‘టై’తో టాప్‌లోకి... | With Tie at top | Sakshi
Sakshi News home page

‘టై’తో టాప్‌లోకి...

Published Sat, Aug 8 2015 12:45 AM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

‘టై’తో టాప్‌లోకి...

‘టై’తో టాప్‌లోకి...

- తెలుగు టైటాన్స్, పుణేరి పల్టన్ మ్యాచ్ డ్రా
- ప్రొ కబడ్డీ లీగ్ పట్టికలో అగ్రస్థానంలోకి తెలుగు జట్టు
- జైపూర్ చేతిలో ముంబాకు షాక్
సాక్షి, హైదరాబాద్:
ప్రొ కబడ్డీ లీగ్‌లో హైదరాబాద్ అంచె మ్యాచ్‌లు టైతో మొదలై టైతోనే ముగిశాయి. సొంతగడ్డపై తొలి రోజు జైపూర్‌తో మ్యాచ్‌ను టై చేసుకున్న తెలుగు టైటాన్స్ జట్టు... చివరి రోజు పుణేరీ పల్టన్‌తో మ్యాచ్‌ను కూడా డ్రా చేసుకుంది. శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలో జరిగిన టైటాన్స్, పల్టన్ మ్యాచ్ 29-29తో డ్రాగా ముగిసింది. తొలి అర్ధ భాగంలో పుణే జట్టు ఆధిక్యం ప్రదర్శించగా... రెండో అర్ధ భాగంలో తెలుగు టీమ్ కోలుకొని మ్యాచ్‌ను కాపాడుకుంది. ఈ మ్యాచ్‌తో హైదరాబాద్ అంచె పోటీలు ముగిశాయి. నేటి నుంచి ఢిల్లీలో మ్యాచ్‌లు జరుగుతాయి. సొంతగడ్డపై 2 విజయాలు, 2 డ్రాలతో ఓటమి లేకుండా టైటాన్స్ తమ మ్యాచ్‌లను ముగించింది. 11 మ్యాచ్‌ల అనంతరం టైటాన్స్ 42 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది.
 
పల్టన్ జోరు
తొలి అర్ధ భాగంలో పుణే ఆటగాళ్లు రైడింగ్‌తో పాటు చక్కటి డిఫెన్స్‌తో వరుసగా పాయింట్లు సాధించి 8-3తో ముందంజ వేశారు. గత మ్యాచ్‌లతో పోలిస్తే చురుగ్గా కదల్లేకపోయిన టైటాన్స్ ఆటగాళ్లు ఎనిమిదో నిమిషంలో ఆలౌట్ అయ్యారు. 13వ నిమిషంలో పల్టన్ 15-7తో ఆధిక్యంలో ఉన్న దశలో తెలుగు టీమ్ ఒక్కసారిగా కోలుకుంది. వరుసగా ఐదు పాయింట్లతో 12-15కు చేరింది. తర్వాతి నిమిషంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి టైటాన్స్ స్కోరు సమం చేసింది. తొలి అర్ధ భాగం ముగిసే సరికి పుణే జట్టు 20-18తో ఆధిక్యంలో నిలిచింది.
 
ఉత్కంఠభరితం
రెండో అర్ధభాగంలో పోరు హోరాహోరీగా సాగింది. ఇరు జట్లు తమ రైడింగ్ ప్రయత్నాలు నిలబెట్టుకోవడంతో స్కోరు దాదాపు సమంగా సాగింది. 36వ నిమిషంలో సుకేశ్ చక్కటి రైడ్‌తో టైటాన్స్ స్కోరు 27-27తో సమం చేసింది. ఈ దశలో టైటాన్స్, పల్టన్ రక్షణాత్మకంగా ఆడటంతో నాలుగు రైడ్‌లు పాయింట్లు రాకుండా ముగిశాయి. పల్టన్ వరుసగా రెండు పాయింట్లు సాధించడంతో టైటాన్స్‌కు ఓటమి తప్పదనిపించింది. అయితే చివరి నిమిషంలో ప్రశాంత్ రాయ్ పాయింట్ తీసుకు రాగా... టైటాన్స్ చేతికి ప్రవీణ్ చిక్కడంతో మ్యాచ్ టైగా ముగిసింది. ప్రతీ మ్యాచ్‌లో చెలరేగిన రాహుల్ చౌదరి ఈ మ్యాచ్‌లో నిరాశపర్చాడు. టైటాన్స్ తరఫున సుకేశ్ 9, దీపక్ 7 పాయింట్లు స్కోర్ చేయగా.... పుణేరీ ఆటగాళ్లలో కెప్టెన్ వజీర్ సింగ్ ఒక్కడే 12 పాయింట్లు సాధించడం విశేషం.
 
యు ముంబాకు తొలి ఓటమి
సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యు ముంబాకు డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పాంథర్స్ షాక్ ఇచ్చింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో జైపూర్ 35-25 పాయింట్లతో యు ముంబాను ఓడించింది.

 
ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు
దబాంగ్ ఢిల్లీ x బెంగాల్ వారియర్స్
రా. గం. 8.00 నుంచి
 

పట్నా పైరేట్స్ x బెంగళూరు బుల్స్
రా. గం. 9.00 నుంచి

స్టార్‌స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement