గౌతం గంభీర్ కు మళ్లీ పిలుపు
టీమిండియా ఆటగాడు గౌతమ్ గంభీర్ కు చాలా కాలం తర్వాత జట్టులో చోటు దక్కింది. న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తర్వాతి టెస్టులో గంభీర్ సభ్యుడు కానున్నాడు. తొలి టెస్టులో ఆడిన ఓపెనర్ లోకేశ్ రాహుల్ గాయపడటంతో కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీలు గౌతీకి అవకాశమిచ్చారు. దీంతో రెండు టెస్టులు ఆడేందుకు గంభీర్ కు చాన్స్ దొరికింది. తాను మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ జట్టులో చోటు లేకపోవడంపై గంభీర్ ఇటీవల అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
గంభీర్ జట్టులో స్థానం కోల్పోయి రెండేళ్లు గడిచిపోయింది. చివరగా 2014లో ఇంగ్లండ్ తో సిరీస్ ఆడాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గౌతీ భావిస్తున్నాడు. కోల్ కతా టెస్టుతో గంభీర్ పునరాగమనం చేయనున్నాడు. సాధారణ ఆటతీరుతో ఆకట్టుకోని రోహిత్ శర్మను కివీస్ సిరీస్ కు సెలక్షన్ ప్యానెల్ ఎంపికచేసింది. తాజాగా రాహుల్ గాయపడటంతో ఆ స్థానంలో గంభీర్ ను జట్టులోకి ఆహ్వానించారు.