కోల్‌కతా: ప్రతిష్టాత్మక ‘పింక్ టెస్టు’ విజయానంతరం ఉత్సాహంలో కెప్టెన్ కోహ్లి చేసిన వ్యాఖ్యలపై బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. సౌరవ్ గంగూలీ తరం కన్నా ముందు కూడా భారత్ ఇంటా బయటా టెస్టుల్లో విజయాలు నమోదు చేసిందంటూ కాస్త మందలింపు ధోరణిలో కోహ్లి వ్యాఖ్యలపై స్పందించారు. 70, 80 దశకాల్లో భారత్ గొప్ప విజయాలు సాధించిన సమయంలో కోహ్లి ఇంకా పుట్టి కూడా ఉండడు అంటూ సన్నీ వ్యాఖ్యానించారు. ‘గంగూలీ ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు.
అందుకే అతని గురించి మంచి విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో కోహ్లి.. గంగూలీ జట్టుతోనే భారత్ టెస్టుల్లో విజయాల బాట పట్టిందని అన్నట్లున్నాడు. చాలామంది 2000 దశకంలోనే క్రికెట్ ప్రారంభమైనట్లుగా భావిస్తారు. కానీ కోహ్లి జన్మించక ముందు నుంచే 70, 80 దశకాల్లో భారత్ టెస్టుల్లో విజయాలు సాధించింది. టీమిండియా 70వ దశకంలోనే విదేశీ గడ్డపై మ్యాచ్‌ల్ని గెలిచింది. ‘డ్రా’ చేసుకుంది. మిగతా జట్లలాగే కొన్నిసార్లు ఓడిపోయింది కూడా’ అంటూ మ్యాచ్ అనంతరం గావస్కర్ స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment