జైపూర్‌కు మళ్లీ షాక్
బెంగాల్ వారియర్స్ సంచలనం
{పొ కబడ్డీ లీగ్-2
కోల్‌కతా: డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్‌కు మరోసారి చుక్కెదురైంది. ప్రొ కబడ్డీ లీగ్-2లో భాగంగా బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్‌కు చెందిన ఈ జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 28-26తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను బోల్తా కొట్టించింది. బెంగాల్ వారియర్స్‌కు ఈ సీజన్‌లో ఇదే తొలి విజయం కావడం విశేషం. జైపూర్ జట్టు తొలి అర్ధభాగంలో ఆకట్టుకున్నా మ్యాచ్ కొనసాగేకొద్దీ తడబాటుకులోనై మూల్యం చెల్లించుకుంది. ఒకదశలో 20-14కు ఆధిక్యంలో నిలిచింది. అయితే చివరి నిమిషాల్లో బెంగాల్ సమన్వయంతో ఆడుతూ జైపూర్ స్టార్ రైడర్ జస్వీర్‌ను రెండుసార్లు అవుట్ చేసింది. మ్యాచ్ ముగియడానికి కొన్ని సెకన్లు మాత్రమే ఉందనగా బెంగాల్ 25-26తో పాయింట్ వెనుకంజలో ఉంది. ఈ సమయంలో రైడింగ్‌కు వచ్చిన జైపూర్ ఆటగాడు సమర్జీత్ సింగ్‌ను నిలువరించడంతో జైపూర్ ఆలౌ టైంది. దాంతో బెంగాల్ ఖాతాలో ఒకేసారి మూడు పాయింట్లు చేరడంతో వారికి సంచలన విజయం దక్కింది. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 31-26తో పాట్నా పైరేట్స్‌ను ఓడించింది.
కబడ్డీలోనూ బెం‘గాలి’ వీయాలి: గంగూలీ
గతేడాది ఏడో స్థానంలో నిలిచి నిరాశపరిచిన బెంగాల్ వారియర్స్ ఈసారి టైటిల్‌పై గురి పెట్టాలని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించాడు. బుధవారం కోల్‌కతా దశ పోటీలను ప్రారంభించిన గంగూలీ ఈ సందర్భంగా జాతీయ గీతాలాపన చేశాడు. ‘బెంగాల్‌కు చెందిన ఫ్రాంచైజీలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ఇండియన్ సూపర్‌లీగ్ (ఐఎస్‌ఎల్) టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాయి. కబడ్డీలో బెంగాల్ వారియర్స్ ఈ ఘనత సాధించాలి. ప్రొ కబడ్డీ లీగ్ దేశవాళీ ఆటగాళ్లకు ఎంతో ఉపకరిస్తుంది’ అని గంగూలీ అన్నాడు. కబడ్డీ తన అభిమాన క్రీడ అని, చిన్నతనంలో చాలామంది ఈ క్రీడ ఆడేవారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.