సానుకూల ఫలితమే!
సాక్షి క్రీడావిభాగం: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ జరిగిన విధానం చూస్తే 0-2తో ఓడిపోవడం భారత్‌కు సానుకూల ఫలితంగా భావించాలి. గత నాలుగు సంవత్సరాలలో ఇంగ్లండ్‌లో రెండుసార్లు, ఆస్ట్రేలియాలో ఒకసారి ఎదురైన ఘోర పరాజయాల దృష్ట్యా ఈ ఫలితం కాస్త మెరుగైందిగా భావించాలి. చివరిసారి ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు (2011-12) సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ లాంటి దిగ్గజాలు ఉన్న బ్యాటింగ్ లైనప్ ఆస్ట్రేలియా బౌలర్లకు ఎదురొడ్డి నిలువలేకపోయింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను 0-4తో ఘోరంగా ఓడిపోయింది.
ఈసారి పర్యటన ఆరంభమైనప్పుడు ఈ యువ జట్టు ఆస్ట్రేలియా గడ్డపై నిలబడలేదనే అభిప్రాయం క్రికెట్ ప్రపంచంలో ఉంది. తొలి టెస్టులో కోహ్లి సారథ్యంలోని యువ క్రికెటర్లు చూపించిన తెగువ ఈ అభిప్రాయం కాస్తా మారేలా చేసింది. అడిలైడ్ టెస్టులో ఓటమి పాలైనా... సరైన స్ఫూర్తితో బ్రిస్బేన్‌లో రెండో టెస్టుకు వెళ్లారు. ఆ మ్యాచ్‌లో మూడు రోజుల పాటు బాగా పోరాడిన భారత్ చివర్లో చేతులెత్తేసి ఓటమిని 2-0కు పెంచుకుంది. మెల్‌బోర్న్, సిడ్నీ టెస్టుల్లో పోరాట పటిమ కనబరచి రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. ఇటీవల కాలంలో స్వదేశంలో ఆస్ట్రేలియా ప్రతి సిరీస్‌నూ దాదాపుగా క్లీన్‌స్వీప్ చేస్తోంది. కానీ భారత యువ జట్టు ఆ ప్రమాదం జరగకుండా అడ్డుకుంది.
నాలుగు టెస్టుల్లో రెండు జట్లు కలిపి 5870 పరుగులు చేయడం ఈ సిరీస్‌లో బ్యాట్స్‌మెన్ ప్రభావం ఎంతలా ఉందో చెప్పడానికి నిదర్శనం. ఆస్ట్రేలియా క్రికెటర్లకు భారత్‌తో సిరీస్‌లో సొంతగడ్డపై తొలి ఇన్నింగ్స్‌లో 400 పైచిలుకు స్కోరు చేయడం మంచినీళ్ల ప్రాయమే. గతంలో దాదాపు అన్ని సందర్భాల్లోనూ ఇది చేశారు. అయితే భారత్ వైపు నుంచి మాత్రం దీనికి బదులు ఉండేది కాదు.
కానీ ఈసారి అనూహ్యంగా భారత బ్యాట్స్‌మెన్ నుంచి ఆసీస్ బౌలర్లకు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. ముఖ్యంగా కోహ్లి (692 పరుగులు), ఓపెనర్ మురళీ విజయ్ (482 పరుగులు), రహానే (399 పరుగులు) భారత్‌ను నిలబెట్టారు. గతంలో అనేక సిరీస్‌లలో లేనిది, ఈ సిరీస్‌లో భారత్ సాధించిన గొప్ప ఘనత భాగస్వామ్యాలు. మురళీ, కోహ్లి... కోహ్లి, రహానేల జోడీలు ఆసీస్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాయి.
పుజారా, రోహిత్, రైనా, ధావన్ ఈ నలుగురూ కూడా విఫలమయ్యారు. వరుసగా మూడు టెస్టుల్లో వచ్చిన అవకాశాలను ధావన్ వినియోగించుకోలేకపోయాడు. దీంతో మరో ప్రత్యామ్నాయం లోకేశ్ రాహుల్‌ను ఓపెనర్‌గా ఆడించాల్సి వచ్చింది. కొత్త కుర్రాడే అయినా ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని రాహుల్ సెంచరీ చేశాడు. తన టెక్నిక్‌ను బయటపెట్టి భవిష్యత్‌కు ఢోకా లేదని నిరూపించాడు. ఇక వన్డే స్టార్ రోహిత్ శర్మ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు.
కానీ అందరికంటే ఎక్కువగా చెప్పుకోవాల్సింది మాత్రం రైనా గురించి. వన్డే ఆటగాడిగా ముద్రపడినా... రైనాలో టెస్టులు ఆడే సత్తా ఉందని టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి నమ్మారు. నిజానికి ఆయన సిఫారసు వల్లే రైనా టెస్టు జట్టులోకి వచ్చాడు. అయితే తుది జట్టులో చోటు కోసం మాత్రం నిరీక్షించాల్సి వచ్చింది. కొత్త కెప్టెన్ కోహ్లి వచ్చాక, జట్టు మేనేజ్‌మెంట్ ఏం ఆలోచిం చిందో గానీ రైనాకు ఓ అవకాశం ఇచ్చారు.
దీన్ని ఎంతలా వృథా చేసుకున్నాడంటే... టెయిలెండర్లు కూడా పరుగులు చేసిన సిడ్నీ పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో మొదటి బంతికే అవుటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో క్రీజులో నిలబడి జట్టును గట్టెక్కించాల్సిన సమయంలో మూడే బంతులకు పెవిలియన్‌లో కూర్చున్నాడు. ఇంతకంటే దారుణ వైఫల్యం మరోటి లేదు. నిజానికి విజయ్, కోహ్లి, రహానేలకు మద్దతు ఏ ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఓ మోస్తరుగా ఆడినా ఫలితం మరోలా ఉండేది.
ఈసారి భారత బౌలర్లలో ఎవరూ పూర్తిగా నాలుగు టెస్టులు ఆడలేదు. షమీ (15 వికెట్లు), అశ్విన్ (12 వికెట్లు), ఉమేశ్ యాదవ్ (11 వికెట్లు), ఇషాంత్ శర్మ (9 వికెట్లు) అందరూ మూడేసి మ్యాచ్‌లు మాత్రమే ఆడారు. ఈ సిరీస్‌లో బ్యాట్స్‌మెన్ పుంజుకున్న స్థాయిలో సగం బౌలర్ల నుంచి సానుకూల ప్రదర్శన వచ్చి ఉంటే సిరీస్ ఫలితం మరోలా ఉండేది. ప్రత్యర్థి జట్టులో స్మిత్ (769 పరుగులు) కొరకరాని కొయ్యలా తయారైతే... ఓపెనర్లు వార్నర్ (427 పరుగులు), రోజర్స్ (417 పరుగులు) కామ్‌గా తమ పని తాము చేసుకుపోయారు.
వీరి ముగ్గురి ఫామ్‌ని బట్టి చూస్తే ఎంత బలమైన బౌలింగ్ లైనప్ అయినా ఇబ్బంది పడక తప్పదు. అయితే ప్రత్యర్థులు దూకుడు మీద ఉన్నప్పుడు పరుగులు రాకుండా నియంత్రించి ఒత్తిడి పెంచే వ్యూహాన్ని మన బౌలర్లు అమలు చేయలేకపోయారు. ముఖ్యంగా బౌలింగ్ లీడర్ ఇషాంత్ శర్మ వైఫల్యం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. షమీ మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఆస్ట్రేలియా స్పిన్నర్ లయోన్ 23 వికెట్లు తీసిన పిచ్‌లపై భారత స్పిన్నర్లంతా కలిపి 17 వికెట్లు తీయగలిగారు. ఇది కూడా గమనించాల్సిన అంశమే.
మొత్తానికి భారత బౌలర్ల వైఫల్యం, ఆస్ట్రేలియా నిలకడ కారణంగా సిరీస్ ఫలితం ఇలా వచ్చింది. గతంతో పోలిస్తే ఇది సానుకూల ఫలితమే. ఎందుకంటే ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లందరికీ చాలా భవిష్యత్తు ఉంది. అందరూ కుర్రాళ్లే. ఈ పర్యటన ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో వచ్చేసారి ఆస్ట్రేలియా పర్యటనకు వీరంతా ధీమాగా వెళ్లగలుగుతారు. భారత్‌లో టెస్టులు ఆడటం, గెలవడం జట్టులో ఎవరు ఉన్నా సాధ్యమే. విదేశాల్లో, ముఖ్యంగా ఉపఖండం బయట టెస్టులు గెలవడం ముఖ్యం. కోహ్లి సానుకూల దృక్పథం, యువ బ్యాట్స్‌మెన్ ఆడిన తీరు చూస్తే... ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో టెస్టు సిరీస్ విజయాలు సాధ్యమే అనిపిస్తోంది.