mahender singh dhoni
-
ధోని.. సైన్యంలో చేరిపోయాడు
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన రెండు నెలల సైనిక శిక్షణను ప్రారంభించాడు. పారాచూట్ రెజిమెంట్‌లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని... బెంగళూరులోని బెటాలియన్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేశాడు. అతడు ఈ నెల 31 నుంచి ఆగస్ట్ 19 వరకు బెటాలియన్‌తో ఉంటాడు. విక్టర్ ఫోర్స్‌లో భాగంగా దీని యూనిట్ కశ్మీర్ లోయలో విధులు నిర్వర్తిస్తోంది. సైన్యం ప్రధాన కార్యాలయం నుంచి అనుమతి వచ్చాక ధోని... పహారా, గార్డ్, సెంట్రీ పోస్ట్, దళంలో భాగమవడం తదితర బాధ్యతలు చేపడతాడు. ‘ధోనిలాంటి భారత క్రికెట్ దిగ్గజం తీసుకున్న నిర్ణయం.. దేశ యువతలో సైన్యంలో పని చేయాలన్న స్ఫూర్తిని కలిగిస్తుంది. అతడు కోరుకునేది కూడా అదే’ అని ఓ అధికారి తెలిపాడు. వైమానిక దళ విమానం నుంచి ఐదు పారాచూట్ జంపింగ్‌లు చేయడం ద్వారా ధోని 2015లోనే పారాట్రూపర్‌గా అర్హత సాధించాడు. -
‘అమ్రపాలి’పై ధోని ఫిర్యాదు
న్యూఢిల్లీ : భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రపాలి గ్రూప్‌పై న్యాయపోరాటానికి దిగారు. అమ్రపాలి గ్రూప్, తనకు రూ.150 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆరోపిస్తూ ధోని దావా దాఖలు చేశారు. ఈ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న తనకు ఇప్పటి వరకు ఎలాంటి చెల్లింపులు చేయలేదని ధోని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రియల్ ఎస్టేట్ సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అంతేకాక పలు నగరాల్లో హౌజింగ్ ప్రాజెక్ట్‌లను కూడా పూర్తి చేయలేకపోతోంది. కేవలం ధోని మాత్రమే కాక, కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్, దక్షిణాఫ్రికాకు చెందిన క్రికెటర్ డుప్లెసిస్పై కూడా అమ్రపాలిపై ఢిల్లీ హైకోర్టులో రికవరీ దావా వేశారు. బ్రాండింగ్, మార్కెటింగ్ కార్యకాలపాల్లో కోసం అమ్రపాలి గ్రూప్ తమకు ఎలాంటి నగదు చెల్లించలేదని అమ్రపాలి గ్రూప్‌కు క్రికెట్ స్టార్లను మేనేజ్ చేస్తున్న రితి స్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ పాండే తెలిపారు. ఆ రియల్ ఎస్టేట్ సంస్థ మొత్తం క్రికెటర్లకు రూ.200 కోట్లు బకాయి పడిందని చెప్పారు. ఈ రియల్ ఎస్టేట్ గ్రూప్ హౌజింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం లేదని ఆ ప్రాజెక్ట్ తరుఫు గృహ వినియోగదారులు పెద్ద ఎత్తున్న సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోయడంతో, 2016 ఏప్రిల్‌లో ఇక ఆ బ్రాండు అంబాసిడర్‌గా ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే. కొంతమంది రెసిడెంట్లు తమ ట్వీట్లను ధోని కూడా ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ విషయంపై స్పందించడానికి అమ్రపాలి గ్రూప్ అధికార ప్రతినిధి నిరాకరించారు. -
అత్యుత్తమ వన్డే క్రికెటర్ సచినా, ధోనియా?
రేసులో గిల్‌క్రిస్ట్, అక్రమ్, రిచర్డ్స్ న్యూఢిల్లీ: వన్డే క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్ ఎవరనే దానిపై బ్యాటింగ్ దిగ్గజం సచిన్, కెప్టెన్ ఎం.ఎస్.ధోనిల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ ఇద్దరితో పాటు గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా), వసీమ్ అక్రమ్ (పాకిస్తాన్), వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్)లు కూడా దీని కోసం పోటీపడుతున్నారు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోకు చెందిన ‘క్రికెట్ మంత్లీ’ అనే మ్యాగజైన్ ఈ సర్వేను చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 50 మంది దిగ్గజ ఆటగాళ్లు, వ్యాఖ్యాతలు, క్రికెట్ కాలమిస్ట్‌లతో కూడిన జ్యూరీ ఈ ఐదుగురిలో ఒక్కర్ని ఎంపిక చేయనుంది. మరో రెండు వారాల్లో విజేతను ప్రకటించనున్నారు. సమకాలీన క్రికెటర్లలో సచిన్ అంతకాలం ఆట ఆడిన మరో ఆటగాడు లేడు. ఈ విషయంలో మాస్టర్‌కు ఎవరూ సాటిరారు. దాంతోపాటు క్రికెట్లో ఉన్న దాదాపు అన్ని రికార్డులను అతను తిరగరాశాడు. మరోవైపు వన్డేల్లో అత్యుత్తమ ఫినిషిర్‌గా పేరు తెచ్చుకున్న ధోని.. భారత్ జట్టుకు ఊహించని విజయాలు అందించాడు. 2011 ప్ర పంచకప్ టైటిల్ గెలవడంలోనూ కీలక పాత్ర పోషించాడు. ఇక తన 12 ఏళ్ల కెరీర్లో ఆసీస్‌కు లెక్కలేనన్నీ విజయాలు అందించిన గిల్‌క్రిస్ట్ మంచి స్ట్రోక్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నాడు. -
అనుభవంతోనే ఫలితాలు: ధోని
బ్రిస్బేన్: విదేశీ సిరీస్‌లలో నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతున్నా... భారత జట్టు కెప్టెన్ ఎం.ఎస్.ధోని మాత్రం తమ బ్యాట్స్‌మెన్‌కు మద్దతుగా నిలిచాడు. గతంతో పోలిస్తే విదేశీ గడ్డపై భారత బ్యాట్స్‌మెన్ ఆటతీరులో ఎంతో పురోగతి కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఓడిపోయినప్పటికీ... ఈ రెండు మ్యాచ్‌ల్లో కేవలం 20 నిమిషాలపాటు ఆడిన చెత్త ఆట మ్యాచ్ ఫలితాలను తారుమారు చేసిందని అతను వ్యాఖ్యానించాడు. ‘గతేడాదితో పోలిస్తే విదేశీ సిరీస్‌లలో మన బ్యాటింగ్ తీరు మెరుగైంది. ఇదే తరహాతో ముందుకు వెళ్లాలి. ఇలాగైతే వివిధ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. అనుభవానికి ప్రత్యామ్నాయం లేదు. ఎక్కడైనా అనుభవం ఉన్నవారు ఒక్కసారిగా అందుబాటులో ఉండరు. ఈ ఆటగాళ్లే ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతూ అనుభవాన్ని గడించాలి. విదేశాల్లో ఎంత ఎక్కువగా ఆడితే అంతగా అనుభవం లభిస్తుంది. అంతేగానీ ఉన్నపళంగా అనుభవజ్ఞులు దొరకరు’ అని ధోని తెలిపాడు. ‘బ్రిస్బేన్ టెస్టులోని రెండు ఇన్నింగ్స్‌లో మా బ్యాటింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. గతంలోనూ ఇలా జరిగింది. పరిస్థితి ఎలా ఉన్నా క్రీజ్‌లో సానుకూల దృక్పథంతో ఆడాలి. బంతిని బట్టి షాట్లు కొట్టాలి’ అని ధోని తెలిపాడు. భార్యలకు అనుమతి... వరుసగా రెండు టెస్టుల పరాజయాలతో డీలా పడిన భారత క్రికెట్ ఆటగాళ్లకు ఇది కచ్చితంగా ‘శుభవార్తే’. తమ భార్యలతో కలిసి ఉండేందుకు జట్టు సభ్యులకు బీసీసీఐ అనుమతినిచ్చింది. ఫలితంగా ఈనెల 26న మెల్బోర్న్లో మొదలయ్యే మూడో టెస్టు కంటే ముందే ధోని, అశ్విన్, ధావన్, పుజారా, ఉమేశ్ యాదవ్, రహానే, మురళీ విజయ్‌లతో వారి భార్యలు కలిసే అవకాశముంది. అయితే ప్రియురాళ్లకు అనుమతి నిరాకరించడంతో విరాట్ కోహ్లికి మాత్రం నిరాశే...! ఇషాంత్, స్మిత్‌లకు జరిమానా ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో అసభ్యకర పదజాలం వాడినందుకు భారత పేసర్ ఇషాంత్ శర్మకు జరిమానా విధించారు. మూడో రోజు ఆటలో కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌ను అవుట్ చేసిన తర్వాత ఇషాంత్ ఆమోదయోగ్యం కానీ మాటలు మాట్లాడినట్లు టీవీల్లో స్పష్టమైంది. ఫలితంగా ఇషాంత్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. ఈ జరిమానాను బౌలర్ అంగీకరించాడని, తదుపరి విచారణ అవసరం లేదని క్రో వెల్లడించారు. మరోవైపు స్లో ఓవర్ రేట్ కారణంగా ఆసీస్ కెప్టెన్ స్మిత్‌కు 60 శాతం, ఆటగాళ్లకు 30 శాతం జరిమానా వేశారు. -
విరాట్ కోహ్లీనే కెప్టెన్!
అడిలైడ్: రేపట్నుంచి అడిలైడ్ లో ఆరంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్ కు విరాట్ కోహ్లీనే టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని శనివారం జట్టుతో కలిసినా.. అతని చేతి గాయం పూర్తిగా నయం కాకపోవడంతో తొలిటెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని కోహ్లీ స్వయంగా వెల్లడించాడు. మంగళవారం నుంచి జరిగే టెస్ట్ మ్యాచ్ కు తానే బాధ్యతలు చేపట్టబోతున్నట్లు ప్రకటించాడు. ఇదిలా ఉండగా ఆసీస్ కు కెప్టెన్ గా వ్యవహరించేందుకు మైకేల్ క్లార్క్ సిద్ధమయ్యాడు. గత ప్రాక్టీస్ మ్యాచ్ లకు ముందు క్లార్క్ కు నిర్వహించిన ఫిట్ నెస్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో కొంత సందిగ్ధత ఏర్పడింది. అయితే తాజాగా క్లార్క్ ఫిట్ నెస్ ను నిరూపించుకుని పూర్తి స్థాయిలో బరిలో దిగడానికి సిద్దంగా ఉన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. -
కోహ్లీ కెప్టెన్సీ ఆశలు గల్లంతు!
ముంబై: టెస్టు జట్టుకు తొలిసారి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాలనుకున్న టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ ఆశలు గల్లంతయ్యినట్లే కనబడుతోంది. ఈ నెల 9 వ తేదీ నుంచి అడిలైడ్ లో జరిగే తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సిద్దం కావడంతో కోహ్లీ కెప్టెన్సీ ఆశలకు గండిపడే అవకాశం ఏర్పడింది. ముందు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం తొలిటెస్టు డిసెంబర్ 4 వ తేదీన బ్రిస్బేన్ లో జరగాలి. ధోనీ చేతికి గాయం కావడంతో తొలిటెస్టు బాధ్యతలను కోహ్లీకి అప్పచెబుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఆసీస్ క్రికెటర్ ఫిలిఫ్ హ్యూస్ మరణంతో మొత్తం షెడ్యూల్ మొత్తం సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకోవడంతో ఆ టెస్టు 9 వ తేదీకి వాయిదా పడింది. ఈలోపు తొలిటెస్టుకు ధోనీ సిద్దం కావడంతో పాటు ఫిట్ నెస్ పరీక్షల్లో పాస్ కావడంతో కోహ్లీ టెస్టు కెప్టెన్సీ ఆశ ఇప్పట్లో నెరవేరేటట్లు కనబడుట లేదు. -
ఓటమికి బీసీసీఐదే పూర్తి బాధ్యత!
ముంబై :ఇంగ్లండ్ లో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 3-1 తేడాతో కోల్పోవడానికి బీసీసీఐదే పూర్తి బాధ్యతని భారత మాజీ ఆటగాడు వెంగసర్కార్ మండిపడ్డాడు. అసలు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) టెస్ట్ క్రికెట్ కు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించాడు. విదేశాల్లో భారత జట్టు పాల్గొనే మ్యాచ్ ల కోసం సరైన ప్రణాళిక లేదన్నాడు. ఈ కారణంతోనే తాజా వైఫల్యం అని వెంగీ పేర్కొన్నాడు. టీమిండియా కోచ్ డంకెన్ ఫ్లెచర్ దీనిపై తీవ్రంగా దృష్టి పెట్టాలని సూచించాడు. అవసరమైతే కొంతమంది ఆటగాళ్లను జట్టును తొలిగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు. ఈ ఓటమికి ఒక కెప్టెన్ ధోనినే బాధ్యుణ్ని చేయడం తగదన్నాడు. టీమిండియా అత్యధిక విజయాల్లో ధోని గెలుపును మరవకూడదని వెంగీ పేర్కొన్నాడు. అసలు ఈ వైఫల్యానికి బీసీసీఐదే పూర్తి బాధ్యత వహించాలన్నాడు. ఒక సుదీర్ఘమైన టూర్ కు వెళ్లే ముందు సరైన ప్రణాళిక ఉండాలన్నాడు.అది సరిగా అవలంభించకే తొలుత ఆధిక్యంలో ఉన్నా.. ఓటమి చవిచూశామన్నాడు. -
ధోని తప్పుకుంటే ఆ బాధ్యతను మోసేదెవరు?
ఇంగ్లండ్ లోని భారత్ పేలవమైన ప్రదర్శనకు కెప్టెన్ కు మహేందర్ సింగ్ ధోని రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటూ మాజీ ఆటగాళ్లు మద్దతు పలుకుతున్నారు. లార్డ్స్ టెస్టు అనంతరం ఇంగ్లండ్ లో భారత్ ప్రదర్శన పేలవంగా ఉన్నా ధోనిని టెస్టు కెప్టెన్సీ నుంచి తొలిగిస్తారని తాను అనుకోవడం లేదని మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారీ శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ పర్యటనలో భారత్ పేలవమైన ప్రదర్శనపై ధోని సారథ్య బాధ్యతలను తప్పుకున్నట్లు వార్తలు రావడంతో శ్రీకాంత్ పై విధంగా స్పందించాడు. భారత జట్టుకు అనుభవం లేకే ఇంగ్లండ్ టూర్ లో విఫలమైందన్నవ్యాఖ్యలతో శ్రీకాంత్ విభేదించాడు. ప్రస్తుతం టీమిండియాలో ఆటగాళ్ల అనుభవానికి కొదవలేదన్నాడు. కనీసం ఏడుగురు, ఎనిమింది ఆటగాళ్లు అనుభవం ఉన్నా.. పోరాట పటిమలో నైరాశ్యతే ఘోర వైఫల్యానికి కారణమన్నాడు. శ్రీకాంత్ వ్యాఖ్యలతో భారత మాజీ ఆటగాడు గుండప్ప విశ్వనాధ్ ఏకీభవించాడు. ధోనిని కెప్టెన్సీ నుంచి తొలిగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. భారత ఆటగాళ్లు తమ ఆటతీరును పూర్తిగా ప్రదర్శించకపోవడంతోనే ఓటమి చెందారన్నాడు. కాగా, వారి బ్యాటింగ్ లో చిన్న చిన్న లోపాలున్నాయన్నాడు. ఓ తల్లి మాదిరిగా కోచ్ వారి ఆటతీరును సరిదిద్దాలని సూచించాడు. భారత్ కు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించడానికి విరాట్ కోహ్లి అనుభవం సరిపోదని విశ్వనాధ్ స్సష్టం చేశాడు.అసలు ధోని కెప్టెన్ వైదొలిగితే ఆ బాధ్యతలు మోసేది ఎవరని ప్రశ్నించాడు.