చాంపియన్ యు ముంబా | U Mumba stun Bengaluru Bulls 36-30 to lift Pro Kabaddi League 2015 title | Sakshi
Sakshi News home page

చాంపియన్ యు ముంబా

Published Mon, Aug 24 2015 12:40 AM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM

చాంపియన్ యు ముంబా

చాంపియన్ యు ముంబా

ఫైనల్లో బెంగళూరుపై గెలుపు 
తెలుగు టైటాన్స్‌కు మూడో స్థానం
ప్రొ కబడ్డీ లీగ్ రెండో సీజన్

 
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ రెండో సీజన్‌లో యు ముంబా జట్టు విజేతగా నిలిచింది. తొలి సీజన్‌లో  రన్నరప్‌గా నిలిచిన యు ముంబా ఈసారి కచ్చితంగా టైటిల్ దక్కించుకోవాలనే కసితో ఆరంభం నుంచే అదరగొట్టి చివరకు అనుకున్న ఫలితం సాధించింది. ఆదివారం బెంగళూరు బుల్స్‌తో జరిగిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్‌లో 36-30 తేడాతో ముంబా నెగ్గింది. విజేతకు రూ. కోటి ప్రైజ్‌మనీ లభించగా... ర న్నరప్ బెంగళూరుకు రూ.50 లక్షలు దక్కాయి. ఈ మ్యాచ్‌లో బెంగళూరును ముంబా జట్టు రెండు సార్లు ఆలౌట్ చేయగా, షబీర్ బాపు 9 రైడ్ పాయింట్లు సాధించాడు. బెంగళూరు కెప్టెన్ మంజీత్ చిల్లార్ కూడా 9 పాయింట్లు సాధించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు నువ్వా.. నేనా అనే రీతిలో తలపడ్డాయి. తొలి పాయింట్‌ను ముంబానే సాధించినప్పటికీ వెంటనే బెంగళూరు తేరుకుని గట్టి పోటీనిచ్చింది. దీంతో ఆరంభ 15 నిమిషాల ఆటలో 7-7తో ఇరు జట్లు సమానంగా పాయింట్లు పంచుకున్నాయి. అయితే అర్ధ భాగం ముగుస్తుందనగా ముంబా ఒక్కసారిగా జోరు పెంచింది. అత్యుత్తమ డిఫెన్స్‌తో ఆకట్టుకుని 16-8తో ఆధిక్యం అందుకుంది. ఆ తర్వాత ద్వితీయార్థం ప్రారంభంలో బెంగళూరు రైడర్స్ కాస్త పోరాడారు. కానీ అటాకింగ్ ఆటతో ముంబా జట్టు పైచేయి సాధించింది. 32వ నిమిషంలో 23-18తో వెనుకబడి ఉన్న సమయంలో బెంగళూరు రైడర్ అజయ్ ఠాకూర్ కోర్టులో ఉన్న ముగ్గురినీ అవుట్ చేసి ఐదు పాయింట్లతో స్కోరును సమం చేశాడు. దీంతో మ్యాచ్‌లో ఒక్కసారిగా ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. అయినా ముంబా ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాక పోగా షబీర్ బాపు ఒకేసారి మూడు పాయింట్లతో జట్టును 29-24 ఆధిక్యంలో నిలిపాడు. ఇదే జోరును చివరిదాకా చూపిన ముంబా విజేతగా నిలిచింది.

 మూడో స్థానంలో తెలుగు టైటాన్స్
 లీగ్ ఆద్యంతం అద్భుతంగా రాణించిన తెలుగు టైటాన్స్ జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు మూడు, నాలుగో స్థానాల కోసం జరిగిన ఈ మ్యాచ్‌లో 34-26 తేడాతో పట్నా పైరేట్స్‌ను టైటాన్స్ చిత్తు చేసింది. రాహుల్ చౌదరి 10, ప్రశాంత్ రాయ్ 6 రైడ్ పాయింట్లు సాధించారు. పట్నాను రెండు సార్లు ఆలౌట్ చేయగలిగింది. పట్నా కెప్టెన్ సందీప్ నర్వాల్ ఆల్‌రౌండ్ షోతో 11 పాయింట్లు సాధించి ఆకట్టుకున్నా ఫలితం లేకపోయింది. తొలి అర్ధ భాగంలోనే 16-8తో టైటాన్స్ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. మూడో స్థానంలో నిలిచిన తెలుగు టైటాన్స్‌కు రూ.30 లక్షలు, పట్నాకు రూ. 20 లక్షలు ప్రైజ్‌మనీగా ఇచ్చారు.
 
ఉత్తమ ఆటగాళ్లు: ై రెజింగ్ స్టార్ ఆఫ్ ద టోర్నీ:  సందీప్ (టైటాన్స్) రూ. 5 లక్షలు   ఏ  రైడర్ ఆఫ్ ద టోర్నీ: కషిలింగ్  (ఢిల్లీ) రూ. 5 లక్షలు   ఏ  డిఫెండర్ ఆఫ్ ద టోర్నీ: రవీందర్ (ఢిల్లీ) రూ. 5 లక్షలు  ఏ ఆల్‌రౌండర్ ఆఫ్ ద టోర్నీ: మంజీత్ చిల్లర్ (బెంగళూరు) మహీంద్రా జీపు
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement