కోహ్లి కంటే పుజారా గ్రేట్..: గంభీర్
న్యూఢిల్లీ: శ్రీలంకతో టెస్టు సిరీస్ విజయానంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టుల్లో బెస్ట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర పుజారే అని కితాబివ్వగా.. భారత మాజీ ఓపెనర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ మరో అడుగు ముందుకు వేసి పుజారాను ప్రశంసించాడు. ఈ టెస్టు బ్యాట్స్‌మన్.. కోహ్లి, ఓపెనర్ శిఖర్ ధావన్‌ల కంటే స్థిరమైన ఆటగాడని చెప్పుకొచ్చాడు.
ఓ ఇంగ్లీష్ పత్రికతో మాట్లాడుతూ.. మనం అంతగా టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వడంలేదని, ఈ కారణంగానే పుజారాకు సరైన గుర్తింపు రాలేదని అభిప్రాయపడ్డాడు. వన్డే, టీ20 ఆటగాళ్లనే ప్రజలు ఆదరిస్తున్నారని, ఈ తెల్లబంతి ఆటగాడు.. ఎర్రబంతి ఆటలోకి వస్తే టాప్ బ్యాట్స్‌మన్‌గా ఖచ్చితంగా గుర్తింపు పొందుతాడని కొనియాడాడు. కోహ్లి, ధావన్‌ల కంటే ఈ నయావాల్‌కు స్థిరంగా ఆడే అవకాశం ఉందని గంభీర్ చెప్పుకొచ్చాడు.
పుజారా ఒకే ఫార్మట్ ఆడటం ద్వారా బ్యాటింగ్ శైలి మారకుండా రాణిస్తున్నాడని ఈ మాజీ ఓపెనర్ అభిప్రాయపడ్డాడు. ఇక పుజారా టెస్టు ఫార్మాట్‌కు సిద్దమైనట్లు షార్ట్ ఫార్మట్‌కు సిద్దం కావడం కొంత కష్టమేనని తెలిపాడు. వన్డే, టీ20ల్లో విఫలమైతే ఒత్తిడితో టెస్టుల్లో రాణించలేమని ఇది పుజారాకు కలిసొచ్చే విషయమని గంభీర్ పేర్కొన్నాడు.
ఇదే పరిస్థితి కోహ్లి, ధావన్‌కు ఎదరవుతుందని తెలిపాడు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ పుజారాకు చాల సహాయం చేసిందన్న గంభీర్.. ఇంగ్లండ్ గడ్డపై బంతిని ఎదుర్కొవడం చాల కష్టమని ఈ అనుభవం శ్రీలంక పర్యటనలో పుజారాకు కలిసొచ్చిందని అభిప్రాయపడ్డాడు.