
మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నా!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్-10లో తన ఆటతీరుతో స్టార్ ఆటగాళ్లను గుర్తుకుతెస్తున్నాడు ముంబై ఇండియన్స్ ప్లేయర్ నితీష్ రానా. సీజన్లో ఇప్పటివరకూ 266 పరుగులతో అత్యధిక పరుగుల వీరులలో నాలుగో స్థానంలో ఉన్నాడు. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ చిట్కాలే తన ఆటకు ప్లస్ పాయింట్‌గా మారాయని చెప్పాడు. తొలి మ్యాచ్ నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్న రానా దూకుడే మంత్రంగా చెలరేగిపోతున్నాడు. మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నానని.. ఏదో ఒక రోజు టీమిండియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.
'లో స్టాన్స్ వల్ల బ్యాటింగ్‌లో లోపాలు తలెత్తి ఫామ్ కోల్పోయాను. దీంతో గంభీర్ నన్ను కలిసి తరచుగా చిట్కాలు చెప్పేవాడు. షోల్డర్ ను కాస్త అప్ చేస్తూ ఆడటం స్టాన్స్ మార్చుతూ ఆడటం వల్ల పరుగులు సాధించొచ్చని గంభీర్ సూచించాడు. ఐపీఎల్ మొదలయ్యాక సచిన్, జయవర్ధనేలతో చర్చించాను. వాళ్లు ఇచ్చిన సూచనలను నా బ్యాటింగ్‌కు అన్వయించుకున్నాను. దీంతో ఇప్పుడు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపిస్తున్నాను' అని ముంబై కీలక ఆటగాడు నితీశ్ రాణా చెప్పుకొచ్చాడు.
ఫస్ల్ క్లాస్ మ్యాచ్‌ల్లో ఢిల్లీకి ఆడే రానా గురించి కెప్టెన్ గౌతం గంభీర్‌కి బాగా తెలుసు. 2015-16లో దేశవాలీ సీజన్లో రాణించిన రానాను 2016 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్‌కు తీసుకోవాలని గంభీర్ పట్టుబట్టాడు. యాజమాన్య మాత్రం ఆసక్తి చూపలేదు. దీంతో ఆసీజన్లో 10 లక్షలకు ముంబై రానాను తీసుకోవడం ఎంత ప్లస్ పాయింటో వారికి ఇప్పుడు తెలుస్తుంది. ముంబై డబుల్ హ్యాట్రిక్ విజయాలలో రానా ఇన్నింగ్స్‌లు కీలకమయ్యాయి.