సచిన్ సింగాడే, సందీప్, రాజగురు సుబ్రమణియన్, గోపు, జిష్ణు (డిఫెండర్లు), రవిత్ కుమార్, టి.ప్రసాద్, రూపేశ్ తోమర్, హాది, మేరాజ్, హ్యూనిల్ (ఆల్‌రౌండర్లు).
వీరా స్పోర్ట్స్ టీమ్
తెలుగు రాష్ట్రాలలో వేర్వేరు రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు తెలుగు టైటాన్స్ టీమ్‌కు యజమానులుగా ఉన్నారు. ‘వీరా స్పోర్ట్స్’ కింద కబడ్డీ లీగ్‌లోకి వీరు అడుగు పెట్టారు. శ్రీరామనేని శ్రీనివాస్ (కోర్ గ్రీన్ గ్రూప్), మహేశ్ కొల్లి, అనిల్ (గ్రీన్‌కో గ్రూప్), గౌతమ్ రెడ్డి (ఎన్‌ఈడీ గ్రూప్) ఈ టీమ్‌లో భాగస్వాములు.
హైదరాబాద్‌లో మ్యాచ్‌ల షెడ్యూల్
ఆగస్టు 4: తెలుగు టైటాన్స్ x జైపూర్ పింక్ పాంథర్స్
యు ముంబా x దబాంగ్ ఢిల్లీ
ఆగస్టు 5: తెలుగు టైటాన్స్ x బెంగాల్ వారియర్స్
ఆగస్టు 6: బెంగాల్ వారియర్స్ x బెంగళూరు బుల్స్
తెలుగు టైటాన్స్ x పట్నా పైరేట్స్
ఆగస్టు 7: జైపూర్ పింక్ పాంథర్స్ x యు ముంబా
తెలుగు టైటాన్స్ x పుణేరీ పల్టన్
‘సూపర్ స్టార్’ రాహుల్ చౌదరి
తెలుగు టైటాన్స్ జట్టులో ఇప్పుడు అందరి దృష్టీ నిలిచిన ఆటగాడు రాహుల్ చౌదరి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇతను గత ఏడాది లీగ్‌లో 151 పాయింట్లు స్కోర్ చేసి ‘బెస్ట్ రైడర్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా యు ముంబా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 23 పాయింట్లు సాధించి రికార్డు సృష్టించాడు. ఈ సీజన్‌లో కూడా 21 ఏళ్ల రాహుల్ అదే జోరు కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే 7 మ్యాచ్‌లలో 32 రైడ్ పాయింట్లు స్కోర్ చేసిన ఇతను వేర్వేరు విభాగాల్లో ఆరు అవార్డులు గెలుచుకున్నాడు. ఇక ఈ సీజన్‌లో ఇన్‌స్పైరింగ్ డిఫెండర్‌గా మూడు సార్లు అవార్డు గెలుచుకున్న దీపక్ నివాస్ హుడా జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. టోర్నీలో పిన్న వయస్కుడైన 18 ఏళ్ల సందీప్ మరో కీలక సభ్యుడు.
అతడే ‘శ్రీమంతుడు’
ప్రొ కబడ్డీ లీగ్‌లో అత్యధిక బిడ్ పొందిన ఇద్దరు ఆటగాళ్లు టైటాన్స్ జట్టులోనే ఉన్నారు. ఇరాన్‌కు చెందిన హాది ఓష్‌టోరక్‌ను రూ. 21.1 లక్షలకు తెలుగు టీమ్ సొంతం చేసుకుంది. లీగ్‌లో ఆటగాళ్ల కనీస ధర రూ. 1.5 లక్షలతో పోలిస్తే ఇది 14 రెట్లు ఎక్కువ కావడం విశేషం. రెండో స్థానంలో ఇరాన్‌కే చెందిన మేరాజ్ షేక్ (రూ. 20.1 లక్షలు) ఉన్నాడు. తొలి సీజన్‌లో అత్యధిక ధర పలికిన రాకేశ్ కుమార్ (రూ. 12.8 లక్షలు)తో చూసినా ఇది చాలా ఎక్కువ మొత్తంగా చెప్పవచ్చు.
వీరిద్దరు గత ఏడాది ఆసియా క్రీడల్లో రజతం సాధించిన ఇరాన్ జట్టులో సభ్యులుగా ఉన్నారు. మేరాజ్ అన్ని మ్యాచ్‌లు ఆడగా, హాది ఒక మ్యాచ్‌లోనే బరిలోకి దిగాడు. కొరియాకు చెందిన పార్క్ హ్యూనిల్ అనే ఆటగాడు 18 మంది సభ్యుల జట్టులో ఉన్నా ఇంకా బరిలోకి దిగలేదు. అంతర్జాతీయ ఆటగాళ్ల అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని, వీరితో కలిసి ఆడితే కుర్రాళ్లు నేర్చుకునే అవకాశం ఉంటుందని టీమ్ మేనేజ్‌మెంట్ చెబుతోంది. తెలుగు ఆటగాడు టి. ప్రసాద్‌కు సబ్‌స్టిట్యూట్‌గా 3 మ్యాచ్‌లలో ఆడే అవకాశం దక్కింది.