15 పాయింట్లతో మెరిసిన పట్నా పైరేట్స్ రెయిడర్
నోయిడా: స్టార్ రెయిడర్ దేవాంక్ 15 పాయింట్లతో విజృంభించడంతో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో పట్నా పైరేట్స్ ఆరో విజయం ఖాతాలో వేసుకుంది. లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో పట్నా పైరేట్స్ 52–31 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌పై విజయం సాధించింది. పట్నా తరఫున దేవాంక్ 10 రెయిడ్ పాయింట్లు, 5 బోనస్ పాయింట్లు సాధించగా... అయాన్ 11 పాయింట్లతో సత్తా చాటాడు.
సందీప్ కుమార్ (8 పాయింట్లు), దీపక్ రాఠి (5 పాయింట్లు) కూడా రాణించడంతో పట్నా జట్టు ఘనవిజయం సాధించింది. మరోవైపు బెంగాల్ వారియర్స్ తరఫున నితిన్ కుమార్ (11 పాయింట్లు) ఒంటరి పోరాటం చేశాడు. తాజా సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన పట్నా 6 విజయాలు, 4 పరాజయాలతో 33 పాయింట్లు ఖాతాలో వేసుకొని నాలుగో స్థానానికి చేరింది.
మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 32–24 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపొందింది. పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్ 9 పాయింట్లు, నీరజ్ నర్వాల్ 6 పాయింట్లతో రాణించారు. గుజరాత్ జెయింట్స్ తరఫున గుమాన్ సింగ్ 11 పాయింట్లతో పోరాడిన జట్టును గెలిపించలేకపోయాడు.
9 మ్యాచ్‌లాడిన జైపూర్ 5 విజయాలు, 3 పరాజయాలు, ఒక ‘టై’తో 30 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానానికి చేరింది. లీగ్‌లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో తమిళ్ తలైవాస్ (రాత్రి 8 గంటలకు), దబంగ్ ఢిల్లీతో బెంగళూరు బుల్స్ (రాత్రి 9 గంటలకు) తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment