న్యూఢిల్లీ: ఢిల్లీ రంజీ జట్టు కెప్టెన్సీ పదవి నుంచి గౌతం గంభీర్ వైదొలిగాడు. గత నాలుగేళ్లుగా ఢిల్లీ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న గంభీర్ ఎట్టకేలకు తన పదవికి గుడ్ బై చెప్పాడు. అయితే జట్టులో సభ్యుడిగా కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఈ మేరకు ఢిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీసీ) పరిపాలకుడు విక్రమ్ జిత్ కు లేఖ రాశారు. ఇక తాను కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైందని లేఖలో స్పష్టం చేసిన గంభీర్.. మరొకరి ఆ బాధ్యతను అప్పజెప్పాలని కోరాడు. జట్టుకు ఆటగాడిగా సేవలందిస్తానని గంభీర్ పేర్కొన్నాడు. దాంతో అతని స్థానంలో ఇషాంత్ శర్మను ఢిల్లీ రంజీ కెప్టెన్ గా నియమిస్తూ డీడీసీఏ నిర్ణయం తీసుకుంది.
గత విజయ్ హజారే ట్రోఫీ సీజన్ లో గంభీర్ స్థానంలో రిషబ్ పంత్ ను ఢిల్లీ కెప్టెన్ గా నియమించిన సంగతి తెలింసిందే. ఈ ట్రోఫీ సందర్భంగా ఢిల్లీ కోచ్ కేపీ భాస్కర్ ను గంభీర్ తీవ్రంగా దూషించాడు. కోచ్ చెత్త నిర్ణయాల వల్లే ఢిల్లీ జట్టు పేలవ ప్రదర్శన చేసిందంటూ మండిపడ్డాడు. ఈ క్రమంలోనే కోచ్ పై అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు. దాంతో అతనిపై నాలుగు మ్యాచ్ ల నిషేధం పడింది. అప్పట్నుంచి డీడీసీఏతో సఖ్యత కోల్పోయిన గంభీర్.. తాజాగా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.