Prof. Kabaddi League
-
PKL Season 11: పుణెరి పల్టాన్‌కు రెండో విజయం
హైదరాబాద్, అక్టోబర్ 21: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్ వరుసగా రెండో విజయం సాధించింది. రైడింగ్, డిఫెన్స్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ 15 తేడాతో పట్నా పైరేట్స్‌ను చిత్తు చేసింది. సోమవారం రాత్రి ఇక్కడి జీఎంసీ బాలయోగి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పుణెరి 40–25 తేడా తో పట్నా పైరేట్స్‌పై ఘన విజయం సాధించింది. కెప్టెన్, ఆల్‌రౌండర్ అస్లాం ఇనాందార్ (9 పాయింట్లు), మోహిత్ గోతయ్ (8) సత్తా చాటారు. డిఫెండర్లు గౌరవ్ ఖత్రి (6), అమన్ (6) కూడా ఆకట్టుకున్నారు. పట్నా పైరేట్స్ జట్టులో దేవాంక్ (6), అంకిత్ (6), అయాన్ (5) పోరాడినా మిగతా ఆటగాళ్లు నిరాశ పరిచారు. ఈ మ్యాచ్‌లో పుణెరి రెండుసార్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. ఈ మ్యాచ్‌లో ఆట ఆరంభం నుంచే పుణెరి జోరు ప్రదర్శించింది. వరుసగా నాలుగు పాయింట్లతో 4–0తో ఆ జట్టు మ్యాచ్‌ను మొదలు పెట్టింది. పట్నా కోర్టులో ముగ్గురే మిగలగా అస్లాం ఇనాందార్‌ను సూపర్ ట్యాకిల్ చేసిన ఆ జట్టు ఖాతా తెరిచింది. మోహిత్ గోయత్‌ను కూడా ట్యాకిల్ చేసి 4–4తో స్కోరు సమం చేసింది. కానీ, అస్లాం ఇనాందర్ డబుల్ రైడ్ పాయింట్‌తో పుణెరి మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. అక్కడి నుంచి ఆ జట్టు వరుస పాయింట్లతో విజృంభించింది. ఈ క్రమంలో 13వ నిమిషంలో ప్రత్యర్థిని తొలిసారి ఆలౌట్ చేసి 16–8తో ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకుంది. అదే జోరుతో 20–10తో మొదటి అర్ధభాగాన్ని ముగించింది. విరామం తర్వాత అస్లాం ఇనాందర్‌ను నిలువరించిన పట్నా డిఫెండర్లు పంకజ్ మోహితేను సూపర్ ట్యాకిల్ చేసి తమ జట్టును రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ, పల్టాన్ రైడింగ్‌తో పాటు డిఫెన్స్‌లోనూ సత్తా చాటుతూ తన ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఈ క్రమంలో పట్నా కోర్టులో మిగిలిన దేవాంక్‌ను ప్రత్యర్థికి దొరికిపోయాడు. దాంతో రెండోసారి ఆలౌట్‌కు గురైన పట్నా 15–27తో వెనుకబడింది. అస్లాంతో పాటు మోహిత్ గోయత్ రైడింగ్‌లో సత్తా చాటగా.. గౌరవ్ ఖత్రి, అమన్ తమ ఉడుం పట్టుతో పట్నా రైడర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. మరోవైపు పట్నా అన్ని విభాగాల్లో తేలిపోయింది. సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగా జాంగ్ కున్ లీని దింపినా పాయింట్లు రాబట్టలేక ఓటమి మూటగట్టుకుంది. కాగా, ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో భాగంగా మంగళవారం జరిగే తొలి మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. రెండో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌తో బెంగళూరు బుల్స్ పోటీ పడుతుంది. -
చాంపియన్ యు ముంబా
ఫైనల్లో బెంగళూరుపై గెలుపు తెలుగు టైటాన్స్‌కు మూడో స్థానం ప్రొ కబడ్డీ లీగ్ రెండో సీజన్ ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ రెండో సీజన్లో యు ముంబా జట్టు విజేతగా నిలిచింది. తొలి సీజన్లో రన్నరప్‌గా నిలిచిన యు ముంబా ఈసారి కచ్చితంగా టైటిల్ దక్కించుకోవాలనే కసితో ఆరంభం నుంచే అదరగొట్టి చివరకు అనుకున్న ఫలితం సాధించింది. ఆదివారం బెంగళూరు బుల్స్‌తో జరిగిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్‌లో 36-30 తేడాతో ముంబా నెగ్గింది. విజేతకు రూ. కోటి ప్రైజ్‌మనీ లభించగా... ర న్నరప్ బెంగళూరుకు రూ.50 లక్షలు దక్కాయి. ఈ మ్యాచ్‌లో బెంగళూరును ముంబా జట్టు రెండు సార్లు ఆలౌట్ చేయగా, షబీర్ బాపు 9 రైడ్ పాయింట్లు సాధించాడు. బెంగళూరు కెప్టెన్ మంజీత్ చిల్లార్ కూడా 9 పాయింట్లు సాధించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు నువ్వా.. నేనా అనే రీతిలో తలపడ్డాయి. తొలి పాయింట్‌ను ముంబానే సాధించినప్పటికీ వెంటనే బెంగళూరు తేరుకుని గట్టి పోటీనిచ్చింది. దీంతో ఆరంభ 15 నిమిషాల ఆటలో 7-7తో ఇరు జట్లు సమానంగా పాయింట్లు పంచుకున్నాయి. అయితే అర్ధ భాగం ముగుస్తుందనగా ముంబా ఒక్కసారిగా జోరు పెంచింది. అత్యుత్తమ డిఫెన్స్‌తో ఆకట్టుకుని 16-8తో ఆధిక్యం అందుకుంది. ఆ తర్వాత ద్వితీయార్థం ప్రారంభంలో బెంగళూరు రైడర్స్ కాస్త పోరాడారు. కానీ అటాకింగ్ ఆటతో ముంబా జట్టు పైచేయి సాధించింది. 32వ నిమిషంలో 23-18తో వెనుకబడి ఉన్న సమయంలో బెంగళూరు రైడర్ అజయ్ ఠాకూర్ కోర్టులో ఉన్న ముగ్గురినీ అవుట్ చేసి ఐదు పాయింట్లతో స్కోరును సమం చేశాడు. దీంతో మ్యాచ్‌లో ఒక్కసారిగా ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. అయినా ముంబా ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాక పోగా షబీర్ బాపు ఒకేసారి మూడు పాయింట్లతో జట్టును 29-24 ఆధిక్యంలో నిలిపాడు. ఇదే జోరును చివరిదాకా చూపిన ముంబా విజేతగా నిలిచింది. మూడో స్థానంలో తెలుగు టైటాన్స్ లీగ్ ఆద్యంతం అద్భుతంగా రాణించిన తెలుగు టైటాన్స్ జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు మూడు, నాలుగో స్థానాల కోసం జరిగిన ఈ మ్యాచ్‌లో 34-26 తేడాతో పట్నా పైరేట్స్‌ను టైటాన్స్ చిత్తు చేసింది. రాహుల్ చౌదరి 10, ప్రశాంత్ రాయ్ 6 రైడ్ పాయింట్లు సాధించారు. పట్నాను రెండు సార్లు ఆలౌట్ చేయగలిగింది. పట్నా కెప్టెన్ సందీప్ నర్వాల్ ఆల్‌రౌండ్ షోతో 11 పాయింట్లు సాధించి ఆకట్టుకున్నా ఫలితం లేకపోయింది. తొలి అర్ధ భాగంలోనే 16-8తో టైటాన్స్ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. మూడో స్థానంలో నిలిచిన తెలుగు టైటాన్స్‌కు రూ.30 లక్షలు, పట్నాకు రూ. 20 లక్షలు ప్రైజ్‌మనీగా ఇచ్చారు. ఉత్తమ ఆటగాళ్లు: ై రెజింగ్ స్టార్ ఆఫ్ ద టోర్నీ: సందీప్ (టైటాన్స్) రూ. 5 లక్షలు ఏ రైడర్ ఆఫ్ ద టోర్నీ: కషిలింగ్ (ఢిల్లీ) రూ. 5 లక్షలు ఏ డిఫెండర్ ఆఫ్ ద టోర్నీ: రవీందర్ (ఢిల్లీ) రూ. 5 లక్షలు ఏ ఆల్‌రౌండర్ ఆఫ్ ద టోర్నీ: మంజీత్ చిల్లర్ (బెంగళూరు) మహీంద్రా జీపు -
ఢిల్లీపై జైపూర్ పంజా
న్యూఢిల్లీ: గతేడాది చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ క్రమంగా జూలు విదుల్చుతోంది. ప్రొ కబడ్డీ లీగ్ రెండో సీజన్ ఆరంభం నుంచి పరాజయాల బాట పట్టిన ఈ జట్టు ఇప్పుడు వరుస విజయాలతో దూసుకెళుతోంది. తాజాగా సోమవారం దబాంగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 51-21 తేడాతో ఘన విజయాన్నందుకుంది. పాయింట్ల తేడా పరంగా ఇప్పటిదాకా ఈ సీజన్లో ఇదే భారీ విజయం కావడం విశేషం. ఆల్‌రౌండర్ రాజేశ్ నర్వాల్ 15 రైడ్ పాయింట్లతో, కెప్టెన్ జస్వీర్ సింగ్ 9 పాయింట్లతో దుమ్ము రేపారు. మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో జైపూర్ పింక్ పాంథర్స్; దబాంగ్ ఢిల్లీతో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
యు ముంబా జోరు
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ రెండో సీజన్లో యు ముంబా జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. ఆదివారం బెంగాల్ వారియర్స్‌తో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో 31-17 తేడాతో నెగ్గింది. దీంతో 45 పాయింట్లతో తిరిగి అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిని నాలుగు సార్లు ఆలౌట్ చేసి 16 రైడ్ పాయింట్లు అందుకుంది. ఇప్పటిదాకా 10 మ్యాచ్‌లు ఆడిన ముంబా జట్టు ఒక్క మ్యాచ్‌లోనే ఓడింది. మరో మ్యాచ్‌లో ఢిల్లీ దబాంగ్ జట్టు 45-26తో పట్నా పైరేట్స్‌పై నెగ్గింది. సోమవారం జరిగే మ్యాచ్‌లో జైపూర్‌తో ఢిల్లీ తలపడుతుంది. -
‘టై’తో టాప్‌లోకి...
- తెలుగు టైటాన్స్, పుణేరి పల్టన్ మ్యాచ్ డ్రా - ప్రొ కబడ్డీ లీగ్ పట్టికలో అగ్రస్థానంలోకి తెలుగు జట్టు - జైపూర్ చేతిలో ముంబాకు షాక్ సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో హైదరాబాద్ అంచె మ్యాచ్‌లు టైతో మొదలై టైతోనే ముగిశాయి. సొంతగడ్డపై తొలి రోజు జైపూర్‌తో మ్యాచ్‌ను టై చేసుకున్న తెలుగు టైటాన్స్ జట్టు... చివరి రోజు పుణేరీ పల్టన్‌తో మ్యాచ్‌ను కూడా డ్రా చేసుకుంది. శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలో జరిగిన టైటాన్స్, పల్టన్ మ్యాచ్ 29-29తో డ్రాగా ముగిసింది. తొలి అర్ధ భాగంలో పుణే జట్టు ఆధిక్యం ప్రదర్శించగా... రెండో అర్ధ భాగంలో తెలుగు టీమ్ కోలుకొని మ్యాచ్‌ను కాపాడుకుంది. ఈ మ్యాచ్‌తో హైదరాబాద్ అంచె పోటీలు ముగిశాయి. నేటి నుంచి ఢిల్లీలో మ్యాచ్‌లు జరుగుతాయి. సొంతగడ్డపై 2 విజయాలు, 2 డ్రాలతో ఓటమి లేకుండా టైటాన్స్ తమ మ్యాచ్‌లను ముగించింది. 11 మ్యాచ్‌ల అనంతరం టైటాన్స్ 42 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. పల్టన్ జోరు తొలి అర్ధ భాగంలో పుణే ఆటగాళ్లు రైడింగ్‌తో పాటు చక్కటి డిఫెన్స్‌తో వరుసగా పాయింట్లు సాధించి 8-3తో ముందంజ వేశారు. గత మ్యాచ్‌లతో పోలిస్తే చురుగ్గా కదల్లేకపోయిన టైటాన్స్ ఆటగాళ్లు ఎనిమిదో నిమిషంలో ఆలౌట్ అయ్యారు. 13వ నిమిషంలో పల్టన్ 15-7తో ఆధిక్యంలో ఉన్న దశలో తెలుగు టీమ్ ఒక్కసారిగా కోలుకుంది. వరుసగా ఐదు పాయింట్లతో 12-15కు చేరింది. తర్వాతి నిమిషంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి టైటాన్స్ స్కోరు సమం చేసింది. తొలి అర్ధ భాగం ముగిసే సరికి పుణే జట్టు 20-18తో ఆధిక్యంలో నిలిచింది. ఉత్కంఠభరితం రెండో అర్ధభాగంలో పోరు హోరాహోరీగా సాగింది. ఇరు జట్లు తమ రైడింగ్ ప్రయత్నాలు నిలబెట్టుకోవడంతో స్కోరు దాదాపు సమంగా సాగింది. 36వ నిమిషంలో సుకేశ్ చక్కటి రైడ్‌తో టైటాన్స్ స్కోరు 27-27తో సమం చేసింది. ఈ దశలో టైటాన్స్, పల్టన్ రక్షణాత్మకంగా ఆడటంతో నాలుగు రైడ్లు పాయింట్లు రాకుండా ముగిశాయి. పల్టన్ వరుసగా రెండు పాయింట్లు సాధించడంతో టైటాన్స్‌కు ఓటమి తప్పదనిపించింది. అయితే చివరి నిమిషంలో ప్రశాంత్ రాయ్ పాయింట్ తీసుకు రాగా... టైటాన్స్ చేతికి ప్రవీణ్ చిక్కడంతో మ్యాచ్ టైగా ముగిసింది. ప్రతీ మ్యాచ్‌లో చెలరేగిన రాహుల్ చౌదరి ఈ మ్యాచ్‌లో నిరాశపర్చాడు. టైటాన్స్ తరఫున సుకేశ్ 9, దీపక్ 7 పాయింట్లు స్కోర్ చేయగా.... పుణేరీ ఆటగాళ్లలో కెప్టెన్ వజీర్ సింగ్ ఒక్కడే 12 పాయింట్లు సాధించడం విశేషం. యు ముంబాకు తొలి ఓటమి సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యు ముంబాకు డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పాంథర్స్ షాక్ ఇచ్చింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో జైపూర్ 35-25 పాయింట్లతో యు ముంబాను ఓడించింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు దబాంగ్ ఢిల్లీ x బెంగాల్ వారియర్స్ రా. గం. 8.00 నుంచి పట్నా పైరేట్స్ x బెంగళూరు బుల్స్ రా. గం. 9.00 నుంచి స్టార్‌స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం -
గెట్...సెట్...కబడ్డీ!
- నేటినుంచి హైదరాబాద్‌లో ప్రొ లీగ్ - సెమీస్‌పై తెలుగు టైటాన్స్ దృష్టి సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ రెండో అర్ధభాగం పోటీలకు రంగం సిద్ధమైంది. 28 మ్యాచ్‌ల అనంతరం నేటినుంచి హైదరాబాద్‌లో ఈ లీగ్ అభిమానులను అలరించనుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. నగరంలో వరుసగా నాలుగు రోజుల పాటు హోం టీమ్ తెలుగు టైటాన్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏడు మ్యాచ్‌ల అనంతరం 26 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న టైటాన్స్ సొంతగడ్డపై చెలరేగి సెమీస్ స్థానం ఖాయం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. తొలి రోజు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్‌తో తలపడుతుంది. కొత్త కెప్టెన్ నేతృత్వంలో... సీజన్లో ఇప్పటికే ఇద్దరు కెప్టెన్లను మార్చిన తెలుగు టైటాన్స్ మరోసారి కొత్త కెప్టెన్ సారథ్యంలో బరిలోకి దిగుతోంది. ఇరాన్ ఆటగాడు మిరాజ్ షేక్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతాడు. గత సీజన్లో త్రుటిలో సెమీస్ స్థానం చేజారిందని, ఈ సారి జట్టు బలంగా ఉందని టీమ్ యజమాని ఎస్. శ్రీనివాస్ అన్నారు. ‘ఇతర జట్లతో పోలిస్తే మా టీమ్‌లో స్టార్ ఆటగాళ్లు లేకపోయినా, కుర్రాళ్లు ఎక్కువగా ఉన్నారు. వారంతా అంచనాలకు మించి రాణించారు. మన అభిమానుల మద్దతుతో సెమీస్‌కు చేరతాం’ అని ఆయన చెప్పారు. గత మ్యాచ్‌లలో తమ డిఫెన్స్ కాస్త బలహీనంగా కనిపించిందని, దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు జట్టు కోచ్ జగ్మోహన్ వెల్లడించారు. అల్లు అర్జున్ జాతీయ గీతాలాపన తొలిసారి హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రొ కబడ్డీ ఆరంభోత్సవ కార్యక్రమాన్ని కూడా ఘనంగా జరిపేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. సినీ హీరో అల్లు అర్జున్ తొలి రోజు జాతీయ గీతాలాపన చేయనున్నాడు. మిగతా నాలుగు రోజుల్లో సినీ గాయకులు గీతామాధురి, అంజనా సౌమ్య, శ్రీరామచంద్ర జాతీయ గీతాన్ని పాడతారు. ఈ లీగ్‌కు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. స్టేడియం సమీపంలోనే ఒక కన్వెన్షన్ సెంటర్లో ప్రత్యేకంగా మ్యాట్ కోర్టులను సిద్ధం చేశారు. అందులోనే టైటాన్స్, జైపూర్ జట్లు సోమవారం ప్రాక్టీస్ చేశాయి. ఖమ్మం కుర్రాడు... తెలుగు టైటాన్స్ జట్టులో ఉన్న ఏకైక తెలుగు ఆటగాడు తోలెం ప్రసాద్. 22 ఏళ్ల ప్రసాద్ స్వస్థలం మణుగూరు సమీపంలోని లక్ష్మీపురం. ఇతను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) అకాడమీ విద్యార్థి. పాఠశాల స్థాయినుంచి కబడ్డీలో విశేషంగా రాణిస్తూ వచ్చిన ప్రసాద్ జూనియర్, ఆ తర్వాత సీనియర్ స్థాయిలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2013, 2014 సీనియర్ నేషనల్స్‌లో ఆల్‌రౌండర్‌గా ఇతను చక్కటి ప్రతిభ కనబర్చాడు. ‘సాయ్’ కోచ్ జగ్మోహన్ ఇతడిని గుర్తించి ప్రోత్సహించారు. ఎక్కడో మారుమూల గిరిజన గ్రామానికి చెందిన తనకు లీగ్‌తో గుర్తింపు రావడం పట్ల ప్రసాద్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఈ అవకాశం నేను ఊహించలేదు. ప్రొ కబడ్డీ వల్ల చాలా మందికి నా గురించి తెలిసింది. భవిష్యత్తులో మంచి ప్లేయర్ కావడమే నా లక్ష్యం’ అని ప్రసాద్ చెప్పాడు. ‘టైటిల్ గెలుస్తాం’ టైటాన్స్ టీమ్‌కు తెలంగాణకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. 2003లో తొలిసారి భారత జట్టు తరఫున ఆడిన శ్రీనివాస్, ఆ తర్వాత పలు అంతర్జాతీయ టోర్నీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. గత ఏడాది ఇంచియాన్ ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన కొరియా టీమ్‌కు ఆయనే కోచ్‌గా వ్యవహరించడం విశేషం. సంగారెడ్డికి చెందిన శ్రీనివాస్‌కు కూడా ఇదే తొలి లీగ్. ‘ప్రొ లీగ్‌కు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇప్పటికే ఈ లీగ్‌తో కబడ్డీ ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా పాపులర్‌గా మారిపోయింది. ఈ టోర్నీలో మా టీమ్ చాలా బాగా ఆడుతోంది. సెమీస్‌తోనే ఆగిపోకుండా టైటిల్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని శ్రీనివాస్ చెప్పారు. -
తెలుగువీర లేవరా!
ఆట గ్రామీణమే అయినా దానికి సోకులు అద్ది ‘ప్రొ లీగ్’ ఇప్పుడు కబడ్డీని అచ్చమైన కార్పొరేట్ క్రీడలా మార్చేసింది. ఆటగాళ్ల కూతతో పాటు తారల తళుకుబెళుకులు, సంగీతం జోరుతో ఈ లీగ్ ఒక్కసారిగా జనాలకు పట్టేసింది. దాంతో ఒక్కసారిగా అభిమానుల్లో కబడ్డీ క్రేజ్ పెరిగిపోయింది. ఫలితంగా మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసేందుకు వారంతా ఉత్సుకతతో ఉన్నారు. లీగ్‌లో గత ఏడాది నిరాశపర్చిన తెలుగు టైటాన్స్ జట్టు ఈసారి సత్తా చాటి అభిమానులను అలరిస్తుండటంతో మన టీమ్‌పై కూడా అంచనాలు పెరిగిపోయాయి. సొంతగడ్డ హైదరాబాద్ అంచె పోరుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో టైటాన్స్ టీమ్ విశేషాలివిగో... - సొంత మైదానంలో పోటీకి సై - సన్నద్ధమైన తెలుగు టైటాన్స్ బృందం - రేపటి నుంచి ‘ప్రొ కబడ్డీ’ షో సాక్షి, హైదరాబాద్: తొలి ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆడిన 14 మ్యాచ్‌లలో 6 మాత్రమే గెలిచిన తెలుగు టైటాన్స్ సెమీఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. కానీ రెండో సీజన్ (2015)లో సగం మ్యాచ్‌లు ముగిసేసరికే ఐదు విజయాలు, 26 పాయింట్లతో టైటాన్స్ రెండో స్థానంలో కొనసాగుతోంది. గత ఏడాది విశాఖపట్నంను హోం గ్రౌండ్‌గా ఉంచుకున్న టీమ్, ఈసారి తమ కేంద్రాన్ని హైదరాబాద్‌కు మార్చింది. మంగళవారం నుంచి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలుగు టీమ్ వరుసగా నాలుగు రోజుల పాటు మ్యాచ్‌లు ఆడుతుంది. సొంత అభిమానుల మధ్య ఈ మ్యాచ్‌లు గెలిస్తే టీమ్ సెమీస్ చేరడం దాదాపు ఖాయమవుతుంది. తెలుగు టైటాన్స్ జట్టు: రాహుల్ చౌదరి, సుకేశ్ హెగ్డే, దీపక్ హుడా, ప్రశాంత్ రాయ్, రోహిత్ బలియాన్, చంద్రన్ రంజిత్, ఇసాక్ ఆంటోని (రైడర్లు), సచిన్ సింగాడే, సందీప్, రాజగురు సుబ్రమణియన్, గోపు, జిష్ణు (డిఫెండర్లు), రవిత్ కుమార్, టి.ప్రసాద్, రూపేశ్ తోమర్, హాది, మేరాజ్, హ్యూనిల్ (ఆల్‌రౌండర్లు). వీరా స్పోర్ట్స్ టీమ్ తెలుగు రాష్ట్రాలలో వేర్వేరు రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు తెలుగు టైటాన్స్ టీమ్‌కు యజమానులుగా ఉన్నారు. ‘వీరా స్పోర్ట్స్’ కింద కబడ్డీ లీగ్‌లోకి వీరు అడుగు పెట్టారు. శ్రీరామనేని శ్రీనివాస్ (కోర్ గ్రీన్ గ్రూప్), మహేశ్ కొల్లి, అనిల్ (గ్రీన్కో గ్రూప్), గౌతమ్ రెడ్డి (ఎన్ఈడీ గ్రూప్) ఈ టీమ్‌లో భాగస్వాములు. హైదరాబాద్‌లో మ్యాచ్‌ల షెడ్యూల్ ఆగస్టు 4: తెలుగు టైటాన్స్ x జైపూర్ పింక్ పాంథర్స్ యు ముంబా x దబాంగ్ ఢిల్లీ ఆగస్టు 5: తెలుగు టైటాన్స్ x బెంగాల్ వారియర్స్ ఆగస్టు 6: బెంగాల్ వారియర్స్ x బెంగళూరు బుల్స్ తెలుగు టైటాన్స్ x పట్నా పైరేట్స్ ఆగస్టు 7: జైపూర్ పింక్ పాంథర్స్ x యు ముంబా తెలుగు టైటాన్స్ x పుణేరీ పల్టన్ ‘సూపర్ స్టార్’ రాహుల్ చౌదరి తెలుగు టైటాన్స్ జట్టులో ఇప్పుడు అందరి దృష్టీ నిలిచిన ఆటగాడు రాహుల్ చౌదరి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇతను గత ఏడాది లీగ్‌లో 151 పాయింట్లు స్కోర్ చేసి ‘బెస్ట్ రైడర్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా యు ముంబా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 23 పాయింట్లు సాధించి రికార్డు సృష్టించాడు. ఈ సీజన్లో కూడా 21 ఏళ్ల రాహుల్ అదే జోరు కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే 7 మ్యాచ్‌లలో 32 రైడ్ పాయింట్లు స్కోర్ చేసిన ఇతను వేర్వేరు విభాగాల్లో ఆరు అవార్డులు గెలుచుకున్నాడు. ఇక ఈ సీజన్లో ఇన్స్పైరింగ్ డిఫెండర్‌గా మూడు సార్లు అవార్డు గెలుచుకున్న దీపక్ నివాస్ హుడా జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. టోర్నీలో పిన్న వయస్కుడైన 18 ఏళ్ల సందీప్ మరో కీలక సభ్యుడు. అతడే ‘శ్రీమంతుడు’ ప్రొ కబడ్డీ లీగ్‌లో అత్యధిక బిడ్ పొందిన ఇద్దరు ఆటగాళ్లు టైటాన్స్ జట్టులోనే ఉన్నారు. ఇరాన్‌కు చెందిన హాది ఓష్టోరక్ను రూ. 21.1 లక్షలకు తెలుగు టీమ్ సొంతం చేసుకుంది. లీగ్‌లో ఆటగాళ్ల కనీస ధర రూ. 1.5 లక్షలతో పోలిస్తే ఇది 14 రెట్లు ఎక్కువ కావడం విశేషం. రెండో స్థానంలో ఇరాన్‌కే చెందిన మేరాజ్ షేక్ (రూ. 20.1 లక్షలు) ఉన్నాడు. తొలి సీజన్లో అత్యధిక ధర పలికిన రాకేశ్ కుమార్ (రూ. 12.8 లక్షలు)తో చూసినా ఇది చాలా ఎక్కువ మొత్తంగా చెప్పవచ్చు. వీరిద్దరు గత ఏడాది ఆసియా క్రీడల్లో రజతం సాధించిన ఇరాన్ జట్టులో సభ్యులుగా ఉన్నారు. మేరాజ్ అన్ని మ్యాచ్‌లు ఆడగా, హాది ఒక మ్యాచ్‌లోనే బరిలోకి దిగాడు. కొరియాకు చెందిన పార్క్ హ్యూనిల్ అనే ఆటగాడు 18 మంది సభ్యుల జట్టులో ఉన్నా ఇంకా బరిలోకి దిగలేదు. అంతర్జాతీయ ఆటగాళ్ల అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని, వీరితో కలిసి ఆడితే కుర్రాళ్లు నేర్చుకునే అవకాశం ఉంటుందని టీమ్ మేనేజ్మెంట్ చెబుతోంది. తెలుగు ఆటగాడు టి. ప్రసాద్‌కు సబ్‌స్టిట్యూట్‌గా 3 మ్యాచ్‌లలో ఆడే అవకాశం దక్కింది. -
జైపూర్‌కు రెండో విజయం
పట్నా: డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్‌కు ప్రొ కబడ్డీ లీగ్ తాజా సీజన్లో రెండో విజయం దక్కింది. ఇప్పటిదాకా ఏడు మ్యాచ్‌లు ఆడినా పెద్దగా ఆకట్టుకోని జైపూర్ జట్టు ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పూర్తి స్థాయిలో రెచ్చిపోయింది. ఫలితంగా పుణేరి పల్టన్స్‌పై 35-29 తేడాతో నెగ్గింది. సోను నర్వాల్ 8, జస్వీర్ సింగ్, రాజేశ్ నర్వాల్ ఎనిమిదేసి రైడ్ పాయింట్లు సాధించారు. జైపూర్ రెండు సార్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. ఇరు జట్లు సమానంగా చెరి 20 రైడ్ పాయింట్లు సాధించాయి. పుణే కెప్టెన్ ప్రవీణ్ నివాలే 9 పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. ప్రారంభం నుంచే జైపూర్ జోరును ప్రదర్శించడంతో తొలి అర్ధ భాగంలో 19-13తో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. ఆ తర్వాత కూడా ఇదే ఆధిపత్యాన్ని చూపెట్టి పుణెను ఓడించింది. పట్నా పైరేట్స్, బెంగాల్ వారియర్స్ మధ్య హోరాహోరీగా జరిగిన మరో మ్యాచ్ 20-20తో ‘డ్రా’గా ముగిసింది. సోమవారం మ్యాచ్‌లు లేవు. మంగళవారం హైదరాబాద్ అంచె పోటీలు ప్రారంభమవుతాయి. -
తెలుగు టైటాన్స్‌కు షాక్
- బెంగళూరు చేతిలో భారీ ఓటమి - పొ కబడ్డీ లీగ్ పట్నా: ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో ప్రొ కబడ్డీ లీగ్‌లో మంచి జోరు మీదున్న తెలుగు టైటాన్స్ జట్టు తమ ఏడో మ్యాచ్‌లో అనూహ్యంగా బెంగళూరు చేతిలో 14 పాయింట్ల భారీ తేడాతో ఓడిపోయింది. పటియాల స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 35-21 స్కోరుతో టైటాన్స్‌ను చిత్తు చేసింది. బెంగళూరు కెప్టెన్ మంజీత్ చిల్లర్ అద్భుతమైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్నాడు. మంజీత్ 9, అజయ్ ఠాకూర్ 9 పాయింట్లతో చెలరేగారు. తెలుగు టైటాన్స్ స్టార్ ఆటగాళ్లు రాహుల్ చౌదురి, దీపక్ హుడా, సుకేశ్ హెగ్డే ముగ్గురూ విఫలమయ్యారు. మ్యాచ్ ప్రథమార్ధంలో 12-9తో ఆధిక్యం సాధిం చిన బెంగళూరు ద్వితీయార్ధంలో చెలరేగి ఆడింది. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 39-22తో దబాంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. ప్రస్తుతం టైటాన్స్ ఏడు మ్యాచ్‌ల ద్వారా 26 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలోనే ఉంది. యూ ముంబా జట్టు ఆరు మ్యాచ్‌ల ద్వారా 30 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టీవీలో పెరిగిన ఆదరణ ముంబై: ఆరంభ సీజన్‌తో పోలిస్తే ఈసారి ప్రొ కబడ్డీ లీగ్‌కు టీవీ ప్రేక్షకుల ఆదరణ విపరీతంగా పెరిగింది. రెండో అంచె పోటీలకు 45 శాతం అధిక వ్యూవర్షిప్ నమోదైనట్లు స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది. ‘జూలై 18న జైపూర్, యు ముంబాల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌కు 7.2 టీవీఎం (బీఏఆర్సీ ప్యానెల్ సీఎస్4+) నమోదు అయ్యింది. గతేడాది (టీఏఎమ్ ప్యానెల్ సీఎస్4+)తో పోలిస్తే ఇది 45 శాతం అధికం’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. తొలి వారం లీగ్‌ను ఆన్లైన్లో 10.1 మిలియన్ ప్రేక్షకులు వీక్షించారని వెల్లడించింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు యు ముంబా x దబాంగ్ ఢిల్లీ రా. గం. 8.00 నుంచి పట్నా పైరేట్స్ x పుణెరి పల్టాన్ రా. గం. 9.00 నుంచి స్టార్‌స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం -
జైపూర్‌కు మళ్లీ షాక్
బెంగాల్ వారియర్స్ సంచలనం {పొ కబడ్డీ లీగ్-2 కోల్‌కతా: డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్‌కు మరోసారి చుక్కెదురైంది. ప్రొ కబడ్డీ లీగ్-2లో భాగంగా బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్‌కు చెందిన ఈ జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 28-26తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను బోల్తా కొట్టించింది. బెంగాల్ వారియర్స్‌కు ఈ సీజన్లో ఇదే తొలి విజయం కావడం విశేషం. జైపూర్ జట్టు తొలి అర్ధభాగంలో ఆకట్టుకున్నా మ్యాచ్ కొనసాగేకొద్దీ తడబాటుకులోనై మూల్యం చెల్లించుకుంది. ఒకదశలో 20-14కు ఆధిక్యంలో నిలిచింది. అయితే చివరి నిమిషాల్లో బెంగాల్ సమన్వయంతో ఆడుతూ జైపూర్ స్టార్ రైడర్ జస్వీర్‌ను రెండుసార్లు అవుట్ చేసింది. మ్యాచ్ ముగియడానికి కొన్ని సెకన్లు మాత్రమే ఉందనగా బెంగాల్ 25-26తో పాయింట్ వెనుకంజలో ఉంది. ఈ సమయంలో రైడింగ్‌కు వచ్చిన జైపూర్ ఆటగాడు సమర్జీత్ సింగ్‌ను నిలువరించడంతో జైపూర్ ఆలౌ టైంది. దాంతో బెంగాల్ ఖాతాలో ఒకేసారి మూడు పాయింట్లు చేరడంతో వారికి సంచలన విజయం దక్కింది. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 31-26తో పాట్నా పైరేట్స్‌ను ఓడించింది. కబడ్డీలోనూ బెం‘గాలి’ వీయాలి: గంగూలీ గతేడాది ఏడో స్థానంలో నిలిచి నిరాశపరిచిన బెంగాల్ వారియర్స్ ఈసారి టైటిల్‌పై గురి పెట్టాలని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించాడు. బుధవారం కోల్‌కతా దశ పోటీలను ప్రారంభించిన గంగూలీ ఈ సందర్భంగా జాతీయ గీతాలాపన చేశాడు. ‘బెంగాల్‌కు చెందిన ఫ్రాంచైజీలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ఇండియన్ సూపర్‌లీగ్ (ఐఎస్ఎల్) టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాయి. కబడ్డీలో బెంగాల్ వారియర్స్ ఈ ఘనత సాధించాలి. ప్రొ కబడ్డీ లీగ్ దేశవాళీ ఆటగాళ్లకు ఎంతో ఉపకరిస్తుంది’ అని గంగూలీ అన్నాడు. కబడ్డీ తన అభిమాన క్రీడ అని, చిన్నతనంలో చాలామంది ఈ క్రీడ ఆడేవారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.