కంగారు పడతారో పెడతారో!
సెహ్వాగ్, గంభీర్, ద్రవిడ్, సచిన్, లక్ష్మణ్, కోహ్లి... చివరిసారిగా భారత్ 2012లో ఆస్ట్రేలియాలో టెస్టు ఆడినప్పుడు బ్యాటింగ్ లైనప్ ఇది.విజయ్, ధావన్, పుజారా, కోహ్లి, రహానే, రోహిత్... ఈసారి భారత బ్యాటింగ్ లైనప్ ఇది. ఈ రెండు లైనప్‌లకు ఏ మాత్రం పొంతన లేదు. నాడు తుది జట్టులో అతి కష్టమ్మీద చోటు దక్కించుకున్న విరాట్, ఇప్పుడు జట్టుకు సారథి. రెండేళ్లలో భారత క్రికెట్‌లో వచ్చిన మార్పునకు ఈ లైనప్ అద్దం పడుతోంది.
రెండేళ్ల క్రితం మొత్తం దిగ్గజాలంతా ఉన్న జట్టు 0-4తో చిత్తుచిత్తుగాఓడిపోయింది. మరి ఈ యువ జట్టు ఏం చేయనుంది? కుర్రాళ్లంతా కొత్త ఉత్సాహంతో ఉన్నారంటున్న కోహ్లి మాటలు మైదానంలో ఏ మేరకు ఆచరణలోకి వస్తాయి. భారత టెస్టు భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో తేలిపోనుంది.
ఆస్ట్రేలియాలో నాలుగు టెస్టుల్లో కలిపి రోహిత్ 264 పరుగులు చేయగలడా? శ్రీలంకపై వన్డేలో రోహిత్ శర్మ అన్నే పరుగులు చేయగానే... ఒక ఆస్ట్రేలియా జర్నలిస్ట్ చేసిన ట్వీట్ ఇది. ఉపఖండం ఆవల భారత యువ క్రికెటర్ల టెస్టు సత్తాపై ఉన్న అభిప్రాయం ఇది. ఇది తప్పని నిరూపించాల్సిన అవసరం రోహిత్‌పై ఉంది.
ఒక్క రోహిత్ అనే కాదు... భారత కుర్రాళ్లు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో ఆడలేరనే భావన పోగొట్టాల్సిన సమయం ఇది. ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాలో సుదీర్ఘ సమయం గడపనున్న భారత్... ఆ మెగా టోర్నీ గురించి ఇప్పుడు ఆలోచించకపోవడమే మంచిది. ముక్కోణపు వన్డే టోర్నీ రూపంలో ప్రపంచకప్‌కు సన్నాహాలు ఉన్నాయి. దానికంటే ముందు టెస్టు సిరీస్‌ను గనక గెలిస్తే... బోలెడంత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
సొంతగడ్డపై పులి
భారత్ స్వదేశంలో ఎంత బలమైన జట్టో... ఆస్ట్రేలియా కూడా అంతే బలమైన జట్టు. దీనికి తోడు స్వదేశంలో చివరిసారిగా ఆడిన టెస్టు సిరీస్ యాషెస్‌లో ఆసీస్ స్టార్స్ ఏకంగా 5-0తో ఇంగ్లండ్‌ను క్లీన్‌స్వీప్ చేశారు. సాధారణంగానే అక్కడి పిచ్‌లపై మిగిలిన దేశాల క్రికెటర్లు కాస్త బలహీనంగా కనిపిస్తారు. దీనికితోడు ఆసీస్ ఆటగాళ్లు సొంతగడ్డపై చెలరేగుతూ ఉంటారు. కాబట్టి ఆసీస్‌ను ఓడించాలంటే భారత్ సర్వశక్తులూ ఒడ్డాల్సిందే.
రికార్డుల ఆలోచన వద్దు
పాత రికార్డులు, ఇంగ్లండ్‌లో ఆడిన టెస్టుల గురించి భారత క్రికెటర్లు ఏ మాత్రం ఆలోచించకూడదు. ఎందుకంటే అవన్నీ ప్రతికూలంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్‌లో లార్డ్స్‌లో గెలిచిన తర్వాత భారత్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిన తీరు ఆందోళనకరం. ఆస్ట్రేలియాలో పరిస్థితులు కూడా ఇంచుమించుగా ఇంగ్లండ్ పరిస్థితులతో సమానంగా ఉంటాయి. కాబట్టి భారత క్రికెటర్లకు ఇది క్లిష్టమే. కానీ అసాధ్యం కాదు.
పరిస్థితులు కఠినం
పచ్చని పచ్చికతో కళకళలాడే మైదానాలు... కిక్కిరిసిపోయే స్టేడియాలు... ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్‌లు చూడటానికి కూడా బాగుంటాయి. ఇక పరిస్థితులు కూడా పూర్తిగా మనకు భిన్నం. వేగంగా దూసుకెళ్లే బుల్లెట్లలాంటి బౌన్సర్ల వర్షం కురుస్తూనే ఉంటుంది. మ్యాచ్ నాలుగు, ఐదో రోజు కూడా మంచి బౌన్స్ ఉండటం ఇక్కడి స్టేడియాల ప్రత్యేకత. అయితే సిడ్నీలాంటి కొన్ని వేదికల్లో మాత్రం స్పిన్నర్ల ప్రభావం ఉంటుంది.
ఏమైనా పేసర్లు, బ్యాట్స్‌మెన్ ఇద్దరూ ఈ సిరీస్‌లో కీలకం. గ ంటకు 140 కి.మీ.ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేసే బౌలర్ లేకపోవడం మనకు లోటు. అయితే మ్యాచ్‌లో 20 వికెట్లు తీయగల సత్తా ఇషాంత్, భువనేశ్వర్, షమీలకు ఉంది. ఆరోన్, ఉమేశ్ యాదవ్‌ల రూపంలో వేగాన్ని నమ్ముకున్న బౌలర్లూ ఇద్దరు ఉన్నారు. కాబట్టి మరీ ఎక్కువ ఆందోళన చెందాల్సిన పనిలేదు. బ్యాటింగ్‌లోనే అనుభవలేమి దెబ్బతీస్తుందనేది ఆందోళన.
ఆ రెండు మ్యాచ్‌లు కీలకం
నాలుగు టెస్టుల సిరీస్‌కు ముందు భారత్‌కు రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఉన్నాయి. నిజానికి ఈ రెండు మ్యాచ్‌లు ప్రాక్టీస్‌కు సరిపోవు. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా ఇంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ రెండు మ్యాచ్‌లను ఎంత బాగా వినియోగించుకుంటారో చూడాలి. ముఖ్యంగా ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ బ్యాట్స్‌మెన్‌కు ఎక్కువగా మైదానంలో గడిపే అవకాశం ఇస్తే బాగుంటుంది.
- సాక్షి క్రీడావిభాగం
టెస్టు సిరీస్ షెడ్యూల్
డిసెంబరు 4-8: తొలి టెస్టు బ్రిస్బేన్
డిసెంబరు 12-16: రెండో టెస్టు అడిలైడ్
డిసెంబరు 26-30: మూడో టెస్టు మెల్‌బోర్న్
జనవరి 3-7: నాలుగో టెస్టు సిడ్నీ
భారత్ నవంబరు 24-25 తేదీల్లో, 28-29
తేదీల్లో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతుంది.
టెస్టుల్లో ముఖాముఖి
ఆడినవి భా.గె. ఆ.గె. డ్రా టై
భారత్‌లో 46 19 12 14 1
ఆసీస్‌లో 40 5 26 9 0
మొత్తం 86 24 38 23 1
భా.గె: భారత్ గెలిచినవి, ఆ.గె: ఆస్ట్రేలియా గెలిచినవి
‘ఇంగ్లండ్‌తో పోలిస్తే ఆస్ట్రేలియాలో ఆడటం చాలా భిన్నంగా ఉంటుంది. ఇంగ్లండ్‌లో వికెట్లపై రోజంతా పేస్, స్వింగ్, బౌన్స్ ఉంటుంది. కానీ ఆసీస్‌లో అలా ఉండదు. కాబట్టి ఒకసారి వికెట్‌పై కుదురుకుంటే సులభంగా పరుగులు చేయొచ్చు. మొత్తానికి ఈ టూర్ భారత్‌కు సవాలే. ముఖ్యంగా ఆఫ్ స్టంప్ మీద ఆడే కోహ్లి, పుజారాకు అతి పెద్ద చాలెంజ్.
ఆసీస్ వికెట్లపై విజయవంతం కావాలంటే బలమైన బ్యాక్‌ఫుట్ గేమ్‌ను ఆడాలి. ఆఫ్ స్టంప్ ఆవలగా వెళ్లే బౌన్సర్లను అటాక్ చేయడమే నిజమైన సవాలు. బంతిని ముట్టుకుంటే ఎడ్జ్‌ను తీసుకుంటుంది కాబట్టి దాన్ని దృష్టిలోపెట్టుకోవాలి. ఓవరాల్‌గా ఈ పర్యటనలో పరుగులు చేయాలంటే జట్టు మొత్తం బ్యాక్‌ఫుట్ గేమ్‌పై శ్రమించాలి. ప్రస్తుతం ఉన్న జట్టు నుంచి ఫలితాలు రాబట్టాలంటే కాస్త సమయం పడుతుంది. చివరి మూడు సిరీస్‌ల్లో మనవాళ్లు బాగా ఆడారు. కాబట్టి 2011-12తో పోలిస్తే ఈసారి మంచి ఫలితాలే వస్తాయనుకుంటున్నా’ - ద్రవిడ్ (మాజీ కెప్టెన్)