గంగూలీకి మరో కీలక బాధ్యత!
ముంబై:ఇప్పటికే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడిగా, బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)లో సభ్యుడిగా ఉన్న మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి మరొక కొత్త కీలక బాధ్యతను అప్పచెప్పారు. లోధా ప్యానెల్ సూచించిన సంస్కరణల అమలుకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలో గంగూలీకి స్థానం కల్పించారు.
ఈ మేరకు మంగళవారం బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం(ఎస్జీఎం) లో ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని బీసీసీఐ ప్రకటించింది. ఇందులో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చైర్మన్ రాజీవ్ శుక్లాకు కూడా చోటు దక్కింది. మరొకవైపు టీసీ మాథ్యూ(కేరళ క్రికెట్), నాబా భట్టచర్జీ(నార్త్ ఈస్ట్ ప్రతినిధి), జే షా(గుజరాత్ క్రికెట్ అసోసియేషన్)లతో పాటు బీసీసీఐ ట్రెజరర్ అనిరుధ్ చౌదరి, బీసీసీఐ సెక్రటరీ అమితాబ్ చౌదరిలు మిగిలిన సభ్యులుగా ఉన్నారు. ప్రధానంగా లోధా నూతన సంస్కరణలపై కోర్టు ఇచ్చిన తీర్పును ఉత్తమంగా అమలు పరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ కమిటీ నివేదిక అందిస్తుంది. ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వీటి అమలులో ఉన్న ఇబ్బందులను గుర్తించి సీఓఏకు తెలియజేయడమే కమిటీ ఏర్పాటు ఉద్దేశం.