అనుభవంతోనే ఫలితాలు: ధోని
బ్రిస్బేన్: విదేశీ సిరీస్‌లలో నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతున్నా... భారత జట్టు కెప్టెన్ ఎం.ఎస్.ధోని మాత్రం తమ బ్యాట్స్‌మెన్‌కు మద్దతుగా నిలిచాడు. గతంతో పోలిస్తే విదేశీ గడ్డపై భారత బ్యాట్స్‌మెన్ ఆటతీరులో ఎంతో పురోగతి కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఓడిపోయినప్పటికీ... ఈ రెండు మ్యాచ్‌ల్లో కేవలం 20 నిమిషాలపాటు ఆడిన చెత్త ఆట మ్యాచ్ ఫలితాలను తారుమారు చేసిందని అతను వ్యాఖ్యానించాడు. ‘గతేడాదితో పోలిస్తే విదేశీ సిరీస్‌లలో మన బ్యాటింగ్ తీరు మెరుగైంది. ఇదే తరహాతో ముందుకు వెళ్లాలి.
ఇలాగైతే వివిధ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. అనుభవానికి ప్రత్యామ్నాయం లేదు. ఎక్కడైనా అనుభవం ఉన్నవారు ఒక్కసారిగా అందుబాటులో ఉండరు. ఈ ఆటగాళ్లే ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతూ అనుభవాన్ని గడించాలి. విదేశాల్లో ఎంత ఎక్కువగా ఆడితే అంతగా అనుభవం లభిస్తుంది. అంతేగానీ ఉన్నపళంగా అనుభవజ్ఞులు దొరకరు’ అని ధోని తెలిపాడు. ‘బ్రిస్బేన్ టెస్టులోని రెండు ఇన్నింగ్స్‌లో మా బ్యాటింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. గతంలోనూ ఇలా జరిగింది. పరిస్థితి ఎలా ఉన్నా క్రీజ్‌లో సానుకూల దృక్పథంతో ఆడాలి. బంతిని బట్టి షాట్‌లు కొట్టాలి’ అని ధోని తెలిపాడు.
భార్యలకు అనుమతి...
వరుసగా రెండు టెస్టుల పరాజయాలతో డీలా పడిన భారత క్రికెట్ ఆటగాళ్లకు ఇది కచ్చితంగా ‘శుభవార్తే’. తమ భార్యలతో కలిసి ఉండేందుకు జట్టు సభ్యులకు బీసీసీఐ అనుమతినిచ్చింది. ఫలితంగా ఈనెల 26న మెల్‌బోర్న్‌లో మొదలయ్యే మూడో టెస్టు కంటే ముందే ధోని, అశ్విన్, ధావన్, పుజారా, ఉమేశ్ యాదవ్, రహానే, మురళీ విజయ్‌లతో వారి భార్యలు కలిసే అవకాశముంది. అయితే ప్రియురాళ్లకు అనుమతి నిరాకరించడంతో విరాట్ కోహ్లికి మాత్రం నిరాశే...!
ఇషాంత్, స్మిత్‌లకు జరిమానా
ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో అసభ్యకర పదజాలం వాడినందుకు భారత పేసర్ ఇషాంత్ శర్మకు జరిమానా విధించారు. మూడో రోజు ఆటలో కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌ను అవుట్ చేసిన తర్వాత ఇషాంత్ ఆమోదయోగ్యం కానీ మాటలు మాట్లాడినట్లు టీవీల్లో స్పష్టమైంది. ఫలితంగా ఇషాంత్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. ఈ జరిమానాను బౌలర్ అంగీకరించాడని, తదుపరి విచారణ అవసరం లేదని క్రో వెల్లడించారు. మరోవైపు స్లో ఓవర్ రేట్ కారణంగా ఆసీస్ కెప్టెన్ స్మిత్‌కు 60 శాతం, ఆటగాళ్లకు 30 శాతం జరిమానా వేశారు.